Take a fresh look at your lifestyle.

వరిని వరుణుడికి వదిలిన ప్రభుత్వాలు

ఒకవైపు వాతావరణ శాఖ రానున్న మూడురోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు పడుతాయని చెబుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న స్థబ్దత తొలగేదాకా కొనుగోళ్ళు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. అంతవరకు వరుణదేవుడిని నిరోధించడం ఎవరికి సాధ్యపడుతుంది..? వరి ధాన్యం కోసి, కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతుల గోడు చూస్తుంటే ఎవరికైనా కడుపు తరుక్కు పోతుంది. అలాంటిది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. వరి కొనుగోలు విషయంలో ఈ రెండు ప్రభుత్వాలు ఆసక్తిని కనబర్చకపోవడం చూస్తుంటే కూడబలుక్కుని ఆడుతున్న నాటకమా అన్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తమ వద్ద బియ్యపు నిల్వలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందుకు వరి పంటలను తగ్గించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు రైతులపై ఆంక్షలు పెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు.

దాంతో ఇలా స్థబ్దత వాతావరణాన్ని కలిగించడం ద్వారా రానున్న వేసంగి, ఆ తర్వాత వొచ్చే పంట కాలాల్లో పంట మార్పిడిని రైతులు బలవంతంగానైనా మార్పు చేస్తారన్న ఆలోచన ఉండి ఉండవచ్చన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఒకేసారి పంట మార్పిడిపై బలవంతం చేయకుండా క్రమేణ మార్పుకోసం ప్రయత్నాలు చేపట్టాల్సి ఉంటుంది. రాష్ట్రమంతా ఒకే తీరు భూములు ఉండవు. ఏ భూముల్లో ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుందన్న విషయాన్ని ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులతోగాని, సైంటిస్టులతోగాని రైతాంగానికి తెలియజేసింది లేదు. మార్పిడి పంటలకు తగిన విత్తనాలను, ఎరువులను, సాంకేతిక అంశాలను రైతులదరికి చేర్చింది లేదు. వొచ్చిన ఫలసాయాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న గ్యారెంటీ లేదు. మార్కెటింగ్‌ ‌సదుపాయం ఎలా ఉంటుందో తెలియదు. ఇవేవీ చేయకుండా ఉన్న పళంగా పంటమార్పిడి చేయమనగానే ఒక అంగీ విప్పి మరో అంగీ వేసుకున్నంత తేలికగా ఉంటుందనుకోవడం పొరపాటు.

ఆరేడు దశాబ్దాలుగా పండిస్తూ వొస్తున్న వరి ధాన్యం కొనుగోలు విషయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎవరికి వారు తమపై అపవాదు లేకుండా చూసుకోవడంతోనే సరిపోతున్నది. సంబంధిత కేంద్ర మంత్రి తాము ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ వరి ధాన్యాన్ని కొనేదేలేదని ