Take a fresh look at your lifestyle.

బాసరలో వసంతపంచమి ఉత్సవాలు

  • అక్షరాభ్యాసాలకు విస్తృతంగా ఏర్పాట్లు
  • అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంతపంచమి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆలయంలో జరిగే ప్రముఖ ఉత్సవాల్లో ఒక్కటైన ఈ ఉత్సవాలకు ఆలయాధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉత్సవాలు ప్రారంభం కాగా సోమ, మంగళవారాలు కూడా కొనసాగనున్నాయి. మంగళవారం వసంతపంచమి పర్వదినాన సరస్వతీ అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివొస్తారు. అమ్మవారి జయంతుత్సవంగా జరుపుకునే ఈ శుభ దినాల్లో తమ పిల్లలకు అక్షర శ్రీకారపూజలు జరిపించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. మంగళవారం అక్షాభ్యాసాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

ముఖ్యంగా ఏటా వసంత పంచమి నాడు భక్తుల రద్దీ పోటెత్తుతుంది. ఆ రోజు ఉదయం 3 గంటల నుంచి అక్షర శ్రీకారపూజలు జరిపించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆలయంలో మూడుచోట్ల మండపాలను సిద్ధం చేశారు. వీఐపీల వలన సాధారణ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వారికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయంతో పాటు మండపాలకు రంగురంగుల విద్యుత్‌ ‌దీపాలతో అందంగా అలంకరించారు. ఆలయానికి మూడు వైపులా పార్కింగ్‌ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ ‌సమస్యలు ఏర్పడుకుండా చర్యలు తీసుకున్నారు. దాదాపు 500ల మంది బందోబస్తులో వినియోగించేలా అధి కారులు సన్నాహాలు చేశారు. కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శనాలు, పూజలు జరిపించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వినోద్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. వసంతపంచమిని పురస్కరించుకుని బాసర సరస్వతీ ఆలయం భారీగా అక్షరాభ్యాసాలకు సిద్ధమైంది. ఏటా మాఘశుద్ధ పంచమి అమ్మవారి జన్మదిన వేడుకలకు ఆలయం ముస్తాబైంది.

వేదవ్యాసుడి సృష్టి అయిన బాసర ఆలయంలో వసంతపంచమి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. పరమ పవిత్రమైన ఈ రోజున అమ్మవారి సన్నిధిలో గడిపేందుకు, దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు అశేషసంఖ్యలో భక్తులు బాసరకు తరలి వస్తారు. దక్షిణ భారతవనిలో నెలకొని ఉన్న ఏకైక సరస్వతీ ఆలయంలో కావడంతో అక్షరాభ్యాసాలకు భారీగా చిన్నారులు తరలిరానున్నారు. అమ్మవారి జన్మదిన వేడుకలతో ఇప్పటికే బాసర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దీంతో బాసర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఏటా మాఘమాసంలో వొచ్చే శుద్ధపంచమిని వసంత పంచమిగా నిర్వహిస్తారు. ఈ రోజునే శ్రీపంచమి, మదన పంచమిగా కూడా వ్యవహరిస్తారు. వేకువజామున ఆలయాన్ని తెరుస్తారు.

మంగళవాయిద్యాలు, సుప్రభాత సేవతో అమ్మవారి జన్మదిన వేడుకలకు, పూజ కార్యక్రమాలకు అంకురార్పణ జరుగుతుంది. అనంతరం అమ్మవారికి అభిషేకం, అలంకరణ, నివేదన, మంగళహారతి నిర్వహిస్తారు. అభిషేక కార్యక్రమ అనంతరం అక్షరాభ్యాసాలు ప్రారంభమవుతాయి. రోజంతా ఆలయంలో కుంకుమార్చన పూజలు, చండీహవనం, వేదపారాయాణాలు జరుగుతాయి. వసంత పంచమి ఉత్సవంలో పాల్గొనేందుకు సోమవారం ఉదయం నుంచే భక్తులు బాసరకు తరలివొచ్చారు. ఇప్పటికే బాసరలోని ఆలయ వసతిగృహలు,  ప్రైవేట్‌ ‌లాడ్జ్‌లు ముందస్తు బుకింగ్‌లతో భక్తులకు ఆథిత్యం అందించేందుకు సిద్ధమయ్యాయి. ఉత్సవ నిర్వహణలో లోటుపాట్లు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేస్తున్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో అధికారులు అపశ్రుతులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు.

Leave a Reply