Take a fresh look at your lifestyle.

మళ్ళీ బిగుస్తున్న విశాఖ ఉక్కు పిడికిలి

“తెలుగుప్రాంతాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించినప్పుడు చేసిన ఒప్పందాలమేరకు కొత్తగా ఏర్పడిన ఏపి రాష్ట్రానికి నూతన పరిశ్రమలను కేటాయించాల్సిందిపోయి, ఉన్న పరిశ్రమకే కేంద్రం ఉద్వాసన పలకడాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు ప్రధానికి లేఖాస్త్రాలను సందించినప్పటికీ కేంద్రం మాత్రం తమ నిర్ణయానికి తిరుగులేదని స్పష్టం చేసింది. ఈ పరిశ్రమలో రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ షేర్లు లేకపోవడంతో దీన్ని ప్రైవేటుకు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వనికే మాత్రం సంబంధంలేదని కేంద్రం వివరణ ఇస్తూనే, ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తుగానే తెలిపినట్లు పేర్కొనడంతో జగన్‌ ‌ప్రభుత్వం ఇరకాటకంలో పడింది.”

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌లా విశాఖ ఉక్కుఫ్యాక్టరీకి అరవైఅయిదేళ్ళు నిండడంతో ఇక నీ సేవలు చాలు రిటైర్‌మెంట్‌ ‌తీసుకోమంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పిడుగులాంటి వార్తను సోమవారం పార్లమెంట్‌ ‌సాక్షిగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించడంతో మరోసారి ఆంధ్ర ప్రజలంతా రోడ్లమీదకు వచ్చారు. విశాఖ పట్టణమంతా ఉద్యమకారుల నిరసన ప్రదర్శనలతో నిండిపోయింది. ఒక్క విశాఖనే కాదు, ఆంధప్రదేశ్‌ అం‌తా అట్టుడికి పోయింది. బంద్‌లు, రాస్తారోకోలు, నినాదాలు మిన్నుముట్టాయి. ఆరున్నర దశాబ్దాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధిని అందిస్తున్న ఈ ఫ్యాక్టరీ లాభాలకన్నా నష్టాలను తెచ్చిపెడుతుందని ఇక దీని భారాన్ని మోయలేమంటోంది కేంద్ర ప్రభుత్వం. వాస్తవంగా మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారం చేపట్టినప్పటినుండి ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కదాన్ని ప్రైవేటు పరం చేస్తూ వస్తున్నారు.

ఈ రంగంలోని తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంద్వారా వేలాది కోట్ల రూపాయలను అప్పనంగా సొమ్ముచేసుకునే ఆలోచనలోనే కేంద్రం ఉంది. కాని, ఈ ఫ్యాక్టరీలవల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్ని వందల వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయన్న విషయాన్ని మోదీ ప్రభుత్వం పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. పార్లమెంట్‌లో ఈ వార్త ప్రకటించిన మరుక్షణంనుండి ఈ పరిశ్రమతో అనేక సంవత్సరాలుగా అనుబంధమున్న కార్మికుల, ప్రజల గుండెలు ఒక్కసారే అవిసిపోయాయి. ఆరున్నర దశాబ్దాల కింద దాదాపు ముప్పైమంది ప్రాణత్యాగంతో ఏర్పాటుచేసుకున్న ఈ పరిశ్రమ తమదికాకుండా పోతున్నదన్న బాధతో కార్మికులు, వారి కుటుంబాలన్నీ రోడ్డెక్కాయి.

తమ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందన్న అభిప్రాయంగా ఆనాడు వేలాది వ్యవసాయ భూములను అప్పగించిన కుటుంబాలు ఆవేదనతో ఆక్రందన చేస్తున్నారు. తెలుగుప్రాంతాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించినప్పుడు చేసిన ఒప్పందాలమేరకు కొత్తగా ఏర్పడిన ఏపి రాష్ట్రానికి నూతన పరిశ్రమలను కేటాయించాల్సిందిపోయి, ఉన్న పరిశ్రమకే కేంద్రం ఉద్వాసన పలకడాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు ప్రధానికి లేఖాస్త్రాలను సందించినప్పటికీ కేంద్రం మాత్రం తమ నిర్ణయానికి తిరుగులేదని స్పష్టం చేసింది. ఈ పరిశ్రమలో రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ షేర్లు లేకపోవడంతో దీన్ని ప్రైవేటుకు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వనికే మాత్రం సంబంధంలేదని కేంద్రం వివరణ ఇస్తూనే, ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తుగానే తెలిపినట్లు పేర్కొనడంతో జగన్‌ ‌ప్రభుత్వం ఇరకాటకంలో పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ముందస్తుగానే సమాచారమున్నప్పటికీ ఎందుకు స్పందించలేదని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

