“కొరోనా వైరస్ తో తెలంగాణ ప్రజలు దుర్భర జీవన స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం, ప్రభుత్వ నాయకత్వం కొరోనా సమస్యను అధిగమించచడానికి ఐక్యతతో పనిచేయాల్సిన సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడు, ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రి పదవునుండి తొలిగించి రాజకీయాలనుండి తప్పించడం రాష్ట్రంలో కొరోనా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసినట్లయింది. కెసిఆర్ స్వీయ రాజకీయ ప్రయోజనాలకిచ్చిన ప్రాధాన్యతను సామాజిక సమస్యకు ఇవ్వలేదని స్పష్టంగా అర్ధమవుతుంది. ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో త్యాగాలు, మరెన్నో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా ఆంధ్ర పాలనలోకన్నా అధ్వాన్నమై నాయి. అందుకే తెలంగాణలో ‘‘యుద్ధం మిగిలే ఉంది’’
చారిత్రక సందర్భాన్ని చేజార్చుకుంటున్న ఈటల
కొరోనా వైరస్ తో తెలంగాణ ప్రజలు దుర్భర జీవన స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం, ప్రభుత్వ నాయకత్వం కొరోనా సమస్యను అధిగమించచడానికి ఐక్యతతో పనిచేయాల్సిన సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడు, ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రి పదవునుండి తొలిగించి రాజకీయాలనుండి తప్పించడం రాష్ట్రంలో కొరోనా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసినట్లయింది. కెసిఆర్ స్వీయ రాజకీయ ప్రయోజనాలకిచ్చిన ప్రాధాన్యతను సామాజిక సమస్యకు ఇవ్వలేదని స్పష్టంగా అర్ధమవుతుంది. ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో త్యాగాలు, మరెన్నో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా ఆంధ్ర పాలనలోకన్నా అధ్వాన్నమై నాయి. అందుకే తెలంగాణలో ‘‘యుద్ధం మిగిలే ఉంది’’
అవినీతిపరులకు, బడా వ్యాపారులకు, భూ కబ్జాదారులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వారిని తన గుప్పిట్లో ఉంచుకోవడంలో కెసిఆర్ సఫలీకృతు డయ్యాడు. అంతేకాకుండా ఇతర పార్టీల్లో గెలిచిన వ్యాపార ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకొని పార్టీలోని ఎమ్మెల్యేలు బయటకు పోకుండా ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నాడు. కొడుకు కెటిఆర్‌ను ఎట్లాగైనా ముఖ్యమంత్రి చేయాలనే ధ్యాస తప్ప కెసిఆర్ కు ప్రజల యోగ క్షేమాలు పట్టడం లేదు. ఈ పాలనను ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరమున్న ఇలాంటి తరుణంలో తెలంగాణలో ‘‘యుద్ధం మిగిలే ఉంది’’
ప్రజలు కెసిఆర్ పాలన నుండి విముక్తి ఎట్లనా అని ఆలోచిస్తున్న తరుణంలో ఈటల ఉదంతం జరిగింది. కెసిఆర్ పాలనలో మోసపోయిన పీడిత ప్రజలంతా ఈటల వైపు ఆశగా చూసారు. ప్రజా సంఘాలు సంఘీభావం పలికాయి. కెసిఆర్ ను ఎదిరిస్తే మేము తోడుంటామని పలువురు ప్రకటించారు. ‘‘ఈటలకు మద్దతుగా మేము సైతం’’ అంటూ రణభేరి మ్రోగించారు. ఈటల మద్దతు పేరున కేసిఆర్ ను కేసీఆర్ కుటుంబ, ప్రభుత్వ పాలనను దునుమాడారు. తెలంగాణ ద్రోహులకు పెద్ద పీట వేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈటల వైపు ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూసి, ఆశలు పెట్టుకున్నారు. కరోనా మరణాలను కూడా లెక్క చేయకుండా ఈటల కోసం ఎంతో శ్రమ పడ్డారు. ప్రజలు ఈటలకు మద్దతు పలకడం వెనుక ఈటలపై నమ్మకం, అభిమానమే మాత్రమే కాదు కేసిఆర్ పైనున్న వ్యతిరేకత తోడైనాయి.
