Take a fresh look at your lifestyle.

రైతుల పాలిట శాపంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ విజయశాంతి ఫైర్‌

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బిజెపి సీనియర్‌ ‌నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ నటి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తనదైనశైలిలో నిప్పులుచెరిగారు. గురువారం ఆమె సోషల్‌ ‌మీడియా ద్వారా ఓ పోస్టు చేస్తూ…తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ రైతుల పాలిట ఎంత శాపంగా మారిందని చెప్పడానికి గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలే నిలువెత్తు సాక్ష్యాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో ఒక మహిళ తన భూమి సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక తహశీల్దార్‌ ‌కార్యాలయం గుమ్మానికి తన తాళిబోట్టు వేలాడదీసిందన్నారు. అంతకుముందు మెదక్‌ ‌జిల్లా తాళ్లపల్లి తండాలో మరణించిన మాలోత్‌ ‌బాబు అనే రైతుకు పట్టాదారు పాస్‌బుక్‌ ‌రాకపోవడంతో ఆ కుటుంబానికి రైతుబీమా పరిహారం, రైతుబంధు అందలేదని శివ్వంపేటలోని తహశీల్దారు కార్యాలయం వద్ద తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయనీ గుర్తు చేశారు.

ప్రతి పత్రికలోనూ, చానెల్‌లోనూ ఈ సంఘటనలే ప్రధాన అంశాలుగా కనిపించాయనీ, రాష్ట్రమంతటా రైతులకు ఇలాంటి అనుభవాలు దాదాపు ప్రతిరోజూ ఎదురవుతూనే ఉన్నాయన్నారు. ఇవి చాలదన్నట్టు ఏదో కొద్దిమంది రైతులకు అరకొరగా రైతుబంధు డబ్బులు అందినా అవి కాస్తా పాతబాకీల కింద బ్యాంకులు జమ చేసుకునే పరిస్థితి అన్నారు. కేసీఆర్‌ ‌సర్కారు సక్రమంగా రుణమాఫీ చేసి ఉంటే ఇలాంటి దుస్థితి ఎదురై ఉండేది కాదనీ, ఇవీగాక నకిలీ విత్తనాల సమస్య, పంట కొనుగోళ్ల ఇబ్బందులు ఉండనే ఉన్నాయన్నారు. ఆ పైన భూ సమస్యల పరిష్కారానికి సర్వరోగ నివారిణి అంటూ సర్కారు వారు గొప్పగా చెప్పుకునే ధరణి వెబ్‌సైట్‌ ‌సవాలక్ష సాంకేతిక సమస్యలతో రైతులతో పాటు ప్రజలందరినీ ముప్పుతిప్పలు పెడుతోందనీ, తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న అస్థవ్యస్త పరిస్థితులకు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలనీ ఆ పోస్టులో విజయశాంతి పేర్కొన్నారు.

Leave a Reply