Take a fresh look at your lifestyle.

‘మహా’ సేవకురాలు.. వరంగల్‌ ‌నగరపాలక సంస్థ కమిషనర్‌..‌పమేలా సత్పతి

“ముఖ్యంగా పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న కమిషనర్‌ ‘‌హాట్‌స్పాట్‌’ ‌ప్రాంతాల ప్రజలకు ఇంటి వద్దకే సరుకులు సరఫరా చేయిస్తున్నారు. 25 మొబైల్‌ ‌వాహనాల ద్వారా 42 వేల ఇళ్లకు ఆర్డర్‌, ‌పేమెంట్‌ ‌పద్ధతిలో కూరగాయలు, ఇతర నిత్యావసరాలతోపాటు, ఔషదాలను కూడా అందిస్తున్నారు. వరంగల్‌తోపాటు హన్మకొండలో సూపర్‌మార్కెట్ల ద్వారా ‘హోం డెలివరీ’ చేయిస్తున్నారు. అక్షయపాత్ర భోజన పథకం ద్వారా ప్రతి రోజు 5340 మందికి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. దాతలు, స్వచ్చంధ సంస్థల సహకారంతో 500 మంది అన్నార్థులకు అల్పాహారం, భోజన వసతి కల్పించారు. ఆసరాలేని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సరఫరా చేసే 12 కిలోల బియ్యం 500 రూపాయల నగదును అందజేస్తున్నారు.”

 Commissioner of Warangal Municipal Corporation .. Pamela Satpathi

రుద్రమదేవి తెగువ..ఝాన్సి లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తి ఆమె సొంతం..ఓరుగల్లు మహానగరాన్ని కరోనా రహితంగా మార్చడానికి ఆమె కంకణబద్ధులై పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న ఆమే..వరంగల్‌ ‌నగరపాలక సంస్థ కమిషనర్‌ ‌పమేలా సత్పతి. చంటిబిడ్డ ఉన్నా..విధినిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యం ప్రదర్శించకుండా శ్రమిస్తున్నారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఎవరికైనా ఆపద వస్తే సమాచారం అందగానే సాయం అందిస్తున్నారు. వరంగల్‌ ‌మహానగరంలో కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టడానికి గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌కమిషనర్‌ ‌పమేలా సత్పతి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. తొలుత విదేశాల నుంచి వచ్చిన వారిని, తర్వాత మర్కజ్‌కు వెళ్ళివచ్చిన వారందరినీ గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో పాజిటివ్‌ ‌వచ్చిన వారిని గుర్తించి, ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో అత్యధికంగా గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌పరిధిలోనే 27 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మిగతా నలుగురు హైదరాబాద్‌ ‌గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకుండా కరోనా వ్యాప్తి చెందకుండా పమేలా సత్పతి పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రభుత్వ కంటి ఆసుపత్రి, కాకతీయ యూనివర్సిటి, హరిత కాకతీయ హోటల్‌, ‌పున్నమి గెస్ట్‌హౌజ్‌ ‌కేంద్రంగా నాలుగు క్వారంటైన్‌లు ఏర్పాటు చేసి వాటిలో 650 పడకలు సిద్ధం చేశారు. నిలువ నీడలేని వారి కోసం రెండు నైట్‌ ‌షెల్టర్లు ఏర్పాటు చేశారు. అలాగే 9700 మంది వలస కార్మికులు, 140 మంది దినసరి కూలీల కోసం వసతి సౌకర్యాలు కల్పించారు. పారిశుధ్య సిబ్బందికి 13 వేల మాస్కులను అందజేశారు. నగరంలోని 1.83 లక్షల కుటుంబాలకు మాస్కులు ఉచితంగా అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘గ్రేటర్‌’ ‌లోని 16 ప్రాంతాలను సంచార రహితంగా ప్రకటించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. డ్రోన్‌ ‌కెమెరాలను ఉపయోగిస్తూ నిఘాను మరింత పెంచారు. కంటెయిన్మెంట్‌ ‌కేంద్రాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్‌జోన్‌, ‌నో మూవ్‌మెంట్‌ ‌ప్రాంతాల్లో దారులన్నింటినీ పూర్తిగా మూసివేయించారు. పాజిటివ్‌ ‌కేసులు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఏఎన్‌ఎం‌లు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇందులో పాల్గొని వేలాది మందిని సర్వే చేశారు. ఎవరికైనా జ్వరం, కరోనా అనుమానిత లక్షణాలుంటే వారిని గుర్తించారు. అంతేగాక క్వారంటైన్‌ ‌ముగిసిన వారికి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు.

వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌గాంధీ హన్మంతు మార్గ నిర్దేశంలో..కమిషనర్‌ ‌పమేలా సత్పతి వైద్య ఆరోగ్యశాఖ, రెవిన్యూ, మున్సిపల్‌, ‌పౌరసరఫరాలు, ఫైర్‌ ‌సర్వీసెస్‌ ‌తదితర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. కమిషనర్‌ ‌ప్రతి రోజు రెడ్‌జోన్‌, ఆరెంజ్‌జోన్లలో పర్యటిస్తూ ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నారు. నాలుగు ఫైర్‌ ఇం‌జన్లు, రెండు యూపీఎల్‌ ‘‌స్ప్రే’ మిషన్లు, 130 చేతి పంపులతోపాటు మరో రెండు భారీ యంత్రాల ద్వారా సోడియం హైపో క్లోరైట్‌ ‌ద్రావణాన్ని నగరంలో పిచికారీ చేయిస్తున్నారు. అలాగే నగరంలోని 58 డివిజన్లలో ప్రతి రోజు బ్లీచింగ్‌ ‌పౌడర్‌ ‌చల్లుతున్నారు. కరోనా వైరస్‌ ‌కట్టడి కోసం 11 జీపుల ద్వారా ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న కమిషనర్‌ ‘‌హాట్‌స్పాట్‌’ ‌ప్రాంతాల ప్రజలకు ఇంటి వద్దకే సరుకులు సరఫరా చేయిస్తున్నారు. 25 మొబైల్‌ ‌వాహనాల ద్వారా 42 వేల ఇళ్లకు ఆర్డర్‌, ‌పేమెంట్‌ ‌పద్ధతిలో కూరగాయలు, ఇతర నిత్యావసరాలతోపాటు, ఔషదాలను కూడా అందిస్తున్నారు. వరంగల్‌తోపాటు హన్మకొండలో సూపర్‌మార్కెట్ల ద్వారా ‘హోం డెలివరీ’ చేయిస్తున్నారు. అక్షయపాత్ర భోజన పథకం ద్వారా ప్రతి రోజు 5340 మందికి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. దాతలు, స్వచ్చంధ సంస్థల సహకారంతో 500 మంది అన్నార్థులకు అల్పాహారం, భోజన వసతి కల్పించారు. ఆసరాలేని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సరఫరా చేసే 12 కిలోల బియ్యం 500 రూపాయల నగదును అందజేస్తున్నారు.

వరంగల్‌ ‌మహానగరంలో క్రమంగా కరోనా వైరస్‌ ‌తగ్గుతుండడం శుభసూచకమని పమేలా సత్పతి అన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్‌ ‌కేసులు లేని నగరంగా వరంగల్‌ ‌మారే అవకాశముందని ఆమె అభిప్రాయపడ్డారు. వైరస్‌ ‌సోకిన వారిలో 97 శాతానికి పైగా కోలుకుని, డిశ్చార్జి అవుతుండడం మంచి పరిణామమని పేర్కొన్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో కొన్ని ప్రాంతాల్లోనే వైరస్‌ ‌సోకిందని, ప్రజలెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, గత కొద్ది రోజులుగా బల్దియా పరిధిలో వైరస్‌ ‌వ్యాప్తి చాలా వరకు తగ్గిందన్నారు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మళ్లీ పాజిటివ్‌ ‌కేసులు వచ్చినా వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌కార్పొరేషన్‌ అన్ని విధాల సంసిద్ధంగా ఉందని కమిషనర్‌ ‌పమేలా సత్పతి స్పష్టం చేశారు. మహానగరంలో లాక్‌డౌన్‌ ‌నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్ల వైరస్‌ ‌వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నట్లు చెప్పారు. రాబోయే కొద్దిరోజుల్లో ఒక్క పాజిటివ్‌ ‌కూడా రాని పరిస్థితి వస్తుందనే నమ్మకం ఏర్పడుతోందని ఆమె తెలిపారు..నగరంలో పాజిటివ్‌ ‌కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన తాము ఏమాత్రం ఉదాసీనంగా ఉండబోమని, ప్రతిక్షణం అప్రమత్తంగానే ఉంటామన్నారు. మళ్లీ ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చి, కేసుల సంఖ్య పెరిగినాసరే, సమర్థవంతంగా ఎదుర్కొవడానికి అన్ని విధాల సిద్ధంగా ఉన్నామన్నారు. టెస్టింగ్‌కిట్స్, ‌పీపీఈకిట్లు, ఎన్‌95 ‌మాస్కులు, ఇతర మాత్రలు, పరికరాలు, బెడ్సు అన్ని సిద్ధంగా ఉన్నాయని పమేలా సత్పతి తెలిపారు. లాక్‌డౌన్‌ ‌మే 7 వరకు కొనసాగుతున్నందున ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలని ఆమె కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. అన్ని మతాల వారు తమ ప్రార్థన కార్యక్రమాలను, పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలని ఆమె సూచించారు. రంజాన్‌ ‌మాసంలో ముస్లింలు ఇళ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాలి.. భౌతిక దూరం పాటించాలి.. రెడ్‌జోన్లు, నో మూవ్‌మెంట్‌ ఏరియాల్లో ప్రజలు అనవసరంగా బయటికి రావద్దన్నారు. కరోనాపై భయంవద్దు..జాగ్రత్తలు పాటిస్తే చాలంటున్నారు కమిషనర్‌ ‌పమేలా సత్పతి! రాష్ట్రంలో ఈ వైరస్‌ ‌వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పద్ధతులను ఇక్కడ యథాతథంగా అమలు చేస్తుండడంతో.. నగరంలో కరోనా పాజిటివ్‌ ‌కేసులు తగ్గుతున్నాయి. రోజంతా లాక్‌డౌన్‌.. ‌రాత్రివేళల్లో కర్ఫ్యూ ఆంక్షలవల్ల ప్రస్తుతం కరోనా వైరస్‌ అదుపులో ఉన్నది. అధికారుల కఠోర శ్రమతోనే కరోనా ‘ఫ్రీ’ అయింది. నగరంలో పాజిటివ్‌ ‌కేసులు తగ్గు ముఖం పట్టడంలో కమిషనర్‌ ‌పమేలా సత్పతి కృషి ఎంతో ఉందని నగరవాసులంటున్నారు.

Gaddam Keshavamurthy
గడ్డం కేశవమూర్తి,
సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy