కొరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది : బీజేపీ
కేంద్రం చిల్లర రాజకీయాలు చేస్తోంది : టీఆర్ఎస్
కొరోనా అంశంపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో కొరోనా విజృంభణకు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వైఫల్యమే కారణమని బీజేపీ విమర్శిస్తుండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై గత రెండు రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు రక్తికడుతున్నాయి. వారం రోజుల క్రిందటి వరకూ రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉండేది. అయితే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు
ఆదేశాల మేరకు ప్రభుత్వం కొరోనా టెస్టుల సంఖ్యను భారీ ఎత్తున పెంచింది. దీంతో అదే సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం తారాస్థాయికి చేరింది. కొరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. కోఠి కంట్రోల్ కమాండ్ సెంటర్ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పార్టీ ఇతర ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పక్క రాష్ట్రమైన ఏపీలో ప్రతీ రోజూ వేల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే తెలంగాణలో మాత్రం కనీసం వందల సంఖ్యలో కూడా చేయడం లేదని రాష్ట్రంలో మాత్రం కనీసం వేల సంఖ్యలో కూడా చేయడం లేదనీ సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు గొప్పగా చెప్పిన గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి ఎందుకు మూలకు పడిందనీ, కొరోనా రోగులకు వైద్య చికిత్సలను ఎందుకు అందించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో కొరోనా రోగులకు వైద్యం చేసేందుకు వైద్యులకే రక్షణ లేకుండా పోయిందనీ, పీపీఈ కిట్లు, మాస్కులు కూడా లేవని ఆందోళనకు దిగుతుంటే సీఎం కేసీఆర్, మంత్రులు పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. కొరోనా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు మంజూరు చేసింది ? వాటిని ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేసిందో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కొరోనా అంశంపై ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న దాడిని తిప్పికొట్టేలా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఏకంగా కేంద్ర ప్రభుత్వంపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. కొరోనా పేరుతో బీజేపీ కంపు రాజకీయాలు చేస్తున్నదని ప్రతి దాడికి దిగారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ధర్నాల పేరుతో ఆందోళనలు చేయడం తప్ప కేంద్రం నుంచి నిధులు తేవడం చేతకాదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొరోనా కట్టడికి కేవలం రూ. 214 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. దీపాలు వెలిగించాలంటూ…చప్పట్లు కొట్టాలంటూ సుద్దులు చెప్పడమే తప్ప కేంద్రం రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదని మండిపడ్డారు. రోజుకు 4 వేల టెస్టులు చేయగలిగే సామర్యం కలిగి ఉన్న కోబాస్ యంత్రాన్ని తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేస్తే ఆ యంత్రాన్ని కేంద్ర ప్రభుత్వం కోల్‌కతాకు పంపించేలా ఐసీఎంఆర్‌ను ఆదేశించిందనీ, దీనికి సంబంధించిన లేఖను మీడియాకు విడుదల చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం గల్లీ నాయకుని స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనీ, ఇప్పటికైనా ఆయన చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కొరోనా టెస్టుల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను ఎన్నిసార్లు మార్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తూ.చ. తప్పకుండా పాటించిందని స్పష్టం చేశారు. కొరోనా నివారణకు, చికిత్సకు నిధులివ్వకుండా బీజేపీ రాజకీయాలు చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల హితం కోరి సాధ్యమైనన్ని ఎక్కువ టెస్టులు చేస్తున్నదని దీటుగా సమాధానమిచ్చారు. ఇప్పటికైనా కొరోనా పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరపడుతుందో లేదో చూడాలి.
Next Post