Take a fresh look at your lifestyle.

కరోనా నియంత్రణలో ప్రపంచానికే ఆదర్శం..వియత్నాం

“వియత్నాంలో కరోనా వ్యాప్తి ప్రారంభ దశ నుంచే వియత్నాం ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల చర్యలు ప్రారంభించింది. వియత్నాంకు వచ్చే ఎవరైనా పద్నాలుగు రోజుల క్వారంటైన్‌కు వెళ్ళడం తప్పనిసరి చేసింది. అన్ని దేశాలకు విమానాలను రద్దు చేసి, రవాణా వ్యవస్థలను స్థంభింపజేసింది. ఇదివరకే వ్యాధి సోకిన వ్యక్తులను వేరు చేసి, అంతకు ముందు వారిని కలిసిన వ్యక్తులను కూడా గుర్తించి వారిని  కూడ క్వారంటైన్‌కు తరలించింది. ప్రజల నుంచి కూడా గొప్ప సహకారం ప్రభుత్వానికి లభించింది.”

చైనాలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన కోవిడ్‌-19 ‌మహమ్మారి ఇప్పుడు దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించి మానవాళిని తీవ్ర ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టేసింది. కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టుటలో అన్ని దేశాలు వివిధ రకాల చర్యలను చేపట్టాయి. అయితే మొదట్లో ఈ కొత్త వైరస్‌ ‌గురించిన అవగాహనను పరిమితం చేసి చైనా ప్రభుత్వం కూడా పారదర్శకంగా వ్యవహరించకపోవడం వ్యాధి వ్యాప్తికి కారణమైంది. వ్యాధి సంబంధిత సమాచారాన్ని ప్రపంచానికి తెలియకుండా మీడియాను నియంత్రించడంలో చైనా అత్యంత కఠినంగా వ్యవహరించింది. తీరా కళ్ళు తెరిచే సమయానికి ఒక వూహాన్‌, ‌హుబెయ్‌ ‌ప్రావిన్సులే కాదు, మొత్తం చైనా యావత్‌ ‌ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది నిరంకుశ పాలన యొక్క అనివార్య ఫలితం. ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడవలసి వస్తుందన్న భయంతో రాజకీయ స్థిరత్వం ముసుగులో వ్యాధిగ్రస్తుల గణాంకాలు తారుమారు చేయబడ్డాయి.

కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి అన్ని దేశాలను వణికిస్తున్నప్పటికినీ, వియత్నాం దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న తీరు ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తోంది. 2020 జనవరి 23న వియత్నాంలో కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని ధృవీకరించగా, ఫిబ్రవరి మొదటి తారిఖున కోవిడ్‌-19 ‌వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. జనవరి చివరిలో జరిగిన టెట్‌ ‌కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ‘‘కరోనా వైరస్‌ ‌పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు’’ వియత్నాం ప్రభుత్వం తెలిపింది. అయితే అప్పటికి కరోనా ఇంకా చైనాకే పరిమితమై ఉంది. కానీ, ఈ వైరస్‌ ‌వియత్నాం చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని ప్రభుత్వం గ్రహించింది. అందుకే ‘‘ఈ అంటువ్యాధితో పోరాటం అంటే శత్రువుతో పోరాడటం వంటిదే’’ అని ముందే ప్రకటించింది అంటే కరోనాను అరికట్టడంలో వియత్నాం ఎంత నిబద్ధతతో ఉందో తెలుస్తుంది. పోరాటం ఏదైనా ఆర్థికంగా భారాన్ని కలిగించే విషయమే. వియత్నాం కూడా ఈ విషయంలో అతీత దేశమేమీ కాదు. నిధుల లేమి అన్నింటికన్నా ముఖ్యమైన సమస్యగా పరిణమించింది. దక్షిణ కొరియా తరహాలో కరోనాకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టే సామర్థ్యం వియత్నాంకు లేదు. అయినా తన పోరాటాన్ని కొనసాగించడానికే మొగ్గు చూపింది.

