“20వ శతాబ్దంలో ఎన్నో యుద్ధాలు ఘోరమానవ హననానికి హేతువులయ్యాయే గాని మనిషికి భద్రత కలిగించలేకపోయాయి. యుద్ధాలని ప్రారంభించిన ఎందరో పాలకులు ఓటమి అనంతం ఉరికంభం ఎక్కడమో, ఆత్మహత్య చేసుకోవడమో లేదా అజ్ఞాతంలోకి వెళ్ళడమో 20వ శతాబ్దం చూసింది. యుద్ధం ఎవరికి శ్రేయస్కరం కాదు. అంతదాక ఎందుకు యుద్ధం చేయడం సైనికులకే ఇష్టం ఉండదని చరిత్ర చెబుతుంది. ఇక్కడ డగ్లస్ మెకార్థర్ చెప్పిన ఒక గొప్ప మాటను చెప్పుకోవాలి ‘‘అందరికన్నా ఎక్కువగా శాంతి కోసం ప్రార్థించేది సైనికుడే. ఎందుకంటే యుద్ధం చేసే లోతైన గాయాలను, చేదు భాదలను అనుభవించేది ఆయనే మరి’’
ఇరవయ్యో శతాబ్దం ఎన్నో యుద్ధాలకు, మారణహోమాలకు సాక్షిగా నిలిచిన కాలం. మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు యావత్ ప్రపంచ మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చూపినవే. దేశాల మధ్య సంభవించే విభిన్న వ్యతిరేకతలు యుద్ధాల రూపంలో అంతర్జాతీయ హత్యలకు హేతువులవుతున్నాయి. ఆదిమకాలం నుంచి నేటి వరకు యుద్ధం ఏ రూపంలో సంభవించినా అది ఏ ఒక పక్షానికి న్యాయం చేయలేకపోయిందనేది నిర్వివాదాంశం. అలగ్జాండర్ మొదలుకొని హిట్లర్ వరకు యుద్ధాలు చేయడంలో ఎవరి కారణాలు వారికున్నాయి.అయితే అంతిమ ఫలతం మాత్రం విషాదం కావడమే ఇక్కడ అతి పెద్ద విషాదం. ప్రస్తుతం భారత-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచమంతా భవిష్యత్తు పరిణామాల పట్ల ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఆధునిక కాలంలో జరిగిన అనేక యుద్ధాలు మానవాళికి అంతులేని వేదనను కలిగించినవే..
మొదటి ప్రపంచయుద్ధం చేసిన గాయం ఇంకా మానక మునుపే 1939-1945 మధ్యకాలంలో జరిగిన రెండవ ప్రపంచయుద్ధం మానవ చరిత్రలోనే అత్యంత భయానక యుద్ధమని చెప్పవచ్చు. యుద్ధం ముగిసే సమయానికి మరణించిన ప్రజల సంఖ్య దాదాపు 60 మిలియన్లు. అంటే నాటి ప్రపంచ జనాభలో ఇది మూడవ వంతు, అంటే ఎంత ప్రాణ నష్టం జరిగిందో గ్రహించవచ్చు.మొదటి ప్రపంచయుద్ధమేమి తక్కువ తినలేదు. 8.5 మిలియనుల సైన్యం ప్రత్యక్షంగా మరణించగా, 13 మిలయనుల ప్రజలు అకారణంగా అసువులుబాసారు. ఈ రెండు ప్రపంచ యుద్ధాలు కలిసి దాదాపు 50 నుంచి 100 మిలియన్ల ప్రాణాలు తీసుకున్నాయి. ఇక ఈ జాబితాలో మూడవ స్థానం రష్యన్ సివిల్ వార్ ది. యూరోప్ మొత్తం వ్యాపించనప్పటికినీ రష్యన్ పౌర యుద్ధంలో దాదాపు 9 మిలియన్ల ప్రజలు మరణించారు. ఇది అమెరికా పౌర యుద్ధంలో మరణించిన వారికన్నా 14 రెట్లు ఎక్కువ భయానకమైనది.
వియత్నాం, కాంబోడియా, లావోస్ దేశాలలో ఫ్రాన్స్(1946-54) అమెరికా(1950) దేశాల సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన యుద్దాలని ఇండోచైనా యుద్ధమని మరియు వియత్నాం యుద్ధమని పిలుస్తారు. 19 శతాబ్దపు చివరిభాగంలో ఫ్రెంచ్ దళాలు వియత్నాంను క్రమక్రమంగా ఆక్రమించడం మొదలుపెట్టి, 1883-1939 మధ్యకాలంలో తమ సంరక్షిత ప్రాంతంగా ప్రకటించుకున్నాయి. అంతేకాకుండా 1939-1945 మధ్యకాలంలో వియత్నాంను పూర్తిగా తమ పాలనలోకి తెచ్చుకున్నాయి. వియత్నాం జాతీయ నాయకుడు హోచిమిన్ 1945లో వియత్నాం స్వతంత్రదేశం అని ప్రకటించడంతో ఫ్రాన్స్ యుద్ధం ప్రకటించింది. వియత్నాం విజయంతో మొదటి ఇండోచైనా యుద్ధం ముగిసింది. 1946-1954 మధ్య జరిగిన ఇండోచైనా యుద్ధం (ఫ్రాన్స్ లో ఈ యుద్ధాన్ని ఇండోచైనా వార్ అని, వియత్నాంలో యాంటీ ఫ్రెంచ్ రెసిస్టెన్స్ వార్ అని పిలుస్తారు). ఉత్తర వియత్నాంలోని టోంకిన్ కేంద్రంగా సాగిన ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు పెద్దమొత్తంలో ప్రాణనష్టం జరిగింది.ఫ్రాన్స్ దేశానికి చెందిన లెఫ్టిస్టులు ఈ యుద్ధాన్ని ‘డర్టీ వార్’’ (లా సెలె గుర్రె) అని పిలుచుకున్నారు. ఈ యుద్దాలలో జరిగిన ప్రాణ నష్టం నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షల మధ్య ఉంటుంది.
1948లో జరిగిన అరబ్-ఇజ్రాయేల్ యుద్ధం మానవాళి మీద తీవ్ర ప్రభావం చూపినదే. 1947 నవంబర్ నెలలో బ్రిటీష్ ఏలుబడిలో ఉన్న పాలస్తీనాను యూదూరాజ్యం, అరబ్ రాజ్యంగా విభజించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఇది పాలస్తీనాలోని యూదులు మరియు అరబ్బుల మధ్య తీవ్ర అలజడిని సృష్టించింది. బ్రిటీష్ దళాలు కూడ పాలస్తీనా ప్రాంతం నుంచి ఉపసంహరింపబడడంతో 15 మే,1948న ఇజ్రాయేల్ స్వతంత్రం ప్రకటించుకుంది. తరవాతిదినం ఈజిప్ట్, ట్రాన్స్ జోర్డాన్(జోర్డాన్), ఇరాక్, సిరియా మరియు లెబనాన్ దేశాలతో కూడిన అరబ్ కూటమి యూదులకు కేటాయించబడని పాలస్తీనా ప్రాంతాలతో పాటు జెరూసలేంను కూడ ఆక్రమించింది. ఈ సంఘటన అరబ్-ఇజ్రాయేల్ యుద్ధానికి దారితీసింది.ఇజ్రాయేల్ దళాలు అరబ్ దాడులను తిప్పికొట్టడమే కాకుండా జెరూసలేంను కూడ తిరిగి దక్కించుకున్నాయి. 1949 ఫిబ్రవరి-జూలై మధ్యకాలంలో తాత్కాలిక యుద్ధ విరమణ జరిగి, ఇజ్రాయేల్ కు అరబ్బు దేశాలకు మధ్య సరిహద్దులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇజ్రాయేల్ చరిత్రలో ఈ యుధ్ధం ఒక గొప్ప స్వాతంత్రపోరాటంగా నిలిచిపోగా, అరబ్బులు దీనిని ‘నక్బా’ (విపత్తు) అని పిలిచారు.
1950-1953 మధ్యకాలంలో జరిగిన కొరియన్ యుద్ధం రెండు కొరియా దేశాల మధ్య జరిగి అంతులేని అగధాన్ని సృష్టించింది. 1950 జూన్ నెలలో ఉత్తర కొరియా దక్షిణ కొరియా ప్రాంతాన్ని ఆక్రమించడంతో యుద్ధం ప్రారంభమైంది. అమెరికా సోవియట్ యూనియన్ ల మధ్య జరిగిన ప్రచ్చన్నయుద్ధం ఫలితంగా కొరియా రెండుగా వీడిపోయి, ఎవరికివారే తాము కొరియా ప్రజలకు న్యాయమైన పాలకులమని ప్రకటించుకున్నాయి. 1950లో ప్రారంభమైన ఈ యుద్ధంలో అమెరికా, ఐక్యరాజ్య సమితి దళాలు దక్షిణ కొరియా పక్షాణ నిలువగా, సోవియట్ యూనియన్, చైనా దేశాలు ఉత్తర కొరియాకు మద్దతుగా యుద్ధంలోకి దిగాయి. 1953 వరకు సాగిన ఈ యుద్ధంలో దాదాపు 2.5 మిలియనుల ప్రజలు మరణించారు. వియత్నాం యుద్ధం లేద రెండవ ఇండోచైనా యుద్ధంగా ప్రసిద్ధి గాంచిన ఈ మిలటరీ పోరాటం 1959-1974 మధ్యకాలంలో వియత్నాం, కాంబోడియా,లావోస్ ప్రాంతాలలో సంభవించింది.కమ్యూనిస్టుల ప్రాభల్యం గల ఉత్తర వియత్నాం మరియు అమెరికా మద్ధతు గల దక్షిణ వియత్నాం ప్రాంతాల మధ్య జరిగిన ఈ యుద్ధం ప్రచ్చన్నయుద్ధంలో భాగంగానే జరిగిందని చెప్పవచ్చు. కమ్యూనిస్ట్ ప్రాభల్యాన్ని నిరోదించేందుకు యుద్ధంలోకి దిగిన అమెరికా 1960-70 మధ్య కాలంలో ఉత్తర వియాత్నాం మీద అన్ని రకాల ఆంక్షలు విధించేందుకు ప్రయత్నించింది. 19 సంవత్సరాలపాటు సాగిన ఈ యుద్దానికి 1973లో జరిగిన పారిస్ శాంతి ఒప్పందం ఒక మలుపు తిప్పింది. 1975 ఏప్రిల్ లో సైగాన్ పట్టణాన్ని ఉత్తర వియత్నాం దళాలు ఆక్రమించడంతో వియత్నాం యుద్ధం ముగి సింది. ఆ తరువాతి సంవ త్సరం ఉత్తర,దక్షిణ వియ త్నాంలు కలిసి పో యాయి. ఈ యుద్ధం వల్ల దాదాపు 4 మిలియనుల ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు చెందిన వియత్నం ప్రజలు మర ణించారు. అంతే కాకుండా లావోస్, కాంబోడియా ప్రాంతాలకు చెందిన 2 మిలి యను ప్రజలు తమ ప్రా ణాలు కోల్పోయారు. వీళ్ళతోపాటు 58,159 మంది అమెరికా సైనికులు కూడ మరణించారు.
1979-1989 మధ్యకాలంలో ప్రజాస్వామ్య గణతంత్ర ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వానికి మరియు రష్యన్ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు దారులైన ముజాహుదిన్లు మరియు సోవియట్లు మూకుమ్మడిగా జరిపిన దాడి చరిత్రలో సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధంగా నిలిచిపోయింది. ఏప్రిల్,1978లో మహమ్మద్ దావుద్ ఖాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ఉదారవాద ప్రభుత్వాన్ని వామపక్ష మిలటరీ అధికారి నూర్ మహమ్మద్ తారీఖ్ కూలదోసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. తరువాతికాలంలో మార్క్సిస్ట్-లెనినిస్ట్ రాజకీయ కూటమి మరియు స్థానిక ప్రజాపార్టీ ‘కల్క్’ ల మధ్య అధికార విభజన జరిగింది. కమ్యునిస్ట్ ల ప్రభావంతో కొత్త ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ లో సంస్కరణలు చేయడం ప్రారంభించింది. అయితే స్థానిక ప్రజలు తమ మత సాంప్రదాయాలకు కమ్యునిస్ట్ సాంఘీక సంస్కరణలు వ్యతిరేకంగా ఉన్నాయని తిరుగుబాటు చేశారు. ముజాహుదిన్ ల మద్దతుతో స్థానిక ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక చర్యలు ప్రారంభించారు. ఇదే అదనుగా భావించిన సోవియట్ ప్రభుత్వం 1979 డిసెంబర్ 24 అర్థరాత్రి 30వేల సైన్యంతో ఆఫ్ఘన్ పై దాడి చేసి, హఫీజుల్ల అమిన్ ను గద్దె దించింది. అమెరికా మద్దతుతో మిజాహుదిన్ లు దేశవ్యాప్తంగా తమ ఉనికిని చాటుకున్నారు. ఈ ప్రతిష్ఠంభన పరిస్థితులలోనే మరో లక్ష సైన్యంతో సోవియట్ మళ్ళీ ఆఫ్ఘన్ పై దాడి చేసి ముజాహుదీన్ లను చెల్లాచెదురు చేసింది. దాదాపు 2.5 మిలయనుల ముజాహుదిన్లు పాకిస్తాన్ లో, 1.5 మిలియనులు ముజాహుదీన్ లు ఇరాన్ కు పారిపోయారు. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ ను కోలుకోనివిధంగా దెబ్బతీసింది. చివరకు 1988లో ఆఫ్ఘానిస్తాన్ భూభాగం నుంచి తమ దళాలను వెనక్కి రప్పిస్తామని అమెరికా, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో శాంతి ఒప్పందం చేసుకుంది. 1989 ఫిబ్రవరి 15 కల్లా సోవియట్ తన సేనలను ఆఫ్ఘాన్ భూభాగం నుంచి పూర్తిగా వెనక్కి రప్పించింది. దశాబ్దం పాటు సాగిన ఈ యుద్ధం దాదాపు 2.7 మిలియనుల ప్రాణాలను బలిగొంది.
