Take a fresh look at your lifestyle.

బహుముఖ ప్రజ్ఞాశాలి రెంటాల గోపాలకృష్ణ

(సెప్టెంబర్ 05 ఆయన శతజయంతి  పురస్కరించుకుని…)

రెంటాల .. ఆ పేరు వింటేనే.. ఒక కవి, విమర్శకుడు, జర్నలిస్టు, సాహితీవేత్త, అనువాదకుడు, సమీక్షకుడు గుర్తుకొస్తారు. ఆయన ఒక అధ్యయనశీలి. తెలుగు సాహిత్యంలో ప్రాచీన – అభ్యుదయ కవిత్వానికి వారధిగా పేరు పొందిన వారిలో ఆయన గుర్తొస్తారు. సమకాలీన, సామాజిక సమస్యలను ఎలుగెత్తి, సాహిత్యమే ఊపిరి చేసుకున్నారు. ఆయనే అందరికీ తెలిసిన రెంటాల గోపాలకృష్ణ. సెప్టెంబర్ 5, 1920న గుంటూరు జిల్లా, రెంటాల గ్రామంలో జన్మించారు. చిన్నప్పటినుంచే రెంటాలకు సాహిత్యమంటే ఎనలేని మక్కువ. పురాణాలను, శాస్త్రాలను అధ్యయనం చేశారు. పిన్న వయసులోనే “రాజ్యశ్రీ” చారిత్రక నవల రాసి, సాహితిలోక మన్ననలు అందుకున్నారు. తెలుగు వారందరికీ ‘సర్పయాగం’ అనగానే గుర్తొచ్చే కవి ఆయనే. పద్య రచనలు చేయడంలో చేయితిరిగినవారు. అంతా పెద్దలే, రజని, కర్ణభారం, మగువ మాంచాల, మాయా మబ్బులు, సంఘర్షణ, శిక్ష, విజయ ధ్వజం, రాణి రుద్రమదేవి మొదలైన రచనలు ఆయనవే. నరసరావుపేటలో కళాశాల విద్యార్ధిగా సాహితీ మిత్రుల సహకారంతో “నవ్య కళాపరిషత్” కవిత్వ సాహితీ చర్చా వేదిక ఏర్పాటు చేశారు. అప్పుడే బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, గంగినేని వెంకటేశ్వర్లులాంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది.

1943లో విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మార్క్సిజం అధ్యయనం చేసారు. శ్రీశ్రీ తో పరిచయమయ్యాక మారిన దృష్టికోణంతో వైవిధ్యమైన రచనలు చేసారు. ప్రముఖ కవులందరి కవితలను కూర్చి “కల్పన” సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఇందులో అభ్యుదయ భావాలున్న కవితలుండడంతో ప్రభుత్వ నిషేధానికి గురయింది. అభ్యుదయ కవితా ఉద్యమానికి మేనిఫెస్టో గా భావించే “నయాగరా” కావ్య రచనకు రెంటాల సహాయకుడిగావ్యవహరించారు. సాహిత్యం పట్ల ఆసక్తితో ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్నారు. దేశాభిమాని, నవ భారతి, ఆంధ్రప్రభ, పత్రికల్లో పనిచేశారు. “పంచ కళ్యాణి – దొంగల రాణి”, “కథానాయకురాలు” సినిమాలకు మాటలు, పాటలు ఈయనవే సినీ సమీక్షలు రాయడంలో పేరుపొందారు. అనువాద రచయితగా 40 సంవత్సరాలకు పైగా కృషి చేసి తనదైన శైలిలో ఒక స్థానం సంపాదించారు. సరళంగా అనువదించడంలో పలువురి ప్రశంసలు అందుకున్నారు. “ఇన్స్పెక్టర్ జనరల్”, ఇది అనువాద రచన అయినప్పటికీ తెలుగు నాటకంగా గుర్తింపు వచ్చింది. రష్యన్ రచయిత అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన “యమా ది పిట్”ను “యమాకూపం” పేరుతో అనువదించారు. వ్యభిచార గృహాల కూపంలో స్త్రీలు పడే బాధలను మాతృభాష రచనలాగానే అనువదించారు. నట్ హాంసన్ “హంగర్”ను ఆకలిగా, విక్టర్ హ్యూగో “ది కండెన్ముడు”ను “మృత్యుముఖంలో తుది రోజుగా” అనువదించారు. రష్యన్, ఆఫ్రికా, ఫ్రెంచి, జర్మనీ, ఇంగ్లీష్ సాహిత్యాన్ని రస గుళికలలా 50 గ్రంథాలకు పైగా తెలుగువారికోసం అనువదించారు రామాయణ, భారత, భాగవతాలను మూలాన్ని అనుసరించే అనువదించారు. బాల సాహిత్యానికి బాగా కృషి చేశాడరు. “తెలంగాణ సమర గీతం”లో నాజీ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు జరిపిన పోరాటంలో విముక్తి లభించాలని ఆకాంక్షిస్తూ గొప్పగా గీతం రాసారు.

“పగబట్టి త్రాచులా/ పసిగట్టి రేచులా/ చిటపట ధ్వనులతో/పటపటర్బాటులతో పగలలేయి నిజాం కోట/ ఎగరేయి ఎర్రబావుటా!….” అంటూ నిజాం ప్రభువుల ఆకృత్యాలను, అన్యాయాలకు ఎదురు తిరిగి పోరాడాలనే నినాదం ప్రజలలో ఎంతో స్ఫూర్తిని నింపింది. రెండో ప్రపంచ యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన హీరోషిమా, నాగసాకి నగరాలకు బాసటగా, ప్రపంచం తన వైపు చూసే కవిత్వంతో. “హీరోషిమా” కవితలో కన్నీళ్ళు కార్చాడు. Adae జపాన్ naeDu అనేక రంగాలలో దూసుకెళ్తుnnaది. శ్రీశ్రీ సైతం ఆయన కవిత్వానికి ముగ్ధుడై, అభినందింcaaru, భారత పర్యటనకు వచ్చిన జపాన్ శాంతి సంఘానికి రెంటాల కవితను “హీరోషిమా”కు ఆంగ్లానువాదం చేసి వినిపించారు. జపనీయులు సైతం రెంటాలను ప్రశంసలతో ముంచెత్తారు. రెంటాల తన జీవితాన్ని సాహితీ సేవకు అంకితంచేసారు.. ఆయన రచనలు వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు. బెంగళూరు విశ్వవిద్యాలయం “పల్నాటి వీరచరిత్రను” పలనాడ వీరచరిత్రగా అనువదించి బోధించడం విశేషం. 150 పైగా రచనలు చేసిన సాహితీకృషీవలుడు రెంటల అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. 1979లో ప్రసిద్ధ “ఆంధ్ర నాటక పరిషత్” అవార్డు, 1981లో నెల్లూరు “నాటక కళా పరిషత్” అవార్డు, 1995లో “క్రాంతి ఉత్తమ జర్నలిస్టు” అవార్డు లభించాయి. సాహితీ సేవలో అలుపెరుగని రీతిలో శ్రమించి జీవితంలో కన్నీళ్ళను, వేదన అనుభవించిన కవి రెంటాల సదా స్మరణీయుడు.

బి. మహేష్
పరిశోధక విద్యార్థి,
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం,
ఫోన్: 8985202723

Leave a Reply