కేంద్రంతో ఏదో చీకటి ఒప్పందం చేసుకుని ఉండవచ్చన్న ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్రం నిర్ణయంపట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరేమిటన్నది స్పష్టంచేయాలని ఆ పార్టీలు అధికార పార్టీని నిలదీస్తున్నాయి. త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి, ఆయా పార్టీల అధినేతలతో ప్రధాని మోదీని కలిసి పరిశ్రమను ప్రైవేటు పరం చేయకుండా నిరోధించాలని ఆ పార్టీలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. ఇదిలాఉంటే పార్టీయేతర ఉద్యమకారులు బిజెపితో సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలను వైఖరి స్పష్టంచేయాలంటున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పట్ల నిజంగానే ఈ పార్టీలకన్నిటికీ చిత్తశుద్ధి ఉంటే తమతమ పార్టీ పార్లమెంట్‌ ‌సభ్యులందరితో రాజీనామాలు పెట్టించాలని డిమాండ్‌ ‌చేస్తున్నాయి. తమ పదవులు పోతాయని బెంగ పడవద్దని, ఏపార్టీ తరఫున ఎవరు తమ పదవులకు రాజీనామా చేస్తారో వారిని తిరిగి పోటీలేకుండా ఎన్నుకుంటామంటున్నారు. కాగా కేంద్ర నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కార్మిక సంఘాలంటున్నాయి.

వైఎస్‌ఆర్‌ ‌పార్టీ అధికారం చేపట్టినతర్వాత రాష్ట్రానికి కొత్తగా సాధించిన పరిశ్రమలు లేకపోగా, నడుస్తున్న ఫ్యాక్టరీ ని కేంద్రం అమ్ముకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్లు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్‌ ‌ప్రభుత్వం కష్టించి తెచ్చిన ఫ్యాక్టరీ కాదని, తమ పూర్వికుల త్యాగఫలంగా వచ్చిన ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదంటున్నారు. అందుకు ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్దమేనంటున్నాయి కార్మిక సంఘాలు. సోమవారం పార్లమెంట్‌లో ఈ ప్రకటన వెలువడినప్పటినుండి ఫ్యాక్టరీ ముందు గుంపులు గుంపులుగా చేరిన కార్మిక కుటుంబాలు మంగళవారం కూడా అక్కడినుండి కదలకుండా వ్యధాబరిత హ్రుదయంతో ఉండిపోయారు.

ఫ్యాక్టరీ కార్యాలయ భవనాన్ని ముట్టడించడం, నిర్మల సీతారామన్‌ ‌ప్రకటన ప్రతులను దగ్ధం చేయడంతోపాటు, అక్కడికి వచ్చిన ఫైనాన్స్ ‌డైరెక్టర్‌ను చాలసేపు ఫ్యాక్టరీలోకి పోనివ్వకుండా నిర్బంధించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాగా ఉక్కు కర్మాగారం పరిరక్షణ కమిటి, పోరాట కమిటీలు త్వరలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు భవిష్యత్‌ ‌ప్రణాళికను రూపొందిస్తుండగా, కేంద్రం వెంటనే తన ప్రకటనను ఉపసంహరించుకోవాలంటే అన్నిపార్టీల ఎంపిల తోపాటు రాష్ట్ర శాసనస భ్యులంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాల్సి ందేనంటూ ప్రజలనుండి డిమాండ్‌ ‌వినిపిస్తున్నది.

manduva ravindhar rao
మండువ రవీందర్‌రావు

Leave a Reply