Take a fresh look at your lifestyle.

అసెంబ్లీలో మాటల యుద్ధం

  • మున్సిపాలిటీలకు నిధుల విషయం ఏమైంది: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
  • అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే గెలుస్తున్నాం: మంత్రి కేటీఆర్‌
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ ‌మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వడం లేదనీ, దీంతో అభివృద్ధి ఆగిపోయిందని కోమటిరెడ్డి చేసిన విమర్శలకు కేటీఆర్‌ ‌దీటుగా స్పందిస్తూ అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే ఎన్నికలలో గెలుస్తున్నామని సమాధానం ఇచ్చారు.
తెలంగాణ వర్షాకాల సమావేశాల సందర్భంగా నాలుగో రోజైన గురువారం జీరో అవర్‌లో మున్సిపాలిటీల అభివృద్ధిపై జరిగిన చర్చ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని చౌటుప్పల్‌, ‌చండూరు మున్సిపాలిటీలకు నిధులు మంజూరు కావడం లేదన్నారు. ఆయా మున్సిపాలిటీలకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు సైతం కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్న విధంగా తయారైందని వ్యాఖ్యా నించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెలా మున్సిపాలిటీలకు రూ. 148 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇటీవల రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 122 మున్సిపాలిటీలకు టీఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకుందని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏమీ చేయకపోతే ప్రజలు ఎందుకు ఓట్లు వేసి గెలిపిస్తారు ? ఈ విషయాన్ని కోమటిరెడ్డి గుర్తించాలని సూచించారు. జీరో అవర్‌లో మైక్‌ ఇచ్చినా ప్రభుత్వంపై విమర్శలు చేసి హీరోయిజం చేస్తామంటే కుదరదని చురక అంటించారు. ప్రజలు అందరి మాటలు వింటున్నారనీ, వాస్తవాలు మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారని వ్యాఖ్యానించారు. ఇకనైనా  ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించడం మానుకోవాలని సూచించారు.
image.png

మంత్రులకు స్పీకర్‌ ‌చురక
అసెంబ్లీ సమావేశాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు కోవిడ్‌ ‌నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని శాసనసభ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. నిబంధనలు ఎవరికైనా ఒకటేననీ, ఈ విషయాన్ని ప్రతీ సభ్యుడూ గుర్తించాలని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు పక్కనే ఉన్న నో సీటింగ్‌ ‌చైర్‌లో మంత్రి జగదీష్‌రెడ్డి వచ్చి కూర్చున్నారు. దీన్ని గమనించిన స్పీకర్‌ ‌పోచారం మంత్రులు కోవిడ్‌ ‌నిబంధనలు పాటించాలని సూచించారు. స్పీకర్‌ ‌సూచనతో వెంటనే ఈటల వద్ద నుంచి మంత్రీ జగదీశ్‌రెడ్డి వెళ్లిపోయారు. కోవిడ్‌ ‌నిబంధనలు అందిరి కోసమనీ, ఈ విషయాన్ని సభ్యులంతా గమనించాలని ఈ సందర్భంగా పోచారం వ్యాఖ్యానించారు.

Leave a Reply