Take a fresh look at your lifestyle.

సాగునీటి వివక్షత పై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్‌ ‌రావు

నేడు ఆర్‌. ‌విద్యాసాగర్‌రావు వర్ధంతి

వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టుల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌ ‌రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ,ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం. సాగునీటి రంగలో నిపుణులైన విద్యాసాగర్‌ ‌రావు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంపై జరిగిన అన్యాయంపై ఎలుగెత్తి చాటారు. నీటిపారుదల శాఖలో వివిధ పదవులలో, హోదాలలో పని చేసిన ఆయన, టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై ఎప్పటికప్పుడు సమాచారం, సలహాలు ఇస్తూ సందేహాలను నివృత్తి చేసేవారు. సాగునీటి రంగంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఆయన ఆధార సహితంగా, బహిర్గత పరిచి, ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రేరేపించడం లో, ఉద్యమ తెరాస పార్టీ అధినేతకు వెన్నుదన్నుగా ఉన్నారు. అలా కేసీఆర్‌కు ఉన్న అతి దగ్గర వ్యక్తులలో విద్యాసాగర్‌రావు ఆంతరంగిక ముఖ్యులలో ఒకరై పోయారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తన పరిజ్ఞానంతో కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన భాగస్వామ్యం విడదీయ జాలనిది, ఆయన పాత్ర నిజంగా మరువలేనిది..

జయశంకర్‌ ‌తర్వాత తెలంగాణ జాతికి దక్కిన మరో గొప్ప మహానుభావుడు విద్యాసాగర్‌ ‌రావు అని కేసీఆర్‌ ‌చేత ప్రశంసింప బడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ ఆయన. ఆర్‌ ‌విద్యాసాగర్‌రావు (14 నవంబరు 1939 – 2017 ఏప్రిల్‌ 29) ‌తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన జాజిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, రాఘవరావు దంపతులకు విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యా య వృత్తిలో ఉన్న స్థితి, వారి కుటుంబంలో అందరికీ చదువు పట్ల ఆసక్తి కలగడానికి హేతు వైంది. వారి గ్రామంలో తొలి సారిగా మెట్రిక్యులేషన్‌ ‌చేసిన వ్యక్తి రాఘవ రావు కాగా, మొదటి పట్టభద్రులు రాఘవరావు పెద్ద కుమారుడు, మొట్టమొదటి ఇంజనీరింగ్‌ ‌పట్టభద్రుడు విద్యాసాగర్‌ ‌రావు కావడం విశేషం.

విద్యాసాగర్‌ ‌రావు 1960లో హైదరాబాదు లోని ఉస్మానియా విశ్వ విద్యాలయము నుండి ఇంజనీరింగ్‌ ‌లో పట్టభద్రు లయ్యారు. 1979 లో రూర్కీ విశ్వ విద్యాలయం (ప్రస్తుతం ఐఐటి రూర్కీ) లో నీటి వనరుల అభివృద్ధి లో మాస్టర్స్ ‌డిగ్రీని పొందారు. ఆయన 1983లో అమెరికా లోని కొలోరాడో స్టేట్‌ ‌విశ్వ విద్యాలయం నుండి నీటి వనరుల వ్యవస్థ ఇంజనీరింగులో డిప్లొమా పొందారు. ఆయన 1990లో ఢిల్లీ విశ్వ విద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టాను కూడా సంపాదించారు. బీటెక్‌ ‌పూర్తి అయిన వెంటనే క్యాంపస్‌లోని మహిళా కాలేజీ మెయింటెనెన్స్ ఇం‌జీనీరుగా ఉద్యోగంలో చేరారు. కళల పట్ల ఆసక్తి కలిగిన ఆయన, ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా రాయటం, నాటకాలు వేయడం వంటి హాబీలకు దూరం కాలేదు. అను దినం సాయంత్రం విధుల నిర్వహణ అనంతరం రవీంద్రభారతికి వెళ్ళేవారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసి, అనంతరం ఢిల్లీకి వెళ్లారు. కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్‌ ‌రైల్వేస్‌, ‌నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేశారు. ఢిల్లీలో ఉన్న సమయంలో సాగునీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్నారు. ఉద్యోగం నుండి విశ్రాంతి పొందాక, తరువాత తిరిగి హైదరాబాద్‌ ‌వచ్చారు. దాదాపు 34 సంవత్సరాల పాటు కేంద్ర జలసంఘంలోనే విధులు నిర్వహించడంతో ఆయన దేశవ్యాప్తంగా జల వనరుల అంశంపై అపారమైన అనుభవం గడించారు.

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల విషయాలపై సమగ్ర అవగాహన, సరైన ఆలోచనను కలిగి ఉండేవారు. 2016 నవంబరులో కాకతీయ విశ్వవిద్యాలయంచే నిర్వహించబడిన ‘‘మిషన్‌ ‌కాకతీయ’’ ప్రాజెక్టుకు సంబంధించిన సెమినార్‌ ‌లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగంలో వ్యవసాయరంగంలో నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వ విధానాలను సమగ్రంగా వివరించారు. 2014లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌జనీర్స్ (‌భారతదేశం) ఆయనను ‘‘లీడింగ్‌ ఇం‌జనీరింగ్‌ ‌పెర్సనాలిటీస్‌ ఆఫ్‌ ఇం‌డియా’’గా గుర్తించి, పురస్కార గ్రహీత ను చేసింది. ఆయన ఎన్నో రచనలు చేశారు. పత్రికల్లో రాసిన వ్యాసాలన్నింటినీ కలిపి.. ‘నీళ్లు-నిజాలు’ పేరుతో పుస్తక రూపంలో ప్రచురించారు. అలా నీళ్ళు నిజాలు విద్యాసాగర్‌ ‌రావు గా పేరెన్నిక గన్నారు. ఎన్‌. ‌శంకర్‌ ‌దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రంలో ఉచిత పాత్రలో నటించారు.

ఐక్యరాజ్య సమితి ఇన్విరాన్‌మెంటల్‌ ‌ప్రోగ్రామ్‌లో సభ్యుడిగా, సెంట్రల్‌ ‌వాటర్‌ ‌కమిషన్‌లో చీఫ్‌ ఇం‌జనీర్‌గా సేవలు అందించిన విద్యాసాగర్‌ ‌రావు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. 12వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన లోనూ సలహాలు అందించారు. సాగునీటి రంగ రిటైర్డ్ ‌చీఫ్‌ ఇం‌జినీరుగా, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారుగా సుపరిచితులు అయిన విద్యా సాగర్‌రావు రచయితగా, నటునిగా చూపిన ప్రతిభ గురించి చాలా మందికి తెలియదు. గిరీషం కలం పేరుతో ఆయన రాసిన రచనలు అనేక పత్రికల్లో ప్రచురించారు. బాల్యంలో కవి సమ్మేళనాలు, నాటకాల ప్రదర్శనలకు వెళ్లేవారు. కాలేజ్‌ ‌స్థాయి వివిధ పోటీల్లో పాల్గొని, నాటకాలు కూడా వేసేవారు. కొంత కాలం ఆనారో గ్యానికి గురై, 2017 ఏప్రిల్‌ 29‌న హైదరాబాద్‌ ‌లో దివంగతులైనారు.

– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply