Take a fresh look at your lifestyle.

స్వరాష్ట్రంలోనూ అక్రమాల పరంపర

ఐఅండ్‌పిఆర్‌ ‌ప్రకటనల కుంభకోణంపై విజయశాంతి సంచలన పోస్టు

తెలంగాణ ఐఅండ్‌పిఆర్‌(‌సమాచార, ప్రజా సంబంధాల శాఖ) ప్రకటనల కుంభకోణంపై బిజెపి సీనియర్‌ ‌లీడర్‌, ‌ప్రముఖ సినీనటి, మాజీ ఎంపి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ మంగళవారం సోషల్‌ ‌మీడియాలో సంచలన పోస్టు చేశారు. ఏ దోపిడీ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని ఎంత పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామో…ఆ పోరాటయోధులు, అమరవీరుల త్యాగాలు, ఆత్మార్పణలకు ఏ మాత్రం విలువ లేకుండా ఉమ్మడి రాష్ట్ర కాలపు అక్రమాల పరంపరను నేటి తెలంగాణ పాలకులు జంకూ గొంకూ లేకుండా కొనసాగించారనడానికి మరో తిరుగులేని సాక్ష్యాన్ని మీడియా బయటపెట్టిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడాదైనా గడవకముందే 2015 నుంచి రెండేళ్ల పాటు ఐఅండ్‌పిఆర్‌(‌సమాచార ప్రజా సంబంధాల) విభాగంలో కొనసాగిన అవినీతి వారసత్వం బట్టబయలైందనీ, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల పేరు చెప్పి… విదేశీ అడ్వర్టయిజింగ్‌ ‌కంపెనీ డబ్ల్యూపిపి భారతీయ విభాగాల(జెడబ్ల్యూటి మైండ్‌సెట్‌ ఏడివిటి)తో కుమ్మక్కై వీసమెత్తు ప్రచారం కూడా చెయ్యకుండా అందరూ కలసి మొత్తంగా సుమారు రూ.12 కోట్లు…పత్రికల్లో యాడ్స్ అం‌టూ మరి కొన్ని కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు మీడియాలో కథనాలు వొచ్చినట్లు గుర్తు చేశారు.

ఈ సొమ్ములో రూ.7.5 కోట్లు డిఐపిఆర్‌ అధికారుల వాటాగా ఇచ్చినట్లు జెడబ్ల్యూటి మైండ్‌సెట్‌ ‌నివేదిక ద్వారా తెలిసింది. కలకలం రేపుతున్న మరో విషయం ఏమిటంటే, ఈ డబ్ల్యూపిపి సంస్థ పలు దేశాల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడినప్పటికీ, భారతదేశంలో మాత్రం ప్రధానంగా తెలంగాణలోనే అవినీతికి పాల్పడినట్లు ఆ వార్తా కథనం స్పష్టం చేసిందనీ, దీన్ని బట్టి ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్థమవుతూనే ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ పాలకులకు సంబంధం లేదంటే పసిపిల్లలు కూడా నమ్మరనీ, తెలంగాణలో పాలనా పగ్గాలు అందుకున్నప్పటి నుంచీ అధికార పార్టీ వారి అవినీతి, అక్రమాల చిట్టా పెరుగుతూ పోయిందే తప్ప ఎక్కడా తగ్గలేదన్నారు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఇలా ఏర్పడిందో లేదో…ఆ మరుక్షణం నుంచే అవినీతి మెట్లెక్కుతూ…అక్రమాల పుట్టలు కడుతూ ప్రజల్ని మోసగించిన వైనం చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయనీ ఆ పోస్టులో విజయశాంతి పేర్కొన్నారు.

Leave a Reply