వీబీ-జీ రాం జీపై దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి

– పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్‌ రామ‌చందర్‌ ‌

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర రథసారథి ఎన్.రామ‌చందర్‌ ‌రావు అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. గ్రామీణ నిరుపేదలకు ఉపాధి హామీతోపాటు జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ రాం జీ) చ‌ట్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని విమర్శించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. ఈ చట్టంపై అవాస్తవాలను వ్యాప్తి చేస్తూ ప్రజల్లో అపోహలు, అపార్థాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాల కుట్రలను పటాపంచలు చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల తప్పుడు ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, అవి అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేయాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అభ‌య్‌ పాటిల్, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తదితర పదాధికారులు పాల్గొన్నారు.

కవిత వ్యాఖ్యల ఆధారంగా చర్యలు తీసుకోవాలి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ స్థాపించే అంశం ఆమె వ్యక్తిగతమని రామ‌చందర్‌ ‌రావు తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టే స్వేచ్ఛ అందరికీ ఉంటుందన్నారు. హరీష్‌రావు, కేటీఆర్‌ల‌పై కవిత ఆరోపణల ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ సీఎం రేవంత్‌ ‌రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వడానికి కవిత సిద్ధంగా ఉన్నా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌మధ్య అంతర్గత ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ను కాపాడుతోంది.. సీఎం రేవంత్‌రెడ్డేనని బీజేపీ చీఫ్‌ ‌రాంచందర్‌ ‌రావు ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *