Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌…‌నీ అక్రమ కేసులకు నేను భయపడను

  • 2012నాటి కేసుకు నాంపల్లి కోర్టుకు హాజరైన విజయశాంతి
  • అప్పుడు నా పేరే లేదు..తాజాగా చేర్చారు
  • ఇది భయపెట్టడం కాదా? విజయశాంతి సూటి ప్రశ్న

తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెట్టారు. పోలీస్‌ ‌స్టేషన్ల చుట్టూ తిప్పారు. జైలుకు పంపించారు. భయపెట్టారు. బెదిరించారు. అయినా ఒక్కడుగు కూడా వెకనడుగు వేయలేదు. కేసులకు, బెదిరింపులకు నేనెప్పుడు భయపడలేదు. ఇక ముందు కూడా భయపడను. తెలంగాణ కోసం దేనికైనా సిద్ధంగానే ఉన్నాననీ బిజెపి నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ అన్నారు. కేసుల బూచి చూపెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నన్ను భయపెట్టాలని అనుకుంటున్నారు. దొర….కేసీఆర్‌ ‌నేను కేసులకు ఆనాడు భయపడలేదు. ఇప్పుడు కూడా భయపడను. ఇంకెన్ని కేసులు పెడుతావో పెట్టుకో అని సిఎం కేసీఆర్‌ను రాములమ్మ తనదైనశైలిలో హెచ్చరించారు. ఈ మేరకు గురువారమిక్కడ నాంపల్లి కోర్టుకు హాజరైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ…2009, 2012లో తాను టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కేసీఆర్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు ప్రచారానికి రావల్సిందిగా కేసీఆర్‌ ‌చెబితేనే తాను బహిరంగ సభలకు వెళ్లి ప్రచారం చేసి వచ్చాననీ, సభలకు అనుమతి తీసుకున్నారా? లేదా?అనేది పూర్తిగా నన్ను ఆహ్వానించిన కేసీఆర్‌దేననీ అన్నారు.

సభలకు అనుమతి తీసుకునే బాధ్యత తనది కాదనీ, కేవలం ప్రచారం మాత్రమే తాను చేశాననీ చెప్పుకొచ్చారు. పదేండ్ల కిందట జరిగిన సభలకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయనీ, పలువురు నేతలు కోర్టుకు కూడా హాజరవుతున్నారనీ అన్నారు. నడుస్తున్న కేసులో తన పేరు లేదనీ, ఇప్పుడు ఉన్నఫలంగా పాత కేసులో తన పేరును చేర్చి కోర్టుకు హాజరు కావల్సిందిగా నాలుగు రోజుల కిందట నాకొక నోటీసు ఇచ్చారన్నారు. కోర్టుపైన ఉన్న గౌరవంతో కేసుకు హాజరయ్యాననీ, అయితే తనకు సంబంధం లేకున్నా, తనను కావాలని పాత కేసుల్లో ఇరుకించి ఇబ్బందులకు గురి చేయాలని సిఎం కేసీఆర్‌ ‌కుట్రలు చేస్తున్నారనీ విజయశాంతి ఆరోపించారు. అయితే, తనకు కేసులు కొత్తేమీ కాకపోయినప్పటికీ…తనకు సంబంధం లేని పాత కేసుల్లో తాజాగా కావాలని ఇరికించడమేమిటని ప్రశ్నించారు.

సిఎం కేసీఆర్‌ అ‌క్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారనీ, అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులను అణచివేయాలని చూస్తున్నారనీ అన్నారు. కేసీఆర్‌ ‌తాటాకు చప్పుళ్లకు తాను భయపడే రకం కాదన్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో…అన్నింటినీ తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాననీ, తనకు కోర్టులన్నా, చట్టాలన్నా అపారమైన గౌరవం ఉందనీ, దీంతోనే కోర్టుకు హాజరయ్యాయనీ తనపై తాజాగా నమోదు చేసిన అక్రమ కేసును చట్టపరంగా ఎదుర్కొంటాననీ అన్నారు. కానీ, కేసీఆర్‌కు మాత్రం భయపడే ప్రసక్తే లేదనీ రాములమ్మ చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసయ్యేటప్పుడు కూడా కేసీఆర్‌ ‌పార్లమెంటులో లేడనీ, తాను మాత్రమే ఉన్నాననీ విజయశాంతి మరోసారి గుర్తు చేశారు.

కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌కు ముందుకు రండి… విజయశాంతి పిలుపు
కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌వేయించుకోవడానికి ముందుకు రావాలని బిజెపి నాయకురాలు, ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ పిలుపునిచ్చారు. ఆమె గురువారమ్కిడ కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్‌ ‌కేసులు మనందరినీ హెచ్చరిస్తున్నాయనీ.. కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌తీసుకోవడానికి ప్రజలందరూ భయాందోళన వీడి ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. . ఈ రోజే(గురువారం) నేను వ్యాక్సిన్‌ ‌తీసుకున్నాను. వ్యాక్సిన్‌ ‌తీసుకోవడం వల్ల మనకు రెండు రకాలుగా మేలు జరుగుతోందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు.

ఒకటి… మనం కోవిడ్‌ ‌నుంచి రక్షణ పొందుతాం. రెండవది… మన వల్ల ఇతరులకు ఈ వైరస్‌ ‌వ్యాపించకుండా ఆపగలుగుతామన్నారు. అందువల్ల సందేహాలు విడిచిపెట్టి ధైర్యంగా ముందుకువచ్చి వ్యాక్సిన్‌ ‌తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్‌ ‌తీసుకున్న తర్వాత కూడా భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం మర్చిపోవద్దనీ, ఈ చర్యలు ఎప్పటికీ మనకు, ఇతరులకు మేలు చేస్తాయనీ విజయశాంతి అన్నారు.

Leave a Reply