పరిపాలనా పరంగా చైనాలో గల రాజకీయ విధానాన్ని అనుసరించే వియత్నాం మీడియా సెన్సార్‌ ‌షిప్‌, ‌సమాచార నియంత్రణలో చైనాకంటే చురుకుగానే వ్యవహరిస్తుంది. అయితే చైనా తరహాలో వ్యాధి విషయంలో గోప్యతను పాటిస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించింది. వూహాన్‌ ‌నగరంలో వెలుగు చూసిన వైరస్‌ ‌గురించి చైనా సామాజిక మాధ్యమాలలో నెమ్మదిగానే విస్తరిస్తున్న సమయంలోనే ముఖంపై ధరించే మాస్క్‌ల వాడకాన్ని వియత్నాం ప్రభుత్వం ప్రచారం చేసింది. పెద్ద మొత్తంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని కరోనా వైరస్‌ ‌తీవ్రతను ప్రచారం చేయడం ప్రారంభించారు. చైనా తరహాలో సమాచారాన్ని నియంత్రించే విధానం పాటిస్తే పరిస్థితి దిగజారుతుందని వియత్నాం గ్రహించింది. చైనాతో గల రాజకీయ, ఆర్థిక సంబంధాల కంటే తమ ప్రజల ప్రాణమే ముఖ్యమని ప్రభుత్వం ప్రకటించడం ప్రజాసంక్షేమంలో వారి నిబద్ధతకు నిదర్శనం. సత్వరమే చైనా నుండి సందర్శకులను నిలిపివేసింది. చైనాతో పాటు ఇతరదేశాలకు బయలుదేరే విమానాలన్నింటినీ రద్దు చేసింది. అంతేకాదు ఫిబ్రవరి ప్రారంభం నుండే తమ దేశంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అన్నింటిని మూసివేయించి, భౌతిక దూరాన్ని విధిగా అమలు పరిచింది.

చైనాలోని వూహాన్‌లో పనిచేస్తున్న వియత్నామి వలస కార్మికుల ఆరోగ్యస్థితిపై వియత్నాంలో ఆందోళన మొదలైంది. వెంటనే స్పందించిన ప్రభుత్వం రెండు వారాల తరువాత హనోయికి ఉత్తరాన ఉన్న విన్‌, ‌ఫుక్‌ ‌ప్రావిన్సులలో 21 రోజులు క్వారంటైన్‌ ‌శిబిరాలను ఏర్పాటు చేసింది. హనోయ్‌, ‌హోచమిన్‌ ‌నగరాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కఠినమైన నిర్బంధ విధానాలను అమలు పరిచి, వైరస్‌ ‌మరింతగా వ్యాప్తి చెందకుండా మొత్తం నగరాలను చివరి ప్రయత్నంగా లాక్‌ ‌డౌన్‌ ‌చేయడం జరిగింది. ఇవన్ని చైనా కంటే ముందే వియత్నాంలో అమలు చేయడం విశేషం. ఫిబ్రవరి 12వ తారీఖుననే అనుమానితులను వియత్నాంలో క్వారంటైన్‌కు తరలించడం ప్రారంభించి, మూడు వారాల పాటు అక్కడ ఉంచారు. జర్మనీ వంటి పాశ్చాత్య దేశాలు వ్యాధి సోకిన వారి మొదటి ప్రత్యక్ష పరిచయాన్ని మాత్రమే నమోదు చేయగా, వియత్నాంలో వ్యాధి సోకిన వ్యక్తి రెండవ, మూడవ, నాలుగవ స్థాయి పరిచయాలను సైతం ట్రాక్‌ ‌చేశారు. వీరందరి కదలికలు, సంప్రదింపులు అసాధారణ రీతిలో పరిమితం చేయబడ్డాయి.

వియత్నాం ఇప్పటికీ కమ్యూనిస్టు దేశమైనప్పటికినీ ప్రజా సంక్షేమం దృష్ట్యా కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టడమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని ప్రకటించి ప్రజలలో నైతిక బలాన్ని పెంపొందించింది. కరోనా బాధితుల గురించిన సమాచారం విషయంలో గోప్యత పాటిస్తూనే అవసరమైనప్పుడు కొందరి వివరాలను వ్యూహాత్మకంగా బహిర్గత పరిచి ప్రజలను జాగృత పరుస్తోంది. ప్రజాస్వామ్య దేశాలలో కంటే కమ్యూనిస్టు దేశమైన వియత్నాంలోనే క్వారంటైన్‌లో చేరే విషయంలో ప్రజల సహకారం ఆశావాహంగా ఉంది. కరోనా వైరస్‌ ‌గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారి మీద ఉక్కుపాదం మోపారు. కరోనా వ్యాప్తి ప్రారంభ కాలంలోనే దాదాపు ఎనిమిది వందల మంది మీద తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని జరిమానాలు విధించారు. అంతేకాదు క్వారంటైన్‌లో వెళ్ళడానికి వ్యతిరేకించే వారిని సైతం ప్రజలు సామాజిక మాధ్యమాలలో ఏకిపారేయడం వియత్నామి ప్రజల జాతీయతా భావనకు నిదర్శనం.వియత్నాంలో కరోనా వ్యాప్తి ప్రారంభ దశ నుంచే వియత్నాం ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల చర్యలు ప్రారంభించింది. వియత్నాంకు వచ్చే ఎవరైనా పద్నాలుగు రోజుల క్వారంటైన్‌కు వెళ్ళడం తప్పనిసరి చేసింది. అన్ని దేశాలకు విమానాలను రద్దు చేసి, రవాణా వ్యవస్థలను స్థంభింపజేసింది. ఇదివరకే వ్యాధి సోకిన వ్యక్తులను వేరు చేసి, అంతకు ముందు వారిని కలిసిన వ్యక్తులను కూడా గుర్తించి వారిని కూడ క్వారంటైన్‌కు తరలించింది. ప్రజల నుంచి కూడా గొప్ప సహకారం లభించడం వియత్నాం ప్రభుత్వానికి లభించింది. విదేశాల నుండి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు పొరుగు వారే ఇవ్వడంతో వారిని క్వారంటైన్‌కు తరలించడం సులభతరమైంది. వ్యాధి సోకిన వ్యక్తి సమీపంలో ఉన్నట్లైతే వెంటనే సమచారం అందిస్తారు.

ఏక పార్టీ వ్యవస్థ గల వియత్నాం దేశం కరోనా వ్యాప్తిని నివారించడంలో సైనిక, భద్రతా పరమైన సేవలతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకున్నది. అంటువ్యాధిపై ప్రభుత్వ పారదర్శకతను చాటుతూనే ప్రజలలో జవాబుదారీతనాన్ని కలిగించింది. ప్రభుత్వం దగ్గర గల పరిమిత వనరుల గురించి ప్రజలకు దోహదపరిచి వ్యాధి నివారణ వ్యక్తిగత బాధ్యత అని స్పష్టం చేసింది. కరోనా వ్యాధి అనుమానితుల జాబితాను తయారు చేసి, ఆసుపత్రి సందర్శనను తప్పనిసరి చేశారు. పరిమిత వైద్య సదుపాయాలున్న వియత్నాంలో కేవలం ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలతో కరోనా వ్యాప్తిని అదుపులో ఉంచగలిగింది. ఆర్థిక కార్యకలాపాల కోసం నగదు రహిత వ్యవహారాలకు ఆమోదం తెలిపి, ఆన్‌ ‌లైన్‌ ‌సేవలు, క్రెడిట్‌, ‌డెబిట్‌ ‌కార్డుల వాడకాన్ని ప్రోత్సహించింది. ఈ విధంగా వియత్నాం ప్రభుత్వం అమలుచేసిన అన్ని వ్యూహాలు సానుకూల ఫలితం అందించాయి. ఇప్పటివరకు (16 ఏప్రిల్‌, 2020) ‌దేశంలో 268 కరోనా పాజిటివ్‌ ‌కేసులను గుర్తించగా, అందులో 171 మంది పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవడం విశేషం. ఇంతవరకు దేశంలో ఒక్క కరోనా సంబంధిత మరణం లేకపోవడం గమనార్హం.గత రెండు దశాబ్దాలుగా వియత్నాంలో జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. 2002 నుండి 2018 మధ్య కాలంలో ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక మరియు ప్రజా సంక్షేమ పథకాలతో దాదాపు నలభై ఐదు మిలియన్‌ ‌ప్రజలు పేదరికం నుండి మెరుగైన జీవన ప్రమాణాలు పొందే దశకు చేరుకున్నారు. 2018 నాటికి స్థూల జాతీయోత్పత్తి రెట్టింపు దశకు చేరుకుంది. దీనితోపాటు దేశ వాస్తవ జాతీయోత్పత్తి 7.1 శాతంగా నమోదైనది. ప్రభుత్వము చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల ఆయుర్ధాయం 2015 వరకు 71 ఏళ్ళ నుంచి 77 ఏళ్లకు పెరిగింది. ప్రభుత్వపరంగా మెరుగైన వైద్య ఆరోగ్య పథకాలు చేపడుతున్నప్పటికినీ ఇంకా ఈ రంగంలో అభివృద్ధి కావలసి ఉంది. అక్కడ ప్రతి పదివేల మందికి ఎనిమిది మంది వైద్యులే ఉన్నారు. చైనాలో ఈ సంఖ్య పద్దెనిమిది. అయినప్పటికీ పరిమిత వనరులతోనే కరోనా వ్యాధిని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్న వియత్నాం దేశ స్ఫూర్తి అన్ని దేశాలకు ఆచరణ యోగ్యం.

jayaprakash ankam
– జయప్రకాశ్‌ అం‌కం

Leave a Reply