Take a fresh look at your lifestyle.

ఏం ‌కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు

  • కూర‘గాయాల’ దాటికి జనం విలవిల
  • పచ్చడి మెతుకులు.. పప్పుచారే దిక్కు

ఒక వైపు దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల మంటలు మండుతూనే ఉన్నాయి. లీటర్‌ ‌పెట్రోల్‌, ‌లీటర్‌ ‌డీజిల్‌ ‌ధరలు రూ.110 కి చేరువలో ఉన్నాయి. దీంతో సామాన్యుడికి తన బతుకుబండిని నడపడం భారంగా మారింది. అలాగే, వంట గ్యాస్‌ ‌బండ కూడా వంటగదిలో గుది బండగా మారింది. పుండుమీద కారం చల్లినట్టు ఇప్పటికే తలకు మించిన భారంతో బతుకుతున్న సామాన్యుడిపై కూరగాయల ధరలు కూడా ప్రతాపాన్ని చూపుతున్నాయి. దీంతో చాలీచాలని జీతంతో బతుకీడుస్తున్న సామాన్యుడి జీవితం మరింత దుర్భరంగా మారింది. ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు అనే సినిమా పాట ప్రస్తుత పరిస్థితులకు అద్ధం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్‌-‌డీజీల్‌ ‌ధరలు సామాన్యుడి నుంచి దూరంగా వెళ్తుంటే.. మరోవైపు దేశవ్యాప్తంగా కూరగాయ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. శీతాకాలంలో చలితో పాటు..కూరగాయల ధరలు పోటీ పడుతున్నాయి. కొన్ని వెజిటేబుల్స్ అయితే.. నాన్‌ ‌వేజ్‌తో పాటీ పడుతున్నాయి. ఇలా పలు రకాలైన కూరగాయల ధరలు ఆకాశాన్నంటతున్నాయి. ఇప్పటికే బీరకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయ, టమోటాల కిలో ధర సెంచరీకి దగ్గరలో ఉన్నాయి. ఇక ఆకుకూరల ధరలు కూడా అందుకోలేని స్థాయికి చేరుకున్నాయి.

కొత్తిమీర, పూదీన, మెంతితో పాటు.. ఇతర ఆకుకూరలు అయితే.. 10 రూపాయలకు ఒక్కటి కూడా రావడం లేదు. ఇక మునగ కాయలు అయితే కిలో 200, ఉల్లిగడ్డ కిలో 50 నుండి 70 వరకు ధర పలుకుతుంది. ఈ ధరలను చూసిన జనం బెంబేలెత్తి పోతున్నారు. రూ. 100 కు రెండు రకాల కూరగాయలు రాకపోవడంతో కొందామంటేనే వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. కొన్నా తక్కువ మోతాదులో కొని కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి ధరలే ఉండడంతో జనం ఏమి చేయలేకపోతున్నారు.

Vegetable prices are also booming on the common man

ఇలాంటి పరిస్థితుల్లో ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని జనం వాపోతున్నారు. పచ్చడి మెతుకులు..పప్పు చారుతోనే ఆహారాన్ని సరి పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలకు పలు రకాల కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడం, కాయ, పూత దెబ్బతినడం వల్ల ధరలు అమాంతంగా పెరిగి పోయాయి.

ఇక పెట్రో మంట కూడా ఒక కారణంగా నిలిచింది. పెట్రోల్‌ ‌ధరలు రోజు రోజుకు పెరిగి పోవడంతో ఆ ప్రభావం కూరగాయలపై పడింది. గ్రామాల్లోనుంచి పట్టణాలకు కూరగాయలను తీసుకొచ్చేందుకు భారీ వ్యయం అవుతుంది. దీంతో ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు పెరిగాయి. వాతావరణ పరిస్థితులకు తోడు పెట్రో ధరల ప్రభావంతో కూరగాయల రేట్లు రెట్టింపు అయ్యాయి. తప్పని పరిస్థితుల్లో ఛార్జీల భారాన్ని కూరగాయలపై వేయాల్సి వొస్తుందంటున్నారు అమ్మకం దారులు. పెరుగుతున్న కూరగాయల ధరలు వంటగది బడ్జెట్‌ను పెంచుతున్నాయని వినియోగదారులు అంటున్నారు.

Leave a Reply