వాళ్ళను గొంతెత్తనివ్వండి..
యుగాల బాధలు వలపోయనివ్వండి..
తరాల తండ్లాటను
వెళ్లగక్కనీ..
మీకెందుకు..!?
వాళ్ళ ఏడుపేదో వాళ్ళను ఏడవనివ్వండి..
కన్యాశుల్కం, వరకట్నం
ప్రేమ వంచనా, పరువు హత్యా
పేరేదయితేనేం..?
బలి పశువులు వాళ్లే కదా..!
నిర్భయ, దిశ, మనీషా
అకృత్యమేదయితేనేం..?
ఆక్రందన వాళ్లదే కదా..
గర్భం నుంచీ గగనం దాకా
జననం నుండీ మరణం దాకా
ఎన్ని దాష్టీకాలు..?
ఎన్నెన్ని దౌర్జన్యాలు..?
వాళ్ల శీలాన్ని ఏ అగ్ని పరీక్షలూ నిరూపించవు..
వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఏ వేణుగానాలూ వినిపించవు..
యుగానికో, శకానికో, తరానికో
నూటికో , కోటికో ఒక్కర్ని చూపెట్టి
మభ్యపెట్టి, మాయ చేయకండి..
మార్చి 8 కో, మాతృ దినాలకో..
ఓ కవిత రాసి, పాట పాడి..
నాలుగు తీయని మాటల
సందేశాలు చెప్పి..
సంతృప్తి పరచకండి..
సమానత్వం పేరుతో
ఇంకా వంచించకండి..
గొంతు విప్పనివ్వండి వాళ్ళను..
వదిలేయండి..
తరాల వేదన గుండెలు దాటేలా..
గునపాలై గుచ్చే బాధ బయటకి తెలిసేలా..
గొంతులు పిక్కటిల్లేలా..
నలుదిక్కులు వినిపించేలా..
ఎరుపెక్కిన ఆ కళ్ళు
చిప్పిళ్లిన అశ్రు ధారలో..
ఈ కసాయి చరిత్రలు కరిగిపోనీ..
కొత్త చరిత్రలు లిఖించవచ్చు…
పదునెక్కిన ఆ కంఠాలు
కురిపించే అగ్నిధార..
ఈ దమన నీతుల దహించనీ..
కొత్త భాష్యాలు వినిపించవచ్చు..
దిక్కులు పిక్కటిల్లే
ఆ రణ నినాదం లో..
ఈ పుక్కిటి పురాణాలు కలిసిపోనీ..
సమతాగాధలు పఠించవచ్చు..
బిగిసిన పిడికిళ్ల బిగువుకు
ఈ విష వ్యవస్థ కూకటివేళ్ళతో కూలనీ..
గట్టి పునాదుల పై నవ సమాజ నిర్మాణం గావించవచ్చు..
వదిలేయండి వాళ్ళను..
ఏడుస్తారో.. ఎగబడుతారో..
ఆక్రోశిస్తారో.. ఆవేశిస్తారో..
అర్థిస్తారో.. నినదిస్తారో..
పిడికిళ్లయి బిగుస్తారో..
పిరికివాళ్లయి జడుస్తారో..
అవనిలా భరిస్తారో..
అగ్నిశిఖ లై జ్వలిస్తారో..
వాళ్ళిష్టం..
వదిలేయ్ వాళ్ళను..
ఇదిగో, వింటున్నావా..
ఎక్కడో వెక్కిళ్ళ శబ్దం కదూ..!
జాగ్రత్త గా విను..
అవి వెక్కిళ్ళు కాదు..!
రేపటి పొద్దుకు
కాలం పడే వేవిళ్ళు..!!
సిద్ధంగా ఉండు..