Take a fresh look at your lifestyle.

ఏ ‌వెలుగులకీ ప్రస్థానం…

విను నాలోని ధ్వనులను
కొండ చర్యలు కూలుతున్నవి
లోపలి గదులు పొరలు కంపిస్తున్నవి
భీకర తుఫాను గాలులు ముంచెత్తుతున్నవి
లావా పొంగుతుంది
వేడి సెగలు జ్వాలలు
గుబురుగా  పొగలు
నాలో కిటికీలన్నీ తెరిచినప్పటినుంచే
ఒక్కొక్కటిగా ప్రవేశించాయి లోనికి
పేరుకుని మరిగి మరిగి నిండి
విస్పోటనం గాంచుతున్నాయి
వింటున్నావా…?
బతుకులు ప్రశ్నార్ధకమైన కాలాల నుండి
అస్తిత్వాన్ని అందలమెక్కించే నాటి వరకు
గుంపుగా ఉన్న స్థితి నుంచి
ముక్కలయ్యే పరిస్థితి వరకు
ఒక్కొక్కరుగా విడివడి
స్వతంత్ర రేఖలు ఏర్పడి
మూలం తాళం పడి
నామమాత్రం కదలాడి
ఎటూగాని ఓ వైఖరికొరవడిపోతున్నాం
పాకుతున్నాం పడున్నాం
ఏదీ నిఖార్సయినది కాదు
ఎక్కువ సమయం మనదు
మాట కాలు జారుతది పదేపదే
మనసు కొట్టుకుపోతది అదే పనిగా
బుద్ధి పచ్చలవుతది పరిపరి విధాల
ఇంకొన్నాళ్ళకు వినడానికి ఏమీ ఉండవు
కొన్ని కీచు శబ్దాలు తప్ప
వ్యర్థ వాదనలు తప్ప
పదునుగాంచని కళ్ళు
నిద్రపోయే దేహాలు
నిలకడ లేని తత్వం
ఏ చీకట్లకీ ప్రస్థానం…
ఏ ప్రమాదాలకీ సంసారం..!?

– రఘు వగ్గు

Leave a Reply