సుదీర్గకాలం కొనసాగి ఎటువంటి ప్రభావిత ఫలితాలు లేకుండ ముగిసిన యుద్ధం 1980-1988 మధ్య జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధానంతరం పెద్ద మొత్తంలో బాలిస్టిక్ మిసైల్లు, రసాయన బాంబులు ప్రయోగింపబడిన ఈ యుద్ధం తీవ్రమైన ప్రాణ, ఆస్థి నష్టాన్ని కలిగించింది. 1988 జూలై 20 న కాల్పుల విరమణ జరిగే సమయానికి ఇరుపక్షాల తరపున సగం మిలియనుకు పైగా ప్రాణనష్టం, 400 బిలియన్ డాలర్లకు పైగా ఆస్థి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. ఇరాన్ సరిహద్దులలో అపార చమురు నిక్షేపాలున్న ఖూజెస్తాన్ ప్రాంతాన్ని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సైన్ ఆక్రమించడంతో ఈ యుద్దానికి బీజం పడింది. అంతేకాకుండ టైగ్రిస్-యూఫ్రటీస్ నదుల సంగమంతో ఏర్పడ్డ షటల్-ఎ-అరబ్ నది ప్రాంతాన్ని ఇరాక్ లో కలపాలని సద్దాం నిర్ణయించడంతో యుద్ధం మొదలైంది. నిజానికి చారిత్రికంగా ఈ నదీప్రాంతం రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉన్నది. 1980 సెప్టెంబర్ నెలలో ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండ కూజేస్తాన్ ప్రాంతంపై దాడిచేసి ఖొర్రంషార్ పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. కాని, ఇరాన్ లోకెల్లా అతిముఖ్యమైన చమురుక్షేత్రమైన ఆబాదాన్ ను పొందడంలో విఫలమైంది. ఇరాక్ యొక్క ఈ చమురుయుద్ధానికి సౌదీ అరేబియా, కువైట్, మిగత అరబ్ దేశాలు బహిరంగంగానే ఆర్థిక సహాయం ప్రకటించగా, అమెరికా,సోవియట్ యూనియన్ దేశాలు అంతర్గతంగా మద్దతు తెలిపాయి. అయితే ఇరాన్ కు ఉన్న ప్రధాన మద్ధతుదారులు సిరియా మరియు లిబియా దేశాలు మాత్రమే. ప్రాణాంతక రసాయన ఆయుధాలను ఇరాన్ మీదే కాకుండ, ఇరాన్ కు మద్ధతు తెలుపుతున్నారనే అనుమానంతో ఇరాక్ కు చెందిన కుర్దిష్ తెగల మీద కూడ ఇరాక్ దాడి చేసింది. ఐక్యరాజ్య సమితి చొరవతో ముగిసిన ఈ యుద్ధం ఐదు లక్షలకు పైగా ఇరుపక్షాల సైనికుల ప్రాణాలను బలిగొనడమే కాకుండా లక్షకు పైగా కుర్దులు కూడ మరణించారు.
