Take a fresh look at your lifestyle.

‘‘‌మహిళా ‘జిందగీ’కి స్ఫూర్తి ‘ఆమె’”

బేకెన్‌ ‌గారు అన్నట్లుగా ‘‘కొన్ని పుస్తకాలు రుచి చూడాలి, కొన్నింటిని మింగేయాలి, కొన్నిటిని నమిలి జీర్ణం చేసుకోవాలి’’, ఇందులో చివరి కోవకు చెందినది వినోద్‌ ‌గారి ‘ఆమె’ పుస్తకం. ఈ పుస్తకాన్ని ‘మగపిల్లలే పుట్టాలని, దేవుళ్ళకు మొక్కే తల్లిదండ్రులకు సానుభూతితో..’ అంటూ అంకితం ఇచ్చిన విధానంలోనే రచయిత దృక్పథం స్ఫష్టం అవుతుంది. వినోద్‌ ‌మామిడాల యువ జర్నలిస్ట్ ‌నమస్తే తెలంగాణ పత్రికలో పనిచేస్తూ ‘జిందగి’ పేజీలో ప్రచురించిన మహిళల సక్సెస్‌ ‌స్టోరీస్‌ అన్నీ కలిపి ఆమె పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. అననుకూల పరిస్థితులను సైతం తమకు అనుకూలంగా మల్చుకొని విజయం పొందిన దేశీయ, విదేశీయ మహిళలవి మాత్రమే కాకుండా, దూల్‌ ‌పేట లాంటి బస్తీల్లో సారా బట్టీలు కాసే మహిళలు కూడా జీవితాల్లో ఎలా రాణించారో చెప్పిన స్ఫూర్తి గాథలే ఇవన్నీ. అవకాశాలు ఉన్నప్పటికీ డిగ్రీలు, పీజీలు చదివుకున్న మహిళలు తమలోని సృజనాత్మకథను వెలికితీయకుండా సంసార సాగరంలో పడి కొట్టుకుపోతున్న జీవితాలకు, అవకాశాలు లేక నిర్లిప్తతలతో నిండిపోయిన మహిళల జీవితాలకు ఈ పుస్తకం క్యాటలిస్టు గా పనిచేస్తుంది.

పేద, మధ్య తరగతి ప్రజానికంలోని ముఖ్యంగా దళిత బహుజన ఆడపిల్లలను ఎంతో కష్టపడి అప్పులు చేసి మరీ డిగ్రీలు చదివించడం, అటు తర్వాత పెళ్లి చేసి పంపిచేస్తే తమ బాధ్యత తిరిపోయిందనే ధోరణి నేటికి తల్లిదండ్రుల్లో పేరుకుపోయి ఉంది. అలాగే భవిష్యత్తుపై సరైన అవగాహన కొరవడడం, ఆర్ధిక స్వాతంత్య్రం, స్థిరత్వం పొందడానికి ఉపాధి అవకాశాలు వెతుక్కునే దశలోనే బలవంతంగా ఎవరికో ఒకరికి కట్టబెట్టి చేతులు దులుపేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత తమలోని ప్రతిభను ప్రోత్సహిస్తే తప్ప తనను తాను నిరూపించుకోలేక వంటింటికి పరిమితం అవుతున్నారు, లేదంటే తండ్రి ఆస్తులనో, భర్త చెడు మార్గంలో వ్యవస్థను, వ్యక్తులను మోసం చేసిన సొమ్ములతో గొప్పగా ప్రదర్శిస్తూ అస్తిత్వం లేని అస్థి పంజరాళ్లలా మిగిలిపోతున్నారు. భర్త చనిపోతేనో, వదిలిపెడితేనో తప్ప ఉపాధి వైపు ఆలోచించలేని అసమర్థులుగా తీర్చిదిద్దుతున్న ఘనత మాత్రం మనువాదపు పితృస్వామ్య వ్యవస్థదే!. కొంచెం ఆర్ధికంగా నిలదొక్కుకున్న కుటుంబాల్లోని ఆడ బిడ్డలు మాత్రమే కెరీర్‌ ‌పరంగా దృష్టి సారించి తమకంటూ స్వతహాగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను పొందుతున్నారు. పెళ్లి, పిల్లలు అనే సంసారం చట్ర బంధనంలో పడి తమ సత్తాను మరిచి నలబైల్లో పడగానే ఇదే జీవితమనే నిర్లిప్తత, నిరసక్తత పొందిన మహిళలకు కూడా స్ఫూర్తి నింపేలా మన మధ్యలో ఉంటూ మనకు తెలియని ఎన్నో జీవితాల్లోని వెలుగులను వాటి వెనుక వారు జీవితంపై చూపిన కసిని కళ్ళకు కట్టినట్టు చూపించి ప్రేరణ పొందే విదంగా ఉన్న ఈ జీవితాలను చదువుకోవాలి.

ప్రతి ఒక్కరి జీవితంలో స్త్రీకి ఆర్ధిక స్వాతంత్య్రం ఎంతటి ఆత్మగౌరవాన్ని ఇస్తుందో వీరి జీవితాలే సజీవ సాక్ష్యం. పట్నం పాత బస్తీలోని దూల్‌ ‌పేటలో నాటు సారా కాసే మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం వారు, వారికి స్వయం ఉపాధి అవకాశాలుగా పచ్చళ్ళు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి, శిక్షణ ఇచ్చి, వాటిని విదేశాలకు ఎగుమతి చేసి ఆర్ధిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న వారి జీవితాలు ప్రతి సాధారణ మహిళకు స్ఫూర్తిదాయకం. ఆరేళ్ళ వయసులో వంద శాతం అంధత్వంతో జీవితంలో చీకట్లు అలుముకున్న ‘ప్రంజల్‌ ‌పాటిల్‌’ ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎక్కడా మనోధైర్యాన్ని కోల్పోకుండా పీహెచ్డీ వరకు చదువుకొని ప్రజా సేవలో బాగమవాలనే కసితో భారతీయ మొదటి అంధ మహిళా ఐఏఎస్‌ అధికారిగా చరిత్రకెక్కిన జీవితం, అన్నీ ఉండి కూడా ఏదో కోల్పోయినట్టు తమ తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితులను తిట్టుకుంటూ టివిలకు, సెల్‌ ‌ఫోన్‌ ‌లకు భానిసలయిన యువతులకు చెంపపెట్టు ఈమె జీవితం. తన స్వంత కాళ్లపై నిలబడలేని అంగవైకల్యం తో వీల్‌ ‌చైర్‌ ‌కే పరిమితమైన ‘రాధా రాయ్‌’ ‌మధురమైన కంఠంతో ఏఆర్‌ ‌రహమాన్‌, ‌శంకర్‌ ‌మహదేవన్‌ ‌ల మెప్పు పొంది బాలివుడ్‌ ‌లో ఓ వెలుగు వెలుగుతూ లక్ష్యాన్ని ప్రేమిస్తే వైకల్యం లోపమేమి కాదు, మనసులో ఏదో సాధించాలనే పట్టుదల లేకపోవడమే నిజమైన వైకల్యం అని తన జీవితం ప్రేరణగా నిలుస్తోంది. ప్రతి దానికీ వెంటనే ఫలితాన్ని ఆశించే యంత్రాలుగా తయారవుతున్న మనకు ‘గండికోట లక్ష్మి’ జీవితం మనలో ఆలోచనలు రేకెత్తిస్తోంది. పెళ్లి, పిల్లలు ఇళ్ళు, సంసారం ఇవన్నీ ఉన్నా తన అభిరుచిని నిర్లక్ష్యం చెయ్యకుండా, గెలుపు ఓటములను ఖాతరు చేయకుండా, నిరంతరం తన ప్రతిభకు పదును పెడుతూ క్రికెట్‌ ‌పై ఇష్టాన్ని పెంచుకున్న లక్ష్మి ని యాభై ఏళ్ళ వయసులో ఐసీసీ గుర్తించింది.

అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన ప్రాంతం దేవరకొండ లో మెప్మా వారి సహకారంతో స్నేహిలత సమభావన సంఘం సభ్యులు జ్యూట్‌ ‌బ్యాగుల తయారీలో రాణిస్తూ నెలకు పది పదిహేను వేల ఆదాయం పొందుతూ ఆర్ధిక స్వావలంబన పొందుతూ, చదువు లేకున్నా స్వయం కృషితో ఎదుగుతున్న జీవితాలను, చదవడం తెలియని మహిళకు సైతం చదివి వినిపించాల్సిన జీవితాలు వీరివి. కలెక్టర్‌ ‌కావాలన్న తండ్రి ఆశలను పక్కన పెట్టిన శ్యామల తనకు ఇష్టమైన కెరీర్‌ ‌లో రాణించాలని బొమ్మలు గీయడం లో ఇష్టం పెంచుకొని, ఇలాంటివి నేర్చుకుంటే రోడ్లపై అడుక్కోవాలి అనే అవమానాలను ఇంట్లో నుండి ఎదుర్కొన్నా లెక్క చేయకుండా యానిమేటర్‌ ‌గా ఎదిగి ఎంచుకున్న రంగంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. పెళ్ళి , పిల్లలు అయిన తర్వాత, నీళ్ళంటే భయం ఉన్న శ్యామల 40 ఏండ్ల వయస్సు లో ఈతలో శిక్షణ పొంది తెలంగాణ ప్రభుత్వం చే లక్ష రూపాయల బహుమతి గెలుచుకొని అక్కడితో ఆగకుండా రామసేతును ఈదడమే తన లక్ష్యం అంటూ,జీవితంలో లక్ష్యాన్ని చేరడానికి వయసు అడ్డంకి కాదనే స్ఫూర్తిని, మహిళలు ఒక్క రంగమే కాదు వివిధ రంగాల్లో కూడా ప్రతిభను చాటొచ్చని తన తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.

