Take a fresh look at your lifestyle.

నిరాడంబరత చాటుకున్న వెంకయ్య నాయుడు

పాక హోటల్లో ఇడ్లీ తిన్న మాజీ ఉపరాష్ట్రపతి

విజయవాడ, మే 2 : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోమారు తన నిరాడంబరతను చాటుకున్నారు. విజయవాడ నగరంలోని మున్సిపల్‌ ఎం‌ప్లాయూస్‌ ‌కాలనీలో పాక ఇడ్లీ సెంటర్‌లో వెంకయ్య నాయుడు టిఫిన్‌ ‌చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి వెంకయ్య నాయుడు నేతి ఇడ్లీ తిన్నారు. ఈ ఇడ్లీ తినేందుకే గన్నవరం నుంచి ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు విజయవాడ వచ్చారు. నాణ్యమైన ఇడ్లీ అందిస్తున్నారని హోటల్‌ ‌యజమాని కృష్ణ ప్రసాద్‌ను ప్రత్యేకంగా ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… పాక ఇడ్లీ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. గతంలో ఎప్పుడో ఒక్కసారి ఇక్కడ ఇడ్లీ తిన్నానని గుర్తుచేశారు.

నాణ్యమైన ఇడ్లీ తినాలనిపించి ఇక్కడకు వచ్చానని పేర్కొన్నారు. సంప్రదాయ వంటలనే ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని సూచించారు. పిజ్జా, బగ్గర్లు ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని చెప్పారు. యువతకు కూడా మన వంటకాల రుచులను చూపించి అలవాటు చేయాలన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ద పెట్టాలని ఆయన సూచించారు. అమ్మ చేతి ముద్ద ఎప్పుడూ అమృతమేనన్నారు. అలాగే మన సంప్రదాయ వంటలే మనకు బలమన్నారు. వ్యాయామం మనకి ఎంత ముఖ్యమో మన వంటలే తినడం అంతే ముఖ్యమని తెలిపారు. తాను ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనన్నారు. అలాగే పాక ఇడ్లీ యజమాని కృష్ణప్రసాద్‌ ‌మాట్లాడుతూ… నలభై యేళ్లుగా ఇక్కడ ఇడ్లీ సెంటర్‌ను నడుపుతున్నామని తెలిపారు.

మా నాన్న మల్లికార్జున రావు ఈ హోటల్‌ను స్థాపించారు. పాక ఇడ్లీగా ప్రసిద్ధి చెందడంతో ప్రముఖులు కూడా వస్తుంటారు. ఈరోజు వెంకయ్య నాయుడు తమ హోటల్‌లో టిఫిన్‌ ‌చేయడం ఆనందంగా ఉంది. హఠాత్తుగా రావడంతో మేము కూడా ఆశ్చర్య పోయామని పేర్కొన్నారు.

Leave a Reply