ప్రజలు, ప్రజా సంఘాలు ఒకలాగా ఆలోచిస్తే ఈటల మరోలాగా ఆలోచించాడు. ప్రస్తుతం రాజకీయాలు, ఎన్నికలు అంటే కోట్ల రూపాయలతో కూడుకున్నవని, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న కెసిఅర్ ను ఎదుర్కోవాలంటే అంతకన్నా పెద్ద అండ కావాలని ఈటల ఇతర పార్టీల నాయకులతో చర్చలు జరుపుతూ ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నాడు. దాంతో తెలంగాణ ప్రజలు నిరుత్సానికి గురైనారు. ఇలాంటి నిరుత్సాహాలు, ఆశ నిరాశాలు, గెలుపు ఓటములు తెలంగాణ ప్రజలకు కొత్తేమి కాదు. తెలంగాణ ప్రజలకు ఎన్ని సార్లు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పోరాటం చేస్తూనే ఉన్నారు. నేటి స్థితిలో కూడా నిరుత్సాహానికి గురికాకుండా ప్రజలకు విముక్తి జరిగే వరకు పోరాటానికి సిద్ధమయ్యారు. అందుకే తెలంగాణ ప్రజలకు ‘‘యుద్ధం మిగిలే ఉంది’’
తెలంగాణ ప్రజలు రెండు పోరాటాలు చేయాల్సివుంది. ఒకటి రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనను ఎదిరించాలి. రెండవది కొత్త రాజకీయ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలి. అందుకోసం ‘‘యుద్ధం మిగిలే ఉంది’’. విలువలతో కూడిన ప్రజాస్వామిక రాజకీయ నిర్మాణం కోసం ప్రజలంతా యుద్దానికి సిద్ధం కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకుని అధికార టిఆర్ఎస్ ను ఎదిరించే అవకాశం కనపడడం లేదు. 2023 లో బిజెపి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం మెండుగా ఉంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇంకొక ప్రాంతీయ పార్టీ వస్తేనే కెసిఅర్ కు చెక్ పెట్టవచ్చు. ఇలాంటి అవకాశాన్ని ఈటల జారవిడుచుకోకుండా రాష్ట్రమంతా తిరిగి పార్టీ నిర్మాణం చేయాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటు న్నారు. వేరే పార్టీల్లో ఈటల చేరితే ఒక చారిత్రక సందర్భాన్ని చేజార్చుకోవడమే కాకుండా చరిత్ర లేని వాడుగా మిగిలిపోతాడు. ఇప్పటి రాజకీయ పరిణామాల్లో పోరాట చరిత్ర కలిగి మరో పోరాటానికి నాంది పలికే అవకాశం ఈటలకు మాత్రమే ఉంది. ప్రభుత్వంపై ప్రజలకున్న తీవ్ర వ్యతిరేకతతో తక్కువ శ్రమతో ఈటల చరిత్రలో నిలిచి ప్రజలకు సేవ చేసే అవకాశముంది.
ఈటల రాజేందర్ ఉదంతాన్ని బిజెపి అందివచ్చిన అవకాశంగా మార్చుకోవాలని చూస్తునినది. అందుకే రాష్ట్రంలో ప్రముఖ నాయకులతో చకచకా పావులు కదుపుతున్నారు. ఎత్తులు జిత్తులు చేయగల బిజెపి తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నది. బిజెపి ఎదురు చూపుకు కెసిఆర్ క రాజకీయాలతో పాటు ఈటల లాంటి నాయకుల సహకారం అందివచ్చిన అవకాశంగా మారనుంది. ఈ పరిణామాలన్ని చూస్తే రానున్న రోజుల్లో కెసిఆర్ టిఆర్ఎస్ ఓడిపోవచ్చు, టిఆర్ఎస్ పోయి బిజెపి వస్తే తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అవుతుంది. తెలంగాణలో ‘‘యుద్ధం మిగిలే ఉంది’’
ఎంతో ఉద్యమ చరిత్ర కలిగిన తెలంగాణ లో రాజ్యాంగ బద్దంగా ఎన్నో చిక్కులను ఛేదించి తెలంగాణ సాధించుకున్న ప్రజలకు కెసిఆర్ ప్రభుత్వాన్ని దించడం పెద్ద విషయమేమి కాదు. మేధావులు, ప్రగతిశీల అభ్యుదయ వాదులు ఈటలకు మద్దతు పలికి ప్రజాస్వామిక తెలంగాణ స్థాపనలో భాగంకావాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకపాత్ర పోషించిన యోధులు సర్ధార్ సర్వాయి పాపన్న, కొమరం భీమ్, సోయం గంగులు చాకలి ఐలమ్మ, షేక్ బందగి, బత్తిని మొగిలయ్య గౌడ్, దొడ్డి కొమురయ్య, నల్ల నర్సింహులు, యాదగిరి, టాను నాయక్, ఈశ్వరిబాయి, సదా లక్ష్మి, బెల్లి లలిత, బి.ఎన్ రెడ్డి, మారోజు వీరన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ మద్దికాయల ఓంకార్, కేశవరావు జాధవ్, కె.జి. సత్యమూర్తి, కొల్లూరి చిరంజీవి, బి.ఎస్ వెంకట్రావు, అరిగె రామస్వామి, దర్గ్యా నాయక్, ప్రొఫెసర్ జయశంకర్, బియ్యాల జనార్దన్, బుర్ర రాములు, శ్రీకాంత చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదన్న, భూపతి కృష్ణమూర్తి, సంగంరెడ్డి సత్యనారాయణ, ఆమోస్, కాళోజి, తిప్పని సిద్ధులు, నలిగింటి చంద్రమౌళి, పురుషోత్తమ రావు ల లాంటి వారసులుగా తెలంగాణ ప్రజలు బరిగీసి కొట్లాడి ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకోవడానికి యుద్ధానికి సిద్ధమవ్వాలి.
చిత్తశుద్ధి, అంకితభావం కలిగి ప్రజల పట్ల సేవా దృక్పధం గలవారు, నిజాయితిగల ఉద్యమకారులు, యువకులు, విద్యావంతులు, బుద్ధి జీవులు, రాజనీతిజ్ఞులు త్యాగధనులు సిద్ధం కావాల్సిన చారిత్రక సందర్భం. రాష్ట్రంలో నెలకొన్న ప్రమాద పాలనను నివారించాల్సిన బాధ్యత కూడా తెలంగాణ సమాజంపైనుంది. పాలనలో ప్రజాస్వామిక సంస్కరణ కోసం ప్రజాస్వామిక వర్గాల నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు బలపరచి కొట్లాడాల్సిన అవసరాన్ని గుర్తుంచాలి.
‘‘యుద్ధం మిగిలే ఉంది’’…
– సాయిని నరేందర్
9701916091