చిన్నతనంలోనే తండ్రి తన తల్లిని విడిచిపెడితే,తల్లి సంపాదనతోనే చదువుకొని, అమ్మమ్మ తాతల ఆదరణలో పెరిగిన ‘‘భావన కస్తూరి’’, డిగ్రీలో ఎన్‌ ‌సీసీ లో జాయిన్‌ అయి సుపిరియర్స్ ‌తో మెప్పులు పొంది, ఆర్మీ ఆఫీసర్‌ అవ్వాలనే లక్ష్యంతో ఉండగా, బందువులంతా ‘అడపిల్లవి నీ వల్ల కాదు’అని దెప్పిపోడుస్తున్నా,లెక్కపెట్టక లెఫ్టినెంట్‌ ఆఫీసర్‌ ‌స్థాయికి చేరి 144 మంది పురుష సైనిక బృందానికి నాయకత్వం వహించి దేశం తర్వాతే కుటుంబం అన్నటువంటి హైదరాబాదీ అమ్మాయి తల్లి కలలు అమ్మమ్మ తాతయ్య ల ఆశలు నిలబెట్టింది.ఒక వయసుకు వచ్చాక అంతా అయిపోయిందని, పిల్లలు పుట్టాక జీవితం అయిపోయిందనుకునే మహిళకు సెయిలింగ్‌ ‌లో రాణించి అలలపై తన కలల ప్రయాణం చేసిన ‘ఆలేఖ్య మహారాజు’ ఆదర్శం. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో స్పూర్తి గాథలను ఆమె పుస్తకం చదవి ప్రేరణ పొందవచ్చు. నాకు తెలిసిన ఆప్తురాలు,ఉన్నత విద్యావంతురాలు, భర్త తన ప్రతిభకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుటుంబ పోషణకు ఎటువంటి ఆర్ధిక సహాయం చెయ్యకున్నా, స్వయం ఉపాధితో ఆర్ధికంగా నిలదొక్కుకొని కుటుంబాన్ని పోషిస్తూ, ఇద్దరు అమ్మాయిలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే రాజీలేని పోరాటం నాకెప్పుడూ ఆదర్శంగా నిలుస్తోంది. ఇలాంటి లిఖించని ఎన్నెన్నో జీవితాలకు ‘ఆమె’ పుస్తకం ఆత్మస్థైర్యాన్నిస్తూ, బాసటగా నిలబడుతుంది.

నేటి పెట్టుబడిదారీ వ్యవస్థలో టివి, సెల్‌ ‌ఫోన్‌ ‌లు మహిళలలోని సృజనాత్మక ఆలోచనలను చంపుతున్న ప్రమాదకరమైన వస్తువులు. తాను ఏమి పౌడర్‌ ‌వాడలనే దగ్గర నుండి ప్రతిదీ తమ ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా స్త్రీ మెదళ్ళను తమ ఆధీనంలో ఆడిస్తున్న కాపీటలిస్ట్ ‌ట్రాక్‌ ‌నుండి బయటపడి స్త్రీ ఆర్ధిక స్వేచ్ఛ ను పొంది ఆత్మగౌరవంతో బ్రతకాలంటే యూట్యూబ్‌ ‌లాంటివి మాత్రమే చూస్తూ కాలం వెళ్ళిబుచ్చడం కంటే ఇలాంటి పుస్తకాలను చదివి స్ఫూర్తి పొందాలి. ‘‘స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి..’’ అంటూ అభ్యుదయ బోధనలు చేసిన చలం గారి సాహిత్యాన్ని కూడా చదవండి. ఇది కేవలం స్త్రీలు మాత్రమే చదవాల్సిన పుస్తకం కాదు, స్త్రీల ఎదుగుదలకు మనువాదాపు పితృస్వామ్య భావజాలంతో నిండిన పురుష అహంకారాన్ని నింపుకున్న మెదడులకు కూడా కనువిప్పు కలిగించే పుస్తకమిది. ముఖ్యంగా హైస్కూలు లెవల్‌ ‌లో ఉన్న విద్యార్థి, విద్యార్థినిలు చదవాల్సిన గొప్ప పుస్తకం.
-ముఖేష్‌ ‌సామల, 9703973946

Leave a Reply