1990-91 కాలంలో పర్షియన్ గల్ఫ్ యుద్ధం లేద గల్ఫ్ యుద్ధం అని పిలవబడే ఈ యుద్ధానికి ఆగస్ట్ 2, 1990న ఇరాక్ కువైట్ ను ఆక్రమించడంతో బీజం పడింది. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సైన్ కువైట్ కు తాను బాకీ పడిన పెద్దమొత్తన్ని ఎగవేయడంలో భాగంగా కువైట్ లో ఉన్న అపార చమురు నిల్వలను ఆక్రమించాలనే ఉద్దేశంతో కువైట్ లో తన అధికారాన్ని ఏర్పటు చేయాలనుకున్నాడు. ఐక్యరాజ్య సమితి కువైట్ ను వీడాలని సద్దాం కు హెచ్చరించినప్పటికినీ పెడచెవిన పెట్టడంతో ఇరాక్ పై అంతర్జాతీయ నిషేదం విదించారు. ఇరాక్ దూకుడు స్వభావం సౌదీని కలవరపెట్టింది. అమెరికా మరియు నాటో దళాల మద్ధతుతో సౌదీ అరేబియా, ఈజిప్ట్ ఇతర అరబ్ దేశాలు ఇరాక్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసి,’ఆపరేషన్ డెసర్ట్ షీల్ద్’లో పాలుపంచుకున్నాయి. ఇరాక్ తన మూడు లక్షల సైన్యాన్ని కువైట్ లో ఉంచడంతో గల్ఫ్ మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అమెరికా నేతృత్వంలోని ఏడు లక్షల సైన్యం గల్ఫ్ ఎడారిలో మోహరించినప్పటికిని సద్దం హుస్సైన్ తాను కువైట్ వీడనని తేల్చిచెప్పాడు. దాంతో ‘ఆపరేషన్ డెసర్ట్ స్టార్మ్’’ పేరుతో ఇరాక్ పై వాయుదాడి ప్రారంభమైంది. త్వరలోనే ఇరాక్ మీద పైచేయి సాధించిన భద్రతా దళాలు ఇరాక్ లో ప్రముఖ పట్టణమైన అల్-బస్రా ను ఆక్రమించడంతో ఇరాక్ కాల్పుల వీరమణకు అంగీకరించింది. ఐతే ఇరాకీ మిలటరీ ఆపరేషన్ విషయంలో ఎటువంటి అధికారిక గణన లేదు. ఆరు లక్షల ఇరాకీ సైనికులు యుద్ధంలో పాల్గొన్నప్పటికినీ ఎనిమిది వేల నుంచి లక్ష వరకు చనిపోయి ఉండవచ్చని అంచన. మిత్ర రాజ్యాలు 300 మంది సైనికులను కోల్పోయాయి.
ఇవి మాత్రమే కాకుండ 20వ శతాబ్దంలో మరెన్నో యుద్ధాలు ఆపారమైన ప్రాణ,ఆస్థి నష్టాలను కలిగించి చరిత్రలో చీకటి పేజీని లిఖించాయి. 1915-18 మధ్య జరిగిన అమెరికా జాతి విద్వంసం, 1919-21 ఐరిష్ స్వతంత్ర పోరాటం, 1927-37 చైనా అంతర్గత యుద్దం, 1933-45 జర్మనీ హోలోకాస్ట్, 1935-36 రెండవ ఇటాలియో-అబిసీనియా యుద్ధం, 1936-39 స్పానిష్ అంతర్గత యుద్ధం, 1945-90 ప్రచ్చన్న యుద్దం, 1955-72 మొదటి సుడానీస్ పౌర యుద్ధం, 1965, 1971లలో సంభవించిన భారత-పాకిస్తాన్ యుద్ధాలు, 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధం , 1994 రువాండా సామూహిక హత్యాకాండా…. ఇలా చెప్పుకుంటుపోతే 20వ శతాబ్దంలో ఎన్నో యుద్ధాలు ఘోరమానవ హననానికి హేతువులయ్యాయే గాని మనిషికి భద్రత కలిగించలేకపోయాయి. యుద్ధాలని ప్రారంభించిన ఎందరో పాలకులు ఓటమి అనంతం ఉరికంభం ఎక్కడమో, ఆత్మహత్య చేసుకోవడమో లేదా అజ్ఞాతంలోకి వెళ్ళడమో 20వ శతాబ్దం చూసింది. యుద్ధం ఎవరికి శ్రేయస్కరం కాదు. అంతదాక ఎందుకు యుద్ధం చేయడం సైనికులకే ఇష్టం ఉండదని చరిత్ర చెబుతుంది. ఇక్కడ డగ్లస్ మెకార్థర్ చెప్పిన ఒక గొప్ప మాటను చెప్పుకోవాలి ‘‘అందరికన్నా ఎక్కువగా శాంతి కోసం ప్రార్థించేది సైనికుడే. ఎందుకంటే యుద్ధం చేసే లోతైన గాయాలను, చేదు భాదలను అనుభవించేది ఆయనే మరి’’.
