Take a fresh look at your lifestyle.

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ జల జగడం

కృష్ణానదీ జలాల వివాదాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలను ఎగదోస్తున్నాయి. పరస్పరం చేసుకుంటున్న ఫిర్యాదులను పరిశీలిస్తే ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు మరింత జటిలం అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఏపీ పనులు ప్రారంభించడంతో వివాదం అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఏపీ, తెలంగాణ మధ్య రాయలసీమ లిఫ్ట్‌కు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాయలసీమ లిఫ్ట్ అ‌క్రమమంటూ తెలంగాణ వాదిస్తున్నది. రాయలసీమ లిఫ్ట్ ‌మాకు న్యాయం రావాల్సిన వాటా, న్యాయంగా రావాల్సిన నీటిని తీసుకోవడం కోసం కడుతున్న ప్రాజెక్టే, కొత్త ప్రాజెక్ట్ ‌కాదు కాబట్టి అదేమీ అక్రమం కాదు అని ఆంధ్రప్రదేశ్‌ ‌వాదిస్తున్నది. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంది…రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంటున్నారు…కలిసి సమస్యను పరిష్కరించుకోవొచ్చు. కానీ ఎందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకోకుండా సమస్యను జటిలం చేస్తున్నారు. ముఖ్యమంత్రులు మౌనం వహిస్తుండగా, రాష్ట్రాల మంత్రులు మాత్రం రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వివాదాన్ని ఇంకా పెద్దదిగా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకుల భావన.

తెలుగు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లాయి. ఇప్పటికే ఏపీలో ప్రాజెక్ట్‌లపై కృష్ణాబోర్డుకు మరోసారి ఫిర్యాదు చేసింది తెలంగాణ. అక్కడ కడుతున్న ప్రాజెక్ట్‌లపై సుప్రీమ్‌ ‌కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌. ఏపీ-తెలంగాణ మధ్య జల వివాదాలు ఇటీవలి కేబినెట్‌ ‌సమావేశం సందర్భంగా మరోసారి చర్చకు వొచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్‌డీఎస్‌ ‌విస్తరణ జరుగుతుండగా.. తెలంగాణలో క్రిష్ణా నదిపై తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లకు రూపకల్పన చేస్తున్నది. పరిస్థితులు రెండు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి యుద్ధానికి దారితీస్తు రాష్ట్రాల మంత్రుల స్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్నది. ఈ క్రమంలోనే లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే, ఆంధ్రా వాళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేని, తెలంగాణ మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రాజెక్టులపై యుద్ధానికి సిద్ధం కావాలని పాలమూరు ప్రజలకు పిలుపునిచ్చారు. అక్రమ ప్రాజెక్ట్‌లను ఆపకపోతే పోరాటం తప్పదని ఏపీ సీఎం జగన్‌ను హెచ్చరించారు. కొత్త ప్రాజెక్టులు కట్టడం లేదని గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌కు చెప్పి దొంగతనంగా కడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ అన్ని వివరాలు తెప్పించారని, త్వరలోనే ప్రధానికి కూడా ఫిర్యాదు చేస్తారని చెప్పారు. అయినా ప్రాజెక్టులు ఆపకపోతే యుద్ధం తప్పదని హెచ్చరించారు.

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలంగాణ మంత్రులు అంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వానికి ఆదేశించిందని, డీపీఆర్‌ ‌లేకుండా ప్రాజెక్టును కట్టవొద్దని బోర్డు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. బోర్డు ఆదేశాలతో ఈ ప్రాజెక్టు అక్రమమని తేలిపోయిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతలను కట్టొద్దని హరిత ట్రైబ్యునల్‌ ‌చెప్పిందని బోర్డు ఆదేశాల ప్రకారం నిబంధనలకు లోబడి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత కేంద్రం, కృష్ణా బోర్డుకు ఏడు లేఖలు రాసినట్లు మంత్రులు ప్రశాంత్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీపైనా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం నాలుగురేట్లు పెంచింది కాంగ్రెస్‌ ‌హయాంలో కాదా? అని ప్రశ్నించారు. సీమకు నీళ్లు తీసుకెళ్తుంటే డీకే అరుణ హారతి పట్టారని గుర్తు చేసారు. ఏపీ ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ‌పార్టీ ఎందుకు పోరాటం చేయడం లేదని నిలదీశారు. బీజేపీ నేతలు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కొత్త ప్రాజెక్ట్‌లు కట్టడం లేదని గ్రీన్‌‌ట్రిబ్యునల్‌కు చెప్పి దొంగతనంగా కడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ అన్ని వివరాలు తెప్పించారని, త్వరలోనే ప్రధానికి కూడా ఫిర్యాదు చేస్తారని అంటూ, ఆంధ్రోళ్లంతా తెలంగాణ వ్యతిరేకులేనని వ్యాఖ్యానించారు. తెలంగాణను ఎదగనీయకుండా చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని అన్నారు. వైయస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి తెలంగాణ నీటిని దోచుకున్నారని, తాగడానికి కూడా తెలంగాణకు నీళ్లు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తండ్రిని మించి జగన్‌ ‌జలదోపిడీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వెనుకబాటు తనానికి వైయస్సారే కారణమని మంత్రి పేర్కొన్నారు. పాలమూరు ప్రజలు వలస పోవడానికి కూడా వైస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి కారణమని నింద వేసారు.

