- మార్చి 20న వైజాగ్ కు కేంద్ర కార్మిక సంఘాల జాతీయ నేతల బృంద పర్యటన .
- కార్పొరేట్లను సంతృప్తి చేసేందుకే ప్రయివేటీకరణ.
- విశాఖ ప్రయివేటీకరణపై అఖిల పక్షం వేయాలి..: సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్.
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కానివ్వమని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో కార్మిక సంఘాల జాతీయ నేతలు భాగస్వామ్యం అవుతామని, ఈ నెల 20న ఢిల్లీ నుంచి వైజాగ్‌కు వెళ్లనున్నామని తెలిపారు. సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐటీయూ,ఏఐఏడబ్ల్యూయూ, ప్రధాన కార్యదర్శలు తపన్ సేన్, బి.వెంకట్, ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నట్టు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా తపన్ సేన్ మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో తమ సంఘం ఇతర అనుబంధ ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలతో కలిసి పోరాటం చేస్తుందని చెప్పారు. అనేక ఉద్యమాలు ఫలితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాడిందని గుర్తు చేశారు.
ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం చాలా మంది సామాన్య ప్రజలు అసువులు బాసారని తెలిపారు. ఈ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయటానికి పలు విధాలుగా ప్రభుత్వం దీన్ని బలహీన పరించిందని విమర్శించారు. ప్లాంట్‌కు కావాల్సిన ముడి సరుకులు అందకుండా, నష్టాల్లో ఉందని చెప్పడం దారుణమన్నారు. ముడి సరుకు కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ అద్భుతమైన లాభాల బాట పడతాదని అన్నారు. దేశంలోనే ఒకే ఒక సమగ్రమైన స్టీల్‌ప్లాంట్ వైజాగ్దేనని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్ కు అవసరమైన ప్రాథమిక ముడి సరుకులు ఐరన్ ఓర్, బొగ్గు గనులను లేవని అన్నారు. టాటా, జిందాల్ వంటి ప్రయివేటు సంస్థలకు సొంత గనులు ఉన్నాయని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు తొలి నుంచి సొంత గనులు లేవని, ఫలితంగా నష్టాలు వస్తున్నాయని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు ఇస్తే, ఏడాదిలోనే మంచి లాభాలు వస్తాయని వివరించారు. సొంత గనులు ఉన్న ప్రయివేటు కంపెనీలు టన్ను ముడి సరుకు 400 నుంచి 500 రూపాయలకు కొంటే, సొంత గనులు లేని వైజాగ్ స్టీల్ ప్లాంట్ టన్ను ముడి సరుకు 4,000 నుంచి 5,000 రూపాయలకు కొంటున్నది అని అన్నారు. ఆ రకంగా స్టీల్‌ప్లాంట్‌కు పెనుభారం పడుతోందని తెలిపారు. ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
గతంలోనే స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేసేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నిందని, అయితే అవన్ని కార్మిక ఐక్యతతో తిప్పికొట్టారని తెలిపారు. ప్రభుత్వ కుట్రలు సఫలీకృతం కాలేదని వివరించారు. ప్రస్తుతం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్‌లో జరుగుతున్న ఉద్యమంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, కార్మిక, ప్రజా పోరాటంతో మోడీ సర్కార్ మెడలు వంచుతామని తపన్ సేన్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థను ప్రయివేటు వ్యక్తికి అప్పగించేందుకు ప్రజలు ఏమాత్రం ఒప్పుకోరని స్పష్టం చేశారు. ఎటువంటి ముందస్తు సమచారం లేకుండా సుమారు 40 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్లుగా రూపొందించడంపై తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ లేబర్ కోడ్ చట్టాలపై కూడా తాము పెద్ద ఎత్తున పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఈ నెల 20న ఢిల్లీ నుంచి కేంద్ర కార్మిక సంఘాల జాతీయ నేతల బృందం వైజాగ్‌ను సందర్శించి, స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతామని వెల్లడించారు.
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో కూడా మరిన్ని ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాష్ట్ర బంద్ విజయవంతం అయిందని, రాష్ట్రంలోని ఉండే అన్ని వర్గాల ప్రజలు ప్రయివేటీకరణకు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నామని, జాతీయ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ఆందోళన జరుగుతుందని చెప్పుకొచ్చారు. జాతీయ ఆస్తులను అమ్మే మోడీ సర్కార్ కుట్రలు ఆపేవరకు తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. కార్పొరేట్ శక్తులను సంతృప్తి చేసుకునేందుకే, జాతీయ ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను ఉచితంగా అమ్మేస్తున్నారని విమర్శించారు. వైజాగ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడుతున్నారని, వారు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు అనుమతించరనే విశ్వాసం తనకుందని తపన్ సేన్ తెలిపారు.
విశాఖ ప్లాంట్‌పై అఖిల పక్షం ఏర్పాటు చేయాలి అన్న బి.వెంకట్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ దయా దాక్షిణ్యాలపై రాలేదని, ప్రజల పోరాట ఫలితంగా ఏర్పాడిందని అన్నారు. లక్షల కోట్ల ఆస్తుల కలిగిన ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పన్నంగా దోచి పెట్టేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పని చేసేవారు ఏపీకి చెందిన వారు మాత్రమే కాదని, తెలంగాణకు చెందిన వారు కూడా గణనీయంగా ఉన్నారని తెలిపారు. తాత్కాలికంగా వచ్చిన నష్టాలను బూచిగా చూపి కార్పొరేట్ లకు ధారాదత్తం చేయాలని కేంద్రం యోచిస్తోందని, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన సీఎం జగన్ పై బాధ్యత ఉందని, ఎందుకు సీఎం జగన్ ఈ విషయంలో అన్ని పక్షాలను కలుపుకొని పోవడం లేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చొరవ తీసుకొని స్పందించాలని, బీజేపీ, మోడీ, అమిత్ షా కి భయపడి తెలుగు ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల లూటీ మోడీ సర్కారు చేస్తున్నది అన్న విజూ కృష్ణన్, ఏఐకేఎస్. ప్రభుత్వ ఆస్తుల లూటీ చేసేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నిందని ఏఐకేఎస్ జాయింట్ సెక్రటరీ విజూ కృష్ణన్ విమర్శించారు. లాక్డౌన్ కాలంలో రైతు వ్యతిరేక చట్టాలు, లేబర్ కోడ్లు, ప్రభుత్వ ఆస్తులు ప్రయివేటీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని దుయ్యబట్టారు. వైజాగ్‌లో జరుగుతున్న పోరాటంలో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు కూడా పాల్గొంటారని తెలిపారు.