Take a fresh look at your lifestyle.

కొరోనా చికిత్సల నిబంధనలు ఉల్లంఘించిన…. ప్రైవేటు దవాఖానాలపై కొరడా

  • ఫీజుల దోపిడీ ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం
  • 50 హాస్పిటల్‌లకు నోటీసులు, ఓ దవాఖానపై విచారణ

రాష్ట్రంలో కొరోనా వైరస్‌కు చికిత్స పేరుతో బాధితుల నుంచి అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కొరోనా చికిత్సల విషయంలో ప్రభుత్వ నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారో సమాధానం చెప్పాలని 50 దవాఖానాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే, కొరోనా రోగికి వైద్య చికిత్సల పేరిట రూ.లక్షల ఫీజు వసూలు చేయడంతో పాటు ఆమె మృతికి కారణమైన ఘటనపై విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో కొరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానాలపై అధిక భారం పడింది. దీంతో అక్కడి దవాఖానాలలో చేరిన రోగులకు బెడ్లు అందుబాటులో లేకపోవడం, మరికొన్ని దవాఖానాలలో ఆక్సీజన్‌, ‌వెంటిలేటర్‌ ‌సదుపాయం వంటివి లేకపోవడంతో బాధితుల తరఫు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కొరోనా చికిత్సలకు ప్రైవేటు దవాఖానాలను ఎందుకు అనుమతించడం లేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వంపై భారం పడకుండా కొరోనా చికిత్సలకు ప్రైవేటు దవాఖానాలను కూడా అనుమతించాలనీ, చికిత్సలకు సంబం ధించి బాధితుల నుంచి వసూలు చేయా ల్సిన ఫీజులు, వారికి అందజేయాల్సిన సౌకర్యాలపై నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మేరకు కొరోనా బాధితులకు వైద్య చికిత్సలకు సంబంధించి ఎన్ని దవాఖానాలలో సౌకర్యాలు ఉన్నాయి ? ఎంత ఫీజు వసూలు చేయాలి ? వంటి అంశాలపై ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆ దవాఖానాలకు స్పష్టం చేసింది. అయితే, ప్రైవేటు దవాఖానాలకు కొరోనా చికిత్సలకు అవకాశం ఇచ్చినప్పటి నుంచి సరిగా సౌకర్యాలు లేవనీ, వైద్య చికిత్సలు అందించడం లేదనీ, ఫీజులు ఇబ్బడిముబ్బడిగా గుంజుతున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై బాధితుల తరఫు బంధువులు, నెటిజన్లు వందల సంఖ్యలో ఏకంగా రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసైకి ట్విట్టర్‌ ‌ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్‌ ఈ అం‌శంపై ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కొందరు బాధితులు ప్రైవేటు దవాఖానాల దోపిడీపై హైకోర్టును సైతం ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి మీడియా ద్వారా వాట్సాప్‌ ‌నంబరును ప్రజలకు ప్రచారం చేసింది. అయినప్పటికీ ప్రైవేటు దవాఖానాల ఆగడాలు ఆగలేదు. ఈనెల 15న ప్రారంభమైన ఫిర్యాదుల విభాగానికి ప్రతీ రోజు దాదాపు 50 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. మరోవైపు, ఫిర్యాదుల విభాగాన్ని ప్రారంభించడానికి మాత్రమే పరిమితం కావడంతో ప్రైవేటు హాస్పిటల్స్ ‌రోగులను అడ్డగోలుగా ఫీజుల వసూలు చేయడం ఆపలేదు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, ప్రభుత్వ దవాఖానాలలో సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండటంతో ప్రైవేటు దవాఖానాల అవసరం తప్పనిసరిగా మారింది. ఇప్పటికీ చాలా వరకు కొరోనా బాధితులు ప్రైవేటు దవాఖానాలనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా ప్రైవేటు దవాఖానాలు ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి బాధితుల నుంచి ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరంలోని ఓ కొర్పొరేట్‌ ‌దవాఖానాలో కొరోనాతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించారు. వీరి వద్ద నుంచి దవాఖానా యాజమాన్యం రూ.లక్షల ఫీజు వసూలు చేసింది. దీంతో బాధితుడి కుమారుడు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ‌ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో కోవిడ్‌ ‌నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు దవాఖానాల యాజమాన్యాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటలకు సూచించారు. ఇదే విషయంపై విచారణ జరిపించాలని మంత్రి ప్రజారోగ్య శాఖ సంచాలకునికి ఆదేశాలు జారీ చేశారు. హాస్పిటల్‌లో బాధితుని తంద్రికి ఇచ్చిన వైద్య చికిత్సలు, ఎంత ఫీజు వసూలు చేశారనే అంశంపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పాటు కొరోనా చికిత్సల విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారో సమాధానం చెప్పాలంటూ మరో 50 ప్రైవేటు దవాఖానాలకు నోటీసులు జారీ చేశారు.

Leave a Reply

error: Content is protected !!