*పోస్టులో కనిపించని ఛైర్పర్సన్, కాంగ్రెస్ ప్రచార కమిటీ పేరు
*కమలానికి దగ్గరయ్యేందుకేనా…!?
*ఔననే అంటున్నాయి బిజెపి శ్రేణులు
*ఫలించని టాగూర్ మంత్రాంగం?
*పనిలో పనిగా సిఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు
ఎ.సత్యనారాయణ రెడ్డి / హైదరాబాద్, నవంబర్ 8 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): విజయశాంతి అలియాస్ రాములమ్మ. ఫైర్‌బ్రాండ్ పొలిటీషియన్‌గా పేరు తెచ్చుకున్న సినీ నటి విజయశాంతి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ హోదాలో ఉన్న విజయశాంతి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంటున్న విజయశాంతితో బిజెపికి చెందిన బండి సంజయ్ కిషన్‌రెడ్డి వరుస భేటీలతో విజయశాంతి కాంగ్రెస్ పార్టీ వీడుతారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ హోదాలో ఉన్నప్పటికీ..కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి దూరం ఉండటమే కాకుండా, కనీసం కాంగ్రెస్ పార్టీకి వోటెయ్యాలనీ కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే బిజెపి నేతలు కలవడం..బిజెపి నేత బండి సంజయ్ పట్ల సిద్ధిపేట పోలీస్ కమిషనర్ వ్యవహరించిన తీరును ఖండించడం తెలిసిందే. దీంతో ఆమె కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరడం దాదాపు ఖాయమనే ఊహాగానాలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం టాగూర్ రంగంలోకి దిగారు. విజయశాంతిని కలిసేందుకు నేరుగా ఆమె నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా టాగూర్ ఆమెతో సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా విజయశాంతి పలు విషయాలను టాగూర్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని విజయశాంతి.. టాగూర్‌కు స్పష్టంగా వివరించడంతో పాటు పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతలను తనకు అప్పగించాలంటూ విజయశాంతి కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే,మీకు(విజయశాంతి)సంబంధించిన బాధ్యతలన్నింటికీ తనది భరోసా అని చెప్పి…పార్టీ వీడొద్దంటూ నచ్చచెప్పినట్లు తెలుస్తుంది. విజయశాంతిని టాగూర్ కలిసిన తర్వాత అన్నీ చక్కబడుతాయనీ అందరూ అనుకున్నారు. కానీ, ఇక్కడే సీన్ రివర్సయింది. టాగూర్ విజయశాంతిని కలిసేదానికి ముందుగా రాష్ట్రంలోని ఏదైనా సమస్యపై సోషల్ మీడియాలో స్పందించినప్పుడు తన అధికారికి ఫేస్బుక్లో…‘విజయశాంతి, ఛైర్పర్సన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ’అని స్పష్టంగా ఉండేది. కానీ, తాజాగా…ఆదివారం ఆమె తన అధికారిక ఫేస్బుక్లో పెట్టిన పోస్టులో…‘ఛైర్పర్సన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ’ అనే పేరుఎగిరిపోయింది. కేవలం ‘విజయశాంతి అని మాత్రమే ఉంది’. వెనకా, ముందు ఏమీ లేదు.
ఇదే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నది. దీంతో విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాం…రాం…అని చెప్పినట్లేననీ కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చ ఊపందుకుంది. బిజెపికి దగ్గరయ్యేందుకే ఆమె తన తాజా పోస్టులో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ పేరు, ఛైర్పర్సన్ పేరును ప్రస్తావించలేదనీ సమాచారం. తాజాగా…విడుదల చేసిన పోస్టులో ఆమె ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై తనదైనశైలిలో మండిపడ్డారు. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విడుదల చేసిన పోస్టులో ఆమె ఏమన్నారంటే… ‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి… ఇంకొందరిని భయపెట్టి… ఒత్తిళ్లతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే పక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బిజెపి తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం టాగూర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి. కాంగ్రెస్‌ను బలహీనపరిచే పక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బిజెపి తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం టాగూర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలం, ప్రజలే నిర్ణయించాలి’’ అని విజయశాంతి పేర్కొన్నారు. ఈ పోస్టులో గతంలో మాదిరిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని కానీ, ఛైర్పర్సన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ అని విజయశాంతి పేర్కొనకపోవడం వెనకాల పక్కా ముందస్తు వ్యూహమేననీ అత్యంతమైన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. టాగూర్ రంగంలోకి దిగడంతో అంతా చక్కబడుతాయనీ అందరూ అనుకున్నారు. కానీ, రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహంతో ఉన్న ఫైర్‌బ్రాండ్ పొలిటీషియన్‌గా పేరు తెచ్చుకున్న సినీ నటి విజయశాంతి మాత్రం తన కడుపులో ఉన్న కోపాన్ని మాత్రం చల్లార్చుకోలేదనీ తాజాగా..ఆమె విడుదల చేసిన పోస్టే చెప్పకనే చెబుతున్నది. కాంగ్రెస్ పార్టీని వీడాలనే నిర్ణయంతోనే ఆమె తాజాగా విడుదల చేసిన పోస్టులో కాంగ్రెస్ పార్టీ పేరును ప్రస్తావించలేదనీ అత్యంతమైన విశ్వసనీయవర్గాలు ఆదివారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి వివరించాయి. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం(నవంబర్, 10)తర్వాత ఆమె పార్టీ వీడటం తథ్యమనీ బిజెపి పార్టీలో జోరుగా చర్చ సాగుతున్నది. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. చూడాలి మరి!