Take a fresh look at your lifestyle.

వేయిపడగల మేధావి – పీవీ పై పుస్తకం

సమీక్ష : – నందిరాజు
అడుగడుగునా ఎదురైన అత్యంత బలవంతులైన రాజకీయ శత్రువుల వ్యూహాలను నేర్పుగా ఛేదించి తన ప్రతిభ, జ్ఞానంతో దేశంలో అత్యున్నత అధికారాన్ని పొంది, దక్షిణాది నుంచీ, అందునా తెలుగునేల నుంచీ ప్రధాని అయి అయిదేళ్ళపాటు విభిన్న మతాలు, సంస్కృతులు, భావాలు కలిగిన నూరుకోట్ల ప్రజలను నిరాటంకంగా పాలించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు తెలంగాణ ముద్దు బిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు గురించి ఒక పుస్తకం రాయడం సామాన్య విషయం కాదు. అందులోనూ స్థిరంగా ఉండకుండా అరికాళ్ళలో చక్రాలతో రాష్ట్రం నాలుగు చెరగులా బదలీ అవుతూ, క్షణం తీరిక లేకుండా పలురంగాల విషయాల సేకరణలో రేయింబవళ్ళు శ్రమించే ఒక పాత్రికేయుడు పీవీ లాంటి మేధావి గురించి సమాచారం సేకరించి దానికిఒక పుస్తక రూపం ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. ఆ ఘనత సహచర పాత్రికేయుడు వెల్జాల చంద్రశేఖర్‌ ‌దక్కించుకున్నారు.

ఈ పుస్తక రచన క్రతువులో పీవీ తో పరిచయమున్న ఎందరినో కలుసుకుని, అనేకై కోణాలలో పరిశీలించి, అక్షర రూపం ఇచ్చారు. పీవీ బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ ప్రవేశం, నిజాం వ్యతిరేక పోరాటంలో కీల పాత్ర స్పృశించాలంటే ఎంతగా అధ్యయనం చేసారో అర్ధమౌతుంది. తమ ఇంటి పేరుగా ఒక ఊరి పేరు ఎందుకు వచ్చింది, తమ పూర్వీకులకు ఆ ఊరితో సంబంధం ఏమైనా ఉందా అనే అనుమానం పీవీ ని జీవితాంతం ఆలోచింపజేసిందట. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ విషయం గురించి ఆయన ఆరా తీసేవారట. పూర్వీకులు ఏనాడో పాములపర్తి నుంచీ కరీంనగర్‌ ‌జిల్లా వంగర వచ్చి స్థిరపడినట్లు నిర్ధారించుకున్నారట. మాటల్లో ఎవరైనా పాములపర్తి మాట అంటే, అది వింటే ఆయన ప్రాణం లేచి వచ్చేదట. ప్రధాని అయినా కూడా, పాములపర్తి గ్రామం చూడాలన్న కోరిక తీరకుండానే ఆయన తీరం దాటుకోవడం ఒక విశేషం.

‘‘‌వేయిపడగల మేధావి’’
(వెల రు.100/-)
చిరునామా: వెల్జాల చంద్రశేఖర్‌, ‌మొబైల్‌: 98499 98092
12-1-648/1, ‌మధురా నగర్‌ ‌కాలనీ, బండ్లగూడ, నాగోల్‌, ‌హైదరాబాద్‌ 500 068
ఆసక్తి గలవారు అన్ని ప్రముఖ బుక్‌ ‌స్టాల్స్ ‌లోనూ, నేరుగానూ రచయితను సంప్రదించవచ్చు.

ప్రధాని స్థాయికి ఎదిగిన ఆ వ్యక్తి ఎవరి నోటనైనా తెలంగాణ మట్టి భాష వింటే తన్మయత్వంతో పులకించి పోయేవారట.. తాను పుట్టిపెరిగిన చోట మాట్లాడుకునే భాషను తన మూలాలను మరచిపోకపోవడం పివి నిఖార్సయిన వ్యక్తిత్వానికి నిదర్శనం. అదే వ్యక్తి, 1983లో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్‌ ‌లో అనర్గళంగా మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫెడెల్‌ ‌కాస్ట్రోను సంభ్రమాశ్చర్యలో ముంచెత్తారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, రాజకీయ చాణక్యుడు, సంస్క రణలకు పీవీ ఆద్యుడు అయినందునే పుస్తకానికి ‘‘వేయిపడగల మేధావి’’ అని శీర్షిక నిర్ణయిం చినట్లున్నారు.

బాల్యం నుంచీ దివంగతు లయ్యేవరకు జీవితంలోని ప్రధాన ఘట్టాలను 31 అధ్యాయాలుగా రచయిత ప్రస్తావించారు. పీవీ కి ప్రజాకవి కాళోజీకి ఉన్న గాఢానుబంధాన్ని పద్మభూషణ్‌ ‌ప్రకటన సందర్భంలో గుర్తుచేసారు. పీవీ మామూలువారు కాదట, చరిత్ర మాటున ఒక విప్లవ కారుడట. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన అజ్ఞాతవాసం, పోరాట యోధులకు ఆయుధసరఫరా చేస్జిన వైనం, మహారాష్ట్ర చాందా క్యాంప్‌ ‌లో ఆయన శిక్షణ పొందడం వివరిస్తూ, మనకు తెలిసిన ఈ మౌన ముని వెనుక ఒక విప్లవకారూదు ఉన్నాడన్న సంగతి ఈ తరానికి తెలియని చరిత్ర మాటున దాగిన సత్యం అన్నారు రచయిత. పీవీ కి నాగపూర్‌ ‌విశ్వ విద్యాలయంలో సీటు ఇచ్చిన విషయంలో నాటి సెంట్రల్‌ ‌ప్రావిన్స్ ‌గవర్నర్‌ ‌కు వైస్‌ ‌చాన్సలర్‌ ‌కూ పెద్ద యుద్ధమే జరిగిందట.

పాత్రికేయుని నుంచీ పాలకుని వరకూ, కవి నుచీ కాంగ్రెస్‌ ‌కార్యకర్త వరకూ ఆయన రాజకీయ జీవితం అరంగేట్రం ఎలా జరిగిందో ఆసక్తిదాయకంగా వివరించారు చంద్రశేఖర్‌ ‌తన పాత్రికేయ ప్రతిభతో. కవిసమ్రాట్‌ ‌విశ్వనాథ వారి వేయి పడగలు నవలను హిందీలోకి అనువదించడం, అదే మాదిరి మరాఠి రచయిత హరి నారాయణ్‌ ఆప్టే రచన ‘‘పాన్‌ ‌లక్షన్‌ ‌కౌన్‌ ‌ఘెటో’’ ఒక మహా యజ్ఞంగా భావించారట ఆయన. అందుకే ఆ అనువాద ప్రక్రియలను యాదగిరి గుట్టపై ఉన్న పాత అతిథి గృహంలో పూర్తిచేసారట, ప్రతి శనివారం సాయంత్రం అక్కడికి వెళ్ళి సోమవారం ఉదయం వరకూ ఆ పనిలో నిమగ్న మయ్యేవారట. సాహిత్యప్రక్రియలో అధిక భాగం రాతకోతలన్నీ పీవీ యాదగిరి గుట్టపైనే పూర్తిచేసారట. అక్షర సేద్యం, రాజకీయ అభ్యాసంతో పాటు ముందునుంచీ ఆయనకు వ్యవసాయమంటే ప్రీతి ఎక్కువట. అప్పట్లో వంగరలో పసుపు, పత్తి, చెరకు పండించేవారట. మామిడితోట పెట్టించారట. శంషాబాద్‌ ‌వద్ద ద్రాక్షతోట కూడా ఉండేదట. మొక్క జొన్న కంకులంటే ఆయనకు బహు ఇష్టమట.

మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా.. అలంకరించిన ప్రతి పదవికి గొప్ప కీర్తిని సంపాదించిపెట్టిన అసమాన వ్యక్తిత్వం పీవీ దని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అభివర్ణిస్తూ తెలంగాణ ‘‘తేజం పీవీ’’ అంటారు. మహా వ్యక్తిత్వం మేధా సంపద కలిగిన చానక్యుడు పీవీ అని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ కమిటీ అధ్యక్షుడు డా. కె కేశవరావు ప్రస్తుతించారు. భూ సంస్కరణలు, విద్యా సంస్కరణలు, నూతన ఆర్ధిక విధానాలను రూపొందించి యావత్‌ ‌జాతి గమనాన్ని పురోగమన పంథాలో నడిపించిన దార్శనికత పీవీ సొత్తంటారు. (బాపు) పివీకి సంబంధించిన అలనాటి జ్ఞాపకాలు, ఆయన ప్రథాని పీఠం అలంకరించిన పరిణామక్రమం ఆయన ప్రత్యేక విశిష్ఠత అన్నారు పీవీ కుమార్తె సురభి వాణీ దేవి. ప్రతిభ కలిగి ఉండడం పీవీ ప్రత్య్హేక విశిష్టత. రాజకీయాల్లో లాబీయింగ్‌, ‌గాడ్‌ ‌ఫాదర్‌ ‌లేకుండా జిల్లా నుంచీ దిల్లీ వరకూ అంచెలంచెలుగా అదిగి అత్యున్నత ప్రధానమంగ్త్రి పదవి అధిష్టించిన వైనాన్ని ఆసక్తిదాయకంగా అందించారు.

జర్నలిస్ట్ ‌డెయిరీ శీర్షికతో ఫేస్‌ ‌బుక్‌ ‌లో రాస్తున్న వ్యాసాలకు మిత్రుల నుంచీ ప్రోత్సాహం లభించిన తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు ‘‘మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహి స్తున్నామని, ఈ సందర్భంగా రచయితలు, పాత్రికేయులు పీవీ పై వ్యాసాలు రాయవలసిందిగా పిలుపు నివ్వడంతో, పీవీ ప్రధానికాలంలో ఆంధ్రభూమి ప్రతినిధిగా జిల్లాల్లో పనిచేసిన అనుభవం, నాడు తాను రాసిన వార్తల సమాహారం చేసి, కొందరు ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన వ్యాసాలకు పుస్తకరూపం ఇచ్చానని మూడున్నర దశాబ్దాల అనుభవ పాత్రికేయులు వెల్జాల చంద్రశేఖర్‌ ‌పేర్కొన్నారు. పుస్తకరూపం రాకముందే వివిధ రంగాలకు చెందిన సుమారు అరవై మంది లబ్దప్రతిష్టుల మెచ్చుకోలు పొందారు. మరో విశేషమేమిటంటే వేయిపడగల మేధావి పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు స్వయంగా ఆవిష్కరించడం. రచయిత సామర్థ్యం తెలుసుకోవాలంటే పాఠకుడు పుస్తకం చదవాలి.

Leave a Reply