Take a fresh look at your lifestyle.

ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే వోటింగ్‌ ‌శాతం పెరిగింది

  • ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అ‌క్రమాలపై ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించ లేదు
  • టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌

‌ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వోటింగ్‌ ‌శాతం పెరగడానికి ఇదే కారణమని టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు, నల్గొండ, ఖమ్మం , వరంగల్‌ ‌పట్ఠభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొ.కోదండరామ్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ, దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.

పోలింగ్‌ ‌కేంద్రాలలోనే టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన కార్యకర్తలు డబ్బులు పంచారనీ, వోటర్లను ఇతరత్రా ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు. వరంగల్‌, ‌నల్గొండ,ఖమ్మం మూడు జిల్లాలలోనూ అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు గులాబీ రంగు టీ షర్టులు ధరించి పరోక్షంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి వోటు వేయాలని ప్రచారం చేశారనీ, దీనిపై అభ్యంతరం తెలిపిన తమ పార్టీ కార్యకర్తలపై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే టీఆర్‌ఎస్‌ ‌నేతలు,కార్యకర్తలు డబ్బులు పంచినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు.

ప్రజలకు సమాధానం చెప్పలేక అధికార పార్టీ వక్రమార్గాలు పట్టిందని మండిపడ్డారు. బ్యాలెట్‌ ‌బాక్సుల భద్రతపై రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదనీ, ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలనీ, ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీజేఎస్‌ ‌కార్యకర్తలు బ్యాలెట్‌ ‌బాక్సులు భద్రపరచిన రూంల వద్ద కాపలా కాయాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగం, ఈసీ వ్యవహార శైలిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామనీ, బ్యాలెట్‌ ‌బాక్సుల భద్రత తదితర అంశాలపై మరోసారి రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోను కలసి ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా కోదండరాం స్పష్టం చేశారు.

Leave a Reply