Take a fresh look at your lifestyle.

‌స్ఫష్టమైన మెజార్టీ ఎవరికి ఇవ్వని ఓటర్లు

  • బిజెపిని ఆదరించిన నగర ప్రజలు
     మండువ రవీందర్‌రావు

జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు జరిగిన నాలుగు రోజులుగా  గెలుపు వోటములపై జరుగుతూ వస్తున్న చర్చోపచర్చలకు శుక్రవారం తెరపడింది. కేవలం హైదరాబాద్‌ ‌నగర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా  వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా కేంద్ర నాయకులుకూడా ఈ ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న వేళ, నగర ప్రజలు సాంకేతికంగా తెరాసకు పట్టంగట్టినప్పటికీ భారతీయ జనతాపార్టీని ఆదరించారన్నది స్పష్టమవుతున్నది. అయినా నగర ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజార్టీని ఇవ్వకపోవడం గమనార్హం.  డిసెంబర్‌ ఒకటిన జరిగిన పోలింగ్‌ ‌విధానాన్ని పరిశీలిస్తే  నగర ప్రజలకు ఈ ఎన్నికలపైన ఏమాత్రం ఇష్టంలేదన్న విషయం స్పష్టమయింది.  అతి కష్టంగా 46.55 శాతం మంది ఓటర్లు ఇచ్చిన తీర్పే అయినా ఒక విధంగా టిఆర్‌ఎస్‌ను తిరస్కరించారనే చెప్పవచ్చు. ఓట్ల లెక్కింపు ప్రారంభంనుండి అందరినీ టెన్షన్‌కు గురిచేసింది. ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా ప్రచారం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనత, ఎంఐఎంపార్టీలు ఓట్ల లెక్కింపులోకూడా అదే ఉత్కంఠతను లేపాయి. గతంలో 99 స్థానాలను గెలుచుకున్న టిఆర్‌ఎస్‌ ఈసారి 44 స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది.  కాగా, భారతీయ జనతాపార్టీ మాత్రం తన దూకుడుకుతగ్గ ఫలితాన్ని పొందిందనే చెప్పాలి. మేయర్‌ ‌స్థానాన్ని సాధించుకుంటామని ఘంటా పథంగా ప్రకటించిన ఆ పార్టీ ఆ స్థాయిలో ఓట్లను, సీట్లను సాధించుకోకగలిగిందనే చెప్పాలి. ఇంతవరకు జరిగిన జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో ఏనాడూ లేనంత ఊపును ఈ ఎన్నికల్లో బిజెపి ప్రదర్శించింది.

ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నప్పటికీ అభ్యర్దుల ఎంపిక, ప్రచారంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. దుబ్బాకలో గెలుపు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపునిచ్చిందనడానికి ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అదే పట్టుదలతో గల్లీ ఎన్నికలైనప్పటికీ ఢిల్లీ నాయకులను తీసుకొచ్చి ప్రచారంచేసింది. అధికారంలోఉన్న టిఆర్‌ఎస్‌తోపాటు, వందేళ్ళకుపైగా చరిత్రకలిగిన కాంగ్రెస్‌ను, ఎంఐఎంను ధీటుగా ఎదుర్కుని నిలబడగలిగింది. దీంతో రాజధానిలో  బిజెపి తన ఉనికిని చాటుకున్నట్లైంది.  ఇప్పటివరకు రెండవ స్థానంలో ఉంటూవస్తున్న కాంగ్రెస్‌ను అధమస్థానానికి నెట్టగలిగిందికూడా. మేయర్‌ను దక్కించుకోలేకపోయినా కేవలం అయిదు స్థానాల వ్యత్యాసానికి బిజెపి చేరుకోవడం ఈ ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించిన అంశం. ఇది ఒకవిధంగా బిజెపి విజయంగానే చెప్పవచ్చు. టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వడమేకాకుండా ఇప్పుడాపార్టీకి పక్కలో బల్లెంలా  బిజెపి ఎదిగిందనడంలో సందేహంలేదు.

రానున్న శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా దీని ప్రభావం ఉండకపోదు.  రానున్న ఎన్నికలకు ఇది రెఫరెండమంటోంది బిజెపి. బిజెపి లక్ష్యంకూడా అదే. రాష్ట్ర రాజధానిలో పట్టు సాధించుకోవాలని చాలాకాలంగా పావులు కదుపుతూ వచ్చింది. హైదరాబాద్‌ ‌పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని, ఇక్కడ రోహ్యంగాలు,  అక్రమంగా ఉన్న పాకిస్తాన్‌లను దేశంనుండి వెళ్ళగొడుతా మనడంతోపాటు, టిఆర్‌ఎస్‌, ఎంఐఎం‌ల విడదీయరాని బంధంపై ప్రచారంచేయడంలో బిజెపి విజయవంతమైన పాత్ర పోషించిందనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం.  ముందుగా పోస్టల్‌బ్యాలెట్స్‌న్‌ ‌లెక్కించినప్పటినుండి బిజెపి ముందంజలో సాగుతూ వచ్చింది. టిఆర్‌ఎస్‌తో ఎంత పోటీ పడిందో ఎంఐఎంతోకూడా అదేస్థాయిలో బిజెపి పోటీపడిందనేచెప్పాలి. సీట్లను సాధించుకునే విషయంలో  ఎంఐఎంను దాటి వెళ్ళగలిగిందంటేనే ఆపార్టీ ప్రజల ఆదరణను ఏమేరకు పొందగలిగిందన్నది స్పష్టమవుతున్నది.  గత ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలనే పొందిన బిజెపి ఇప్పుడు 50 స్థానాలకు చేరుకుని రెండవ స్థానంలో నిలిచింది. ఎంఐఎం 43 స్థానాలతో మూడవ స్థానంలో నిలువగా, గత ఎన్నికల్లో పొందిన రెండు స్థానాలతోనే కాంగ్రెస్‌ ‌సరిపెట్టుకుంది. దేశ రాజకీయాలనే మారుస్తానన్న టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, తన స్వంత రాష్ట్ర రాజధానిలోనే రాజకీయాలు మారడం ఇప్పుడు కొరుకుడు పడకుండా పోయింది.

Leave a Reply