Take a fresh look at your lifestyle.

విరసం రాష్ట్ర కార్యదర్శి ప్రొ।। ఖాసిమ్‌ అరెస్టు

Virasam, Secretary,State ,Qasim's Arrest, Ou campus, snehalatha,Relations, Maoists

  • మావోయిస్టులతో సంబంధాలపై అనుమానంతో సోదాలు
  • తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు
  •  అరెస్టును ఖండించిన వామపక్ష నేతలు

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌డా,ఖాసిమ్‌ను గజ్వేల్‌ ‌పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ క్వార్టర్స్‌లోని ఆయన ఇంట్లోకి గడ్డపారతో తలుపులు పగులగొట్టి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు దాదాపు ఆరు గంటల పాటు సోదాలు నిర్వహించి ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ప్రొ.ఖాసిమ్‌ ఇటీవలే విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం గమనార్హం. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో 2016లో సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌ ‌స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏ2గా ఉన్నారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గజ్వేల్‌ ఏసిపి నారాయణ నేతృత్వంలో ప్రొ.ఖాసిమ్‌ ఇం‌ట్లోకి
బలవంతంగా ప్రవేశించిన పోలీసులు ఆయన ఇంటిని క్షుణ్నంగా తనిఖీలు చేశారు. ఇంట్లోని వస్తువులన్నింటినీ చిందర వందర చేసి కొన్ని కీలక డాక్యుమెంట్లు, విప్లవ సాహిత్యం, కరపత్రాలతో పాటు కంప్యూటర్‌ ‌హార్డ్ ‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితం ములుగు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు నాడు ఖాసీం కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదే కేసులో మరోసారి సెర్చ్ ‌వారెంట్లతో సోదాలు చేశామని వెల్లడించారు. ప్రొ.ఖాసింను అరెస్టు చేసిన అనంతరం ఆయనను గజ్వేల్‌కు తరలించారు. ప్రొ.ఖాసిం ఇంట్లో తనిఖీలు, అరెస్టు సందర్భంగా సందర్బంగా విద్యార్థులు ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ ‌చేశారు.

న్యాయపరంగా తేల్చుకుంటాం : స్నేహలత
ప్రొ.ఖాసింను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన సతీమణి స్నేహలత ఆరోపించారు. ఓయూ క్యాంపస్‌లో ఉన్న తమ ఇంట్లోకి ప్రవేశంచాలంటే ఓయు విసి లేదా రిజిస్ట్రార్‌ అనుమతి ఉండాలని చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా తలుపులు పగులగొట్టి దౌర్జన్యంగా ప్రవేశించారని విమర్శించారు. ఇంట్లోని వస్తువులన్నింటినీ చిందర వందర చేసి వ్యక్తిగత వస్తువులను సైతం తనిఖీ చేసి తమను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ప్రొ.ఖాసిం అరెస్టుపై కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ప్రొ.ఖాసిం అరెస్టుపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఖాసిం కేవలం విప్లవ భావాలు కలిగిన వ్యక్తి అనీ, అంతమాత్రాన ఆయనను అరెస్టు చేయడం ఫాసిస్టు చర్య అని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విడుదల చేసిన ప్రకటనలో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనీ, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతో పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి ప్రొ.ఖాసింను అరెస్టు చేయడం పౌరహక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ప్రొ.ఖాసిం అరెస్టు పభుత్వం ప్రజా ఉద్యమాల అణచివేతలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు.

Tags: Virasam, Secretary,State ,Qasim’s Arrest, Ou campus, snehalatha,Relations, Maoists

Leave a Reply