మరోవైపు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ ‌కుమార్‌ ‌బహిరంగంగా స్పందించి వైఎస్‌ ‌నీళ్ల దొంగ అని, జగన్‌ ‌గజదొంగ అని తెలంగాణ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలంగాణనే అక్రమ ప్రాజెక్టులు కడుతుందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. తప్పు చేస్తే భవిష్యత్తులోనూ ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తుంగభద్ర నదిపై జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని సుంకేశుల వద్ద తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టు సక్రమమైందా? అని అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌ప్రశ్నించారు. మీరు చేస్తే తప్పు లేదు…మేం నిబంధనల ప్రకారం చేస్తే తప్పా? అంటూ మండిపడ్డారు. ఏపీలో ఎక్కడా అక్రమ ప్రాజెక్టులు నిర్మించడం లేదని పునరుద్ఘాటించారు. కృష్ణా నుంచి మా వాటాకు సరిపడా నీరు తీసుకునేందుకే వీలుగానే పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌విస్తరణ చేపడతుతున్నామని చెప్పారు. చట్టాలకు లోబడే రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని, ఏపీకి కేటాయించిన నీటి వాటాను ఎక్కడా అతిక్రమించలేదని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 881 అడుగులు పైబడి ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌నుంచి నీటిని తీసుకునే వీలుంటుందని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటి వరకు పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని 15 రోజుల పాటే పొందగలిగే పరిస్థితి ఉందని, అందుకే పోతిరెడ్డిపాడు వద్ద ఇంకో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తే తప్పెలా అవుతుందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వమే 6 టీఎంసీల ప్రాజెక్టులను అక్రమంగా ఆరోపించారు. శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 800 అడుగులకు చేరినా ప్రాజెక్టులో నీరు తరలించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తుందని తెలిపారు. ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్థ్యం పెంచారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోనూ లిఫ్టు ఏర్పాటు చేశారని వివరించారు. సీఎం జగన్‌ ‌తెలంగాణ ప్రభుత్వానికి స్నేహ హస్తం అందించినా ఉపయోగం లేకుండా పోయిందని, నీటి వాటాలపై ఐదేళ్లుగా తాము పోరాడుతూనే ఉన్నామని మంత్రి తెలిపారు.

తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై ఆంధ్ర టీడీపీ, బిజెపి నేతలు, ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. ఆంధ్ర ప్రజలను మంత్రి లంక వాసులతో పోల్చడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడో జరగాల్సిన ఆర్‌డీఎస్‌ ‌కుడి కాలువ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణ, గోదావరి ట్రిబ్యునల్‌ ‌నుండి ఇష్టం వొచ్చినట్టు జలచౌర్యం చేస్తుందని ఆరోపించారు. తమకు రావాల్సిన 4టీఎంసీల నీటి వాటా ప్రకారం టెండర్‌ ‌వేసి కుడి కాలువ పనులు జరుగుతున్నాయని చెప్పారు. తమకు రావాల్సిన 4 టీఎంసీల నీటి వాటా ప్రకారం టెండర్‌ ‌వేసి కుడి కాలువ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఏపీ రాజకీయ నేతలు, ఏపీ ప్రజలు రాక్షసులా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరిపై యుద్ధం చేస్తారని నిలదీశారు బిజెపి సోము వీర్రాజు. తెలంగాణ నీటి వాటా తేల్చని కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామన్నారు. నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని గతంలో తాము చెప్పిందే ఇప్పుడు నిజమవుతుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‌వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో భవిష్యత్‌ ‌తరాలు ఇబ్బందులు పడే పరిస్థితులొచ్చాయని వ్యాఖ్యానిస్తూ రాజకీయ ట్విస్ట్ ‌ప్రదర్శించారు. తెలంగాణ మంత్రి ఆంధ్ర ప్రజలను లంకవాసులతో పోల్చడంపై కర్నూలు జిల్లా టిడిపి నేతలు మండిపడ్డారు. మంత్రాలయం నియోజవర్గంలో తాగునీటికి, రాఘవేంద్ర స్వామి అభిషేకం కూడా నీరు దొరకని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాలూ ఘర్షణ పడుతుంటే, రెండు రాష్ట్రాలకూ సమన్యాయం చేయాల్సిన కేంద్రం, నదీ జలాల బోర్డు మౌనం వహించి చోద్యం చూస్తున్నాయి.

Leave a Reply