Take a fresh look at your lifestyle.

మరోసారి ట్రంపరితనం

“జో బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ ‌మద్దతుదారులు యూఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌భవనంలోకి చొచ్చుకొచ్చారు. అమెరికా జెండాలు పట్టుకుని, ట్రంప్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ చొచ్చుకురావడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్‌ ‌గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రంప్‌ ‌మద్దతుదారులు బీభత్సం సృష్టించడంతో సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఈ కాల్పుల ఘటనలో గురువారం నాటికి మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా.. ఘర్షణల్లో గాయపడిన మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వాషింగ్టన్‌ ‌డీసీ పోలీసులు మీడియాకు వెల్లడించారు. హింస పెచ్చుమీరుతుండటంతో వాషింగ్టన్‌ ‌డీసీలో మేయర్‌ ‌మురియెల్‌ ‌బౌజర్‌ ‌కర్ఫ్యూ విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరరూ బయటకు రావొద్దనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ట్రంప్‌ ‌మద్దతుదారులు కొందరు ఈ ఆంక్షలను లెక్కచేయకుండా తిరిగి ఆందోళనలకు దిగటం పరిస్థితి మరింత దిగజారింది.”

rehana senior journalistఅమెరికా క్యాపిటల్‌ ‌భవనంలో అల్లరి మూకలు సరిగ్గా చెప్పాలంటే ట్రంప్‌ ‌మద్దతు దారులు జొరబడి చేసిన హింసతో మరోసారి అగ్రరాజ్యం మీడియా హెడ్‌ ‌లైన్స్‌లోకి ఎక్కింది. అమెరికా శ్వేత సౌధ అధిపతిగా డొనాల్డ్ ‌ట్రంప్‌ ఎన్నిక అయినప్పటి నుంచి అమెరికా వివాదాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌గా మారిపోయింది. నాలుగేళ్ళ క్రితం ట్రంప్‌ అనూహ్య గెలుపు నుంచి మొన్నటి ఊహించిన ఓటమి వరకు …ట్రంప్‌ ‌నడిచిన మార్గం అంతా ట్రంపరితనమే. నోటికి తోచినట్లు మాట్లాడటం, విచిత్ర, వింతైన నిర్ణయాలు ఏక పక్షంగా తీసుకోవటంమే కాకుండా కరోనా కోరల్లో దేశాన్ని ఒక రకంగా నెట్టేసిన చరిత్ర ట్రంప్‌ది. అణువణువుల జాతి, లింగ వివక్ష నింపుకుని ఉండే స్వభావాన్ని బహిర్గతం చేయటంలోనూ ఏ మాత్రం సిగ్గుపడని తీరు. నాలుగేళ్ళ పాటు ఈ విచిత్ర పాలనతో అల్లాడిన అమెరికావాసులు ఓటు ద్వారా తీర్పు ఇచ్చి ఊపిరి పీల్చుకున్నారు. ఓటమిని ఒప్పుకుంటే ట్రంప్‌ ఎలా అవుతాడు? జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా గెలిచినా…ఓట్ల లెక్కింపు స్పష్టంగా కనిపిస్తున్నా…అధ్యక్ష పీఠాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేని ట్రంప్‌ ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు అంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఒక దశలో అసలు తానే గెలిచానని కూడా చెప్పుకున్నారు. అధ్యక్ష భవనం నుంచి పెట్టే బేడా సర్దుకుని రావటానికి ససేమిరా అంటున్న ట్రంప్‌, ఆయన మద్దతుదారులు ఇప్పుడు మరో అధ్యాయానికి తెర లేపారు.

క్యాపిటల్‌ ‌భవనంలో కాల్పులు
క్యాపిటల్‌ ‌భవనంలోకి ట్రంప్‌ ‌మద్దతుదారులు జొరబడి దాడి చేయటానికి ప్రధాన కారణం అంగీకరించలేని ట్రంప్‌ ఓటమి. గత ఏడాది నవంబర్‌ ‌తొలివారంలో ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమిపాలైయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ ‌మరో రెండు వారాల్లో బాధ్యతలు చేపట్టాల్సి వుంది. ఈ సమయంలో బైడెన్‌ను తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకోవటం అనే ప్రక్రియను పూర్తి చేయటానికి కాంగ్రెస్‌ ‌సమావేశమయ్యింది. దీని కంటే ముందు పెన్సినిల్వేనియా, ఆరిజోనా రాష్ట్రాల ఓట్ల పై ట్రంప్‌ ‌వర్గం నుంచి వచ్చిన అభ్యంతరాలను సెనేట్‌, ‌సర్వప్రతినిధుల సభ రెండూ తోసిపుచ్చాయి. దీనితో ఎలక్టోరల్‌ ఓట్ల ధ్రువీకరణ జరిగినట్లు అయ్యింది. ఈ సమయంలో జో బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ ‌మద్దతుదారులు యూఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌భవనంలోకి చొచ్చుకొచ్చారు. అమెరికా జెండాలు పట్టుకుని, ట్రంప్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ చొచ్చుకురావడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్‌ ‌గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రంప్‌ ‌మద్దతుదారులు బీభత్సం సృష్టించడంతో సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఈ కాల్పుల ఘటనలో గురువారం నాటికి మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా.. ఘర్షణల్లో గాయపడిన మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వాషింగ్టన్‌ ‌డీసీ పోలీసులు మీడియాకు వెల్లడించారు. హింస పెచ్చుమీరుతుండటంతో వాషింగ్టన్‌ ‌డీసీలో మేయర్‌ ‌మురియెల్‌ ‌బౌజర్‌ ‌కర్ఫ్యూ విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరరూ బయటకు రావొద్దనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ట్రంప్‌ ‌మద్దతుదారులు కొందరు ఈ ఆంక్షలను లెక్కచేయకుండా తిరిగి ఆందోళనలకు దిగటం పరిస్థితి మరింత దిగజారింది. దీంతో వాషింగ్టన్‌ ‌డీసీలో 15 రోజుల పాటు ఎమర్జెన్సీని ప్రకటించారు.

Trump Supporters Hold "Stop The Steal" Rally In DC Amid Ratification Of Presidential Election

బహుశా ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక దేశాధ్యక్షుడి సోషల్‌ ‌మీడియా ఖాతాలను బ్యాన్‌ ‌చేయటం ఇప్పటి వరకు జరుగలేదనుకుంటా. అందులోనూ భూమండలం పైనే అత్యంత శక్తిమంతుడిగా అనిపించే అగ్రరాజ్య అధ్యక్షుడి ఖాతాలను నిషేధించటం అసాధారణ అంశం. క్యాపిటల్‌ ‌భవనంలో ట్రంప్‌ ‌మద్దతుదారుల అల్లర్ల నేపథ్యంలో డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌ఖాతాను 12 గంటల పాటు ట్విట్టర్‌ ‌స్థభింపజేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేసింది ట్విట్టర్‌. అం‌తే కాదు భవిష్యత్తులో తమ విధానాలను ఉల్లంఘిస్తే ట్రంప్‌ అకౌంట్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. అదే సమయంలో ట్విట్టర్‌ ‌నియమాలకు విరుద్ధంగా ట్రంప్‌ ‌చేసిన పోస్ట్‌లను ఖాతా నుంచి తొలగించాలని సూచించింది. అటు ఫేస్‌బుక్‌ ‌కూడా ఇదే దారి ఎంచుకుంది. ట్రంప్‌ ఎఫ్‌బీ అకౌంట్‌ను 24 గంటలపాటు స్తంభింపజేసింది. ట్రంప్‌ ‌పెట్టిన ఓ వీడియోను ఆయన వాల్‌ ‌నుంచి తొలగించింది. నిబంధనలు ఉల్లంఘించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్‌ ‌బుక్‌ ‌వెల్లడించింది.

అభిశంసన దిశగా అడుగులు•
నాలుగేళ్ళ కితం ఏ ప్రజా తీర్పుతో తనకు అమెరికా అధ్యక్ష పగ్గాలు అందాయో…ఇవాళ అటువంటి ప్రజా తీర్పుతోనే బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ వాస్తవాన్ని, ప్రజా తీర్పును గౌరవ ప్రదంగా అంగీకరించాల్సిన స్థాయిలో ఉండి…ట్రంప్‌ ‌చేస్తున్న ప్రయత్నాలు, వాదనలు, ఆరోపణలు అభ్యంతరకరమే. క్యాపిటల్‌ ‌భవనం వేదికగా జరిగిన దాడి, హింస పతాక స్థాయికి చేరిందనే చెప్పాలి. అందుకే కాపిటల్‌ ‌బిల్డింగ్‌ ‌పై దాడికి దిగిన నిరసనకారులకు మద్దతును తెలిపిన అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌ను అభిశంసించే ఆలోచనలో ఆయన క్యాబినెట్‌ ‌సహచరులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. క్యాపిటల్‌ ‌బిల్డింగ్‌ ‌లో జరిగిన ఘటనలను జాతి విద్రోహంగా పరిగణిస్తున్న మంత్రులు ట్రంప్‌ను రెండు వారాల కాలం కూడా వేచి చూడకుండా వెంటనే తొలగించాలని భావిస్తున్నట్లు కొన్ని అమెరికా పత్రికల కథనాలు చెబుతున్నాయి. దీని కోసం అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఈ అధికరణ ప్రకారం అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడు, క్యాబినెట్‌ ‌మంత్రులు కలసి తొలగించవచ్చు. అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అత్యధికులు నమ్మితే అతన్ని అభిశంసించే అవకాశం అమెరికా రాజ్యాంగంలో ఉంది. ఈ ప్రక్రియను చేపడతారా లేక ఇప్పటికే ప్రజా తీర్పుతో ఓటమి పాలై ఉన్నారు కనుక కొద్ది రోజులు ఓపిక పడితే ట్రంప్‌ ‌శ్వేత సౌధాన్ని ఖాళీ చేయక తప్పదు అని ఎదురు చూస్తారా అనేది ప్రస్తుతానికి భిన్న చర్చల వరకే ఉంది. అటు యూఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌తదుపరి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నికను నిర్ధారించిన కాసేపటికి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ‌ట్రంప్‌ -‌జనవరి 20న అధికార బదలాయింపు ప్రక్రియ పద్ధతి ప్రకారం జరిగేలా చూసేందుకు కట్టుబడి ఉన్నామంటూ ట్వీట్‌ ‌చేశారు. అయితే ఈ ట్వీట్‌లో కూడా అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి జరిగిందంటూ పాత పాటను మళ్లీ పాడారు. ట్రంప్‌ ‌తన మాటలకు, చేతలకు కట్టుబడి ఉండే నాయకుడు కాదు కనుక…అమెరికా అధ్యక్ష బదలాయింపు జరిగేంత వరకు ఈ ఉత్కంఠత కొనసాగుతూనే ఉంటుంది.

Leave a Reply