Take a fresh look at your lifestyle.

50‌శాతం వాటాపై ఎపిలో రగులుతున్న రైతాంగం

కృష్ణా జలాల వివాదంలో సిఎం జగన్‌ ‌మేల్కోవాలని హెచ్చరిక
విజయవాడ,జూలై 5 : కృష్ణా జలాల్లో 50 శాతం వాటా తమకుందని కేసీఆర్‌ ‌చేసిన ప్రకటనపై ఇప్పుడు ఎపిలో విపక్ష పార్టీలతో పాటు, రైతు సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. కృష్ణా జలాలపై రాష్ట్ర రైతాంగానికి హక్కే లేనట్లుగా ఆయన మాట్లాడుతున్నారని ఆక్షేపిస్తున్నారు. ఏ ప్రాతిపదికన సగం వాటా తెలంగాణకు దక్కుతుందని నిలదీస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో ఆ రాష్ట్రం వాటా 105 టీఎంసీలు మాత్రమేనని గుర్తుచేస్తున్నారు. ఆంధ్ర రైతులు తమ నీటిని ఎప్పుడు, ఎంత, ఎలా వాడుకోవాలో కేసీఆర్‌ ‌నిర్దేశిస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జగన్‌ ‌మౌనం ఆయన మంత్రుల ప్రతివిమర్శలతో లాభం లేదని అంటున్నారు. తెలంగాణలోని ఆంధ్రులకు ఇబ్బందులు కలుగుతాయనే మిన్నకున్నట్లు జగన్‌ ‌చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోని ఆంధ్రులు కూడా అంగీకరించడం లేదు. కేసీఆర్‌తో పోరాటం చేయకుండా ఉండడానికి జగన్‌ ‌దీనిని సాకుగా చూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అన్ని ప్రాజెక్టుల్లో నూరు శాతం సామర్థ్యంతో జలవిద్యుదుత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 34పై ఆంధప్రదేశ్‌ ‌పోరాడాల్సి ఉంది.

న్యాయస్థానంలో సవాల్‌ ‌చేయాలి. కానీ జగన్‌ ‌ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వు చెల్లదని వాదిస్తూ పిటిషన్‌ ‌దాఖలు చేసింది. రైతుకు అండగా ఉండాలంటే ఇందులో ప్రభుత్వం కూడా ఇంప్లీడ్‌ ‌కావాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం చెబుతున్నా.. కేఆర్‌ఎం‌బీ ఆదేశాలు ఇచ్చినా తెలంగాన బేఖాతర్‌ ‌చేస్తోంది. యథేచ్ఛగా జలవిద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ‌పులిచింతల ప్రాజెక్టుల నుంచి అక్రమంగా నీరు తోడేయడంతో వేలక్యూసెక్కుఉల వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోందని అంటున్నారు. సాగర్‌, ‌పులిచింతల వద్ద తెలంగాణ పోలీసులను మోహరించడం మరింత ఆజ్యానికి కారణమయ్యింది. ఈ ప్రాజెక్టుల వద్దకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్క అధికారి కూడా వెళ్లలేకపోతున్నారు. చివరి అర్జీలు తీసుకు నేందుకూ తెలంగాణ అధికారులు అంగీకరించడం లేదు. మెయిల్‌ ‌చేసుకోవాలని.. ఫ్యాక్స్‌లో పంపుకోవాలని చెబుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వోద్యోగులకు కష్టం కలిగితే.. రాష్ట్రప్రభుత్వం తక్షణమే వారికి అండగా నిలుస్తుంది.

కానీ జల వనరులశాఖ ఇంజనీరింగ్‌ అధికారి సాగర్‌కు వెళ్లినప్పుడు చేతిలోని కాగితాన్ని కూడా తీసుకోకుండా తెలంగాణ పోలీసులు వెనక్కి పంపడాన్ని కూడా ఎపి నేతలు మండిపడుతున్నారు. అయినా మన రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం విస్తుగొల్పు తోందన్నారు. భారత్‌-‌పాకిస్థాన్‌ ‌సరిహ ద్దుల్లో మాదిరిగా ఏపీ-తెలంగాణ సరిహద్దులో పొరుగు రాష్ట్రం పోలీసులను మోహరించినా.. జగన్‌ ‌కిమ్మనడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దుర్నీతికి ఆంధ్ర ఆయకట్టు కృష్ణార్పణ మవుతోందని సాగు నీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ కోసం దక్షిణ తెలంగాణ ప్రజల మనోభావాలను వాడుకుంటున్న కేసీఆర్‌.. ‌కాళేశ్వరం ఎత్తిపోతలకు విద్యుత్‌ ‌కోసం కృష్ణా నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ‌పులిచింతల రిజర్వాయర్లపై జల విద్యుదుత్పత్తికి ఆదేశించారని ఓ ప్రకటనలో మండిపడ్డారు.

బేసిన్లు లేవు.. బేషజాలూ లేవన్న కేసీఆర్‌.. ఇప్పు‌డు ట్రైబ్యునళ్లూ లేవు.. తీర్పు లూ, చట్టాలూ లేవన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. కావాలనే జల వివాదాన్ని రాజేస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలం ఎగువ భాగాన ఏవిధమైన అనుమతులూ లేకుండా 150 టీఎంసీల సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టులు.. ఉన్న ప్రాజెక్టుల విస్తరణకు 105 టీఎంసీలు.. లాగేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో సాగర్‌, ‌ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం కింద ఉన్న 30లక్షల ఎకరాలకు నీరు రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేయడం అన్యాయం అని, దీనివల్ల నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఎపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ పరిస్థితి ఏర్పడటానికి సీమాంధ్రకు చెందిన నాయకులకు చిత్తశుద్ధి, దూరదృష్టి లేకపోవడమే కారణమని విమర్శలు కూడా ఉన్నాయి.

Leave a Reply