Take a fresh look at your lifestyle.

సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

భారతీయ వ్యవసాయ రంగానికి మరింత తోడ్పాటునందించేందుకు సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం నూతన వ్యవసాయ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని, ఈ దిశగా యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులు దృష్టిపెట్టాల్సిన అవసరముందని సూచించారు. అటల్‌ ‌ర్యాంకింగ్స్ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్ ఆన్‌ ఇన్నొవేటివ్‌ అచీవ్‌మెంట్స్(ఏఆర్‌ఐఐఏ) 2020 అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఇంటెర్నెట్‌ ‌వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. 52 శాతం మంది రైతులున్న మన దేశంలో వ్యవసాయానికి మరింత ప్రాధాన్యత పెంచాలన్న ఉపరాష్ట్రపతి.. కోవిడ్‌ ‌మహమ్మారి అన్ని వర్గాల వారిని అతలాకుతలం చేసినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా రైతులు మాత్రం మొక్కవోని ధైర్యంతో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుండటం శ్లాఘనీయమన్నారు.

రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు..దలారీ వ్యవస్థనుంచి వారిని బయటకు తేవడం, ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌దిశగా కూడా విస్తృతంగా ఆవిష్కరణలు జరగాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేలా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా విద్యావ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన వెంకయ్య.. మరోసారి భారత్‌ ‌విశ్వగురువుగా ప్రపంచానికి మార్గనిర్దేశనర చేయాలంటే..ఈ మార్పులు తప్పనిసరని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వచించిన ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌లక్ష్యాలను చేరుకునేందుకు మరిన్ని వినూత్న ఆవిష్కరణలు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుగొనాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ ‌పోఖ్రియాల్‌ ‌నిశంక్‌, ‌సహాయ మంత్రి సంజయ్‌ ‌ధోత్రే, ఏఐసీటీఈ చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ అనిల్‌ ‌సహస్రబుద్ధి, విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ ‌ఖరే, ఏఆర్‌ఐఐఏ ‌కమిటీ చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌బీవీఆర్‌ ‌మోహన్‌ ‌రెడ్డితోపాటు వివిధ విశ్వవిద్యాలయాల వీసీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply