Take a fresh look at your lifestyle.

‌ప్రజాస్వామ్య సౌధానికి వోటర్లే మూలస్తంభాలు.. !

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక ప్రపంచ దేశాల పరిపాలన విధానాలను అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌నేతృత్వంలో రూపొందించడం జరిగింది. విభిన్న సంస్క•తులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, ఆర్థిక భౌగోళిక స్థితులకు నిలయమైన మన దేశపాలనకు ప్రజాస్వామ్య వ్యవస్థలో బహుళ పార్టీ విధానంలో పాలన శ్రేయస్కరమని భావించారు రాజ్యాంగ నిర్మాతలు. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ఆదర్శంగా సార్వత్రిక వయోజన ఓటు హక్కును, అంతరాలకు అతీతంగా, నిర్ధేశిత వయస్సుగల పౌరులందరికి ఓటు హక్కును కల్పించారు. ఈ ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయుప్రాయంగా భావించారు. నిర్ధేశిత గడువులో ప్రజా ప్రభుత్వాలను ఎన్నుకొనుటకు స్వయం ప్రతిపత్తి గల్గిన ఎన్నికల సంఘం ద్వారా ప్రధాన కార్యాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజాతీర్పు ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడి పాలన సాగుతుంది. మన దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం 2022 ఓటర్ల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఆ మేరకు భారత దేశంలో మొత్తం ఓటర్లు 95,24,81,459గా నమోదు అయినారు. ఇందులో పురుషులు 49,18,60,931 కాగా, మహిళా ఓటర్లు 46,05,74,630 మందిగా ఉన్నారు. ట్రాన్స్ ‌జెండర్లకు ఓటును కల్పించినందున వారిని కూడా గుర్తించినారు. వారు 45,898 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4,07,36,279 మందిని మరియు తెలంగాణలో 3,03,71,555 మందిని ఓటరుగ్లా ఎన్నికల సంఘం గుర్తించింది. గత జాబితా (2020)తో పోలిస్తే తాజాగా ఓటర్ల సంఖ్య 3,26,96,445 మేరకు పెరిగింది. దేశంలో మహిళా ఓటర్లకంటే పురుషుల ఓటర్ల సంఖ్య 6.79% అధికంగా ఉంది. రాష్ట్రాల వారిగా చూస్తే మనదేశంలోని ఉత్తర ప్రదేశ్‌ ‌రాష్ట్రంలో అత్యధికంగా మొత్తం ఓటర్ల సంఖ్య 15,05,83,879 మందిని కలిగి ఉంది.

సిక్కింలో అతి తక్కువగా 4,46,262 మంది ఓటర్లున్నారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన లక్షదీవుల్లో ఓటర్ల సంఖ్య 56,269 మాత్రమే ఉన్నారు. దేశంలోని 9 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీలు) పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అవి : పుదుచ్చేరి, కేరళ, మణిపూర్‌, ‌మిజోరం, గోవా, తమిళనాడు, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ‌మేఘాలయ, చత్తీస్‌ఘడ్‌లలో ఉండగా, దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలు, యూటీల్లోనూ పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు. దేశంలో మొత్తంగా ప్రవాస ఓటర్లు 1,22,200 కాగా, సర్వీసు ఓటర్లు 19,12,708 మంది ఓటర్లున్నారు. ప్రవాస ఓటర్లు అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 92,486 మంది పేర్లు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర 7,065, ఆంధ్రప్రదేశ్‌ 7,033‌లుగా ఉన్నారు. అత్యధిక సర్వీసు ఓటర్లున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ 2,98,746 ‌సంఖ్యతో తొలిస్థానంలో ఉంది. అలాగే మనదేశంలో ఉత్తరప్రదేశ్‌ ‌తర్వాత అత్యధిక ఓటర్లున్న 8 రాష్ట్రాలు ఓటర్ల సంఖ్య కోట్లలో ఇలా ఉంది. మహారాష్ట్ర 9.14 కోట్లు, బీహార్‌ 7.64 ‌కోట్లు, పశ్చిమబెంగాల్‌ 7.44 ‌కోట్లు, తమిళనాడు 6.32 కోట్లు, మద్యప్రదేశ్‌ 5.36 ‌కోట్లు, కర్ణాటక 5.25 కోట్లు, రాజస్థాన్‌ 5.10 ‌కోట్లు, గుజరాత్‌ 4.85 ‌కోట్ల ఓటర్లను కలిగి ఉన్నాయి. భారతదేశ ప్రజాస్వామ్య సౌదానికి ఓటర్లే మూలస్తంభాలు. వీరు ఎన్నికల క్రతువులో నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు, పార్టీల తాయిలాలకు లొంగకుండా తీర్పును ఇవ్వాలి.

భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహణ, ఓటర్లు స్వేచ్ఛగా పాల్గొనేలా చేయడం అంతర్భాగాలు. అంతేకాదు ప్రజా సంకల్పానికి అవి ప్రతీకలనేది విస్మరించరాదు. ఇంత పవిత్రమైన ఎన్నికల నిర్వహన లోపభూయిష్ట ఓటర్ల (నమోదు) జాబితాతో ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం దశాబ్ధాలుగా ఘోర వైఫల్యాల చరిత్రనే మోస్తుంది. దీని మూలంగా ప్రజాస్వామ్యం అబాసుపాలౌతుంది. అత్యున్నత న్యాయస్థానం మందలించినా ఫలితం శూన్యమే ! ఎన్నికల నాటికీ ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు అదృశ్యమై నకిలీ, బోగస్‌ ‌పేర్లతో జాబితాలు ప్రత్యక్షం కావడం పరిపాటిగా మారుతుంది. ఇలా గత 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా 2.1 కోట్ల మంది మహిళలు జాబితానుండి అదృశ్యమైనట్లు అధ్యయనాలు వెలుగుచూశాయి. పాలక (రాజకీయ) పక్షాలు ఓటర్లను తమవారు, తమకు కాని వారని విభజించి గిట్టనివారిని లక్షల సంఖ్యలో జాబితా నుంచి గల్లంతుచేసే పన్నాగాలు జరగడంతో ప్రతిసారి ఎన్నికల వేళ ఓటర్లు గందరగోళానికి లోనై ఆందోళన చేస్తున్నారు. ఇలా ఎన్నికల పవిత్ర ప్రక్రియకు, చట్టబద్ధపాలనకు విఘాతం కల్గించే బోగస్‌ ఓటింగ్‌పై ఉక్కుపాదం మోపుతూ, ఓటర్ల జాబితా పకడ్బందీగా కూర్చడంలో ఎన్నికల సంఘం తమ సమర్థతను చాటాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల వేళ ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్‌లో పాల్గొనేలా విశ్వసనీయతకు గొడుగు పట్టాలి. అప్పుడే ప్రజాతీర్పుకు ఓటరు చైతన్యానికి ప్రతీకగా మారుతుంది.

– మేకిరి దామోదర్‌, ‌సోషల్‌ ఎనలిస్ట్, ‌వరంగల్‌, 9573666650

Leave a Reply