
కాసులకు కక్కుర్తిపడిన వీఆర్వో అమాయకపు రైతుల పట్టా భూములను రికార్డుల్లో ఆన్‌లైన్‌ద్వారా కంప్యూటర్లో మారుస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడని బచ్చన్నపేట మండలంలోని ఆలీంపూర్ రైతులు సోమవారం తహశిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం అక్కినపల్లి సుధాకర్ రెడ్డికి చెందిన 751లోని 309/బీ/1 1.20,309/సీ/2లోను ఎకరా ఇరవై ఎనిమిది గుంటల భూమి ఉందని వీటిలో నుండి 309/బీ/1లో 1.20 గుంటలను రైతుల ప్రమేయం లేకుండా వీఆర్వో కనకరాజు రికార్డులను కంప్యూటర్లో మార్చాడు.
దీంతో రైతులందరు తహశిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వీఆర్వోను ప్రశ్నించారు. వీఆర్వో తప్పు జరిగిందని క్షమాపణలు తెలిపి వారం రోజులలో సరిచేస్తానని తెలిపాడు. దీంతో తహశిల్దార్ లేకపోవడంతో ఆర్ఐ కృష్ణస్వామి, ఏఆర్ఐ ఆంధ్రయ్య, నాగార్జున అక్రమ పట్టాలను రద్దుచేసి బాధిత రైతులకు న్యాయం చేస్తామని తెలపడంతో బాధిత రైతులు ఆందోళన విరమించారు.