Take a fresh look at your lifestyle.

ఒకవైపు వైరస్‌ ‌విజృంభణ… మరోవైపు వ్యాక్సిన్‌ల ఆవిష్కరణ

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ ఒకవైపు కొరోనా వైరస్‌ ‌విజృంభిస్తుంటే, మరోవైపు ఈవ్యాధి నుండి ప్రజలను కాపాడేందుకు అనేక దేశాల శాస్త్రవేత్తలు రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. దాదాపు రెండు వందల దేశాల ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్‌ను అదుపులో పెట్టే మందును ఇంతవరకు ఏదేశం కూడా కనిపెట్టలేకపోయింది. వైరస్‌ ‌పుట్టిన చైనాలో ఎంతతొందరగా ఈ వైరస్‌ ‌వ్యాపించిందో, అంతే తొందరగా దీన్ని అదుపుచేయగలిగింది. ఇప్పుడా దేశం కనుగొన్నట్లు చెబుతున్న వ్యాక్సిన్‌ను త్వరలోనే ఇతర దేశాలకు అందిస్తామని చెప్పడం ఒకింత ఆశ్చార్యాన్ని కలిగిస్తున్న అంశం. ఏ వైరస్‌కైన వ్యాక్సిన్‌ ‌కనుగొనాలంటే కనీసం రెండు సంవత్సరాలకు పైగానే సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండగా, చైనా ఇంత త్యరగా వ్యాక్సిన్‌ను ఎలా కనుగొన్నదన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది ఈవ్యాధి కోరల్లో చిక్కుకోగా, వేలసంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. దీని బారి నుండి ప్రజలను కాపాడేందుకు సరైన మందులేకపోయినా, ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు అనేక రకాలుగా శ్రమించి వైరస్‌ ‌బారిన పడినవారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి భయంకర వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచదేశాలు తీవ్రస్థాయిలో పరిశోధనలు జరుపుతున్నాయి. ఈ భయంకర వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్‌ ‌కోసం ప్రపంచమంతా వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నది. దాదాపు అన్ని దేశాలు ఈ వ్యాక్సిన్‌ ‌కోసం పరిశోధనలు చేపట్టాయనే చెప్పాలి. కాగా పేరెన్నికగన్న 35 ఫార్మా కంపెనీలు, సంస్థలు ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తి కోసం ముందుకు వచ్చాయి. ఇప్పటికి కొన్ని కంపెనీలు వ్యాక్సిన్‌ను తయారుచేసినట్లు చెబుతున్నా అవింకా ప్రయోగాలదశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌కిప్పుడా ఘనత దక్కబోతున్నది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ ఈ ‌వ్యాక్సిన్‌ ఆవిష్కరించినట్లు వెలుగులోకి వచ్చింది. తాను కనిపెట్టిన వ్యాక్సిన్‌కు టి-సెల్‌ ఎపిటోమ్‌ అని ప్రొఫెసర్‌ ‌పేరు పెట్టారు. యూనివర్శిటీ ఆఫ్‌ ‌హైరదాబాద్‌(‌హెచ్‌సియూ)లో బయో కెమిస్ట్రీ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ ‌సీమా మిశ్రా దీన్ని తయారు చేశారు. కొరోనా వైరస్‌ ‌కారణంగా మనిషి శరీరంలో చెడిపోయిన కణాలను అంతంచేసే అణుమాత్రం శక్తికలిగిన ఇతరకణాలను ఆమె సృష్టించింది. అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు ఇప్ఫుడిదింకా పరిశోధన దశలోనే ఉంది. దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరుగాల్సి ఉన్నాయి. శాస్త్రవేత్తల సమిష్టి పరీక్షలు జరిపి ఆమోదించడానికి దీనికింకా చాలా సమయమేపట్టేట్లుంది.

మొదటగా వైరస్‌ ‌ప్రబలిన చైనాకన్నా ఎక్కువ మరణాలు సంభవించిన అగ్రరాజ్యమైన అమెరికా కూడా వ్యాక్సిన్‌ ‌తయారీలో నిమగ్నమైఉంది. ఇప్పటికే అక్కడి శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి పర్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వేలిముద్ర పరిమాణంలో ఉండే ఈ టీకాకు పిట్‌కోవాక్‌ (‌పిట్స్‌బర్గ్ ‌కరోనా వైరస్‌)‌గా నామకరం చేశారు. ఈ వ్యాక్సిన్‌ను పిట్స్‌బర్గ్ ‌యూనివర్శిటికీ చెందిన స్కూల్‌ ఆప్‌ ‌మెడిసెన్‌ ‌పరిశోధకులు రూపొందించారు. బోస్టన్‌కు చెందిన మోడెర్నా థెరప్యుటిక్స్ ‌బయోటెక్‌ ‌సంస్థ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫక్టియస్‌ ‌డీసీజెస్‌తో కలిసి క్లినికల్‌ ‌పరీక్షలను నిర్వహిస్తున్నది. అలాగే శాండియాగోలోని సొర్రెంటోలో ఉన్న ఇనోవియో ఫార్మస్యూటికల్స్ ‌కంపెనీ ఇప్పటికే వైరస్‌ ‌విరుగుడు వ్యాక్సిన్‌ను కనిపెట్టినట్లు చెబుతున్నది. ఈ కంపెనీ ఇంతకు క్రితం జికా, మర్స్, ఎబోలా లాంటి వైరస్‌లకు విరుగుడు మందులను తయారుచేసింది కూడా. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌కూడా ఇటీవల త్వరలోనే తమ దేశం ఈ వైరస్‌కు విరుగుడు వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ వైరస్‌ ‌వల్ల బాగా నష్టపోయిన ఇజ్రాయిల్‌, ‌జర్మనీ లాంటి దేశాలు కూడా వ్యాక్సిన్‌ ‌తయారుచేయడంలో ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇజ్రాయిల్‌ అయితే ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తిచేసి త్వరలో మార్కెట్‌లోకి వ్యాక్సిన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

కాగా కొరోనా వైరస్‌కు పొగాకు మొక్కల నుండి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు బెన్సన్‌ అం‌డ్‌ ‌హెడ్జస్‌, ‌లక్కీ ప్ట్రెక్‌ ‌లాంటి ప్రముఖ బ్రాండ్ల సిగరెట్ల తయారీ కంపెనీ బ్రిటీష్‌ అమెరికన్‌ ‌టొబాకో(బీఎటీ) ప్రకటించింది. బ్రిటన్‌ ‌ప్రభుత్వ సహకారం లభిస్తే జూన్‌ ‌నెలనుంచి వారానికి 30లక్షల డోసుల వాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. కాగా ఆస్ట్రేలియాలోని మొనాష్‌ ‌బయోమెడిసిన్‌ ‌డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు మరో ప్రఖ్యాత సంస్థ పీటర్‌ ‌డోయర్టీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షన్‌ అం‌డ్‌ ఇమ్యూనిటీ సంయుక్తంగా సింగిల్‌ ‌డోస్‌తోనే మనిషి శరీరంలోని వైరస్‌ 48‌గంటల్లో పూర్తిగా నశించిపోయే విధంగా పరిశోధనలు చేస్తున్నది. కోవిడ్‌ 19 ‌వైరస్‌కు వ్యాక్సిన్‌ ‌తమ దగ్గర ఉన్నట్లు కెనడాకు చెందిన మెడికాగో కంపెనీ ప్రకటించింది. ఇరవై రోజుల్లోనే ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు ఆ కంపెనీ చెబుతున్నది. అయితే దాన్ని ఎఫ్‌డిఏ అనుమతికి పంపామని, అన్ని క్లియరెన్స్‌లు వస్తే 2021 నవంబర్‌లో ఈ మందు అందుబాటులో ఉంటుందనిచెబుతున్నది. అయితే జనవరిలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ ‌విరుగుడుకు వ్యాక్సిన్‌ను అంతతొందరగా ఎవరు కనిపెట్టలేదని, ఎంతలేదన్నా రెండు నుండి నాలుగేళ్ళ కాలం పడుతుందని, అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు చెబుతున్న క్రమంలో ఈ వ్యాక్సిన్‌ ‌వచ్చేలోగా ప్రపంచ వ్యాప్తంగా మరెన్ని మరణాలను చూడాల్సివస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు.

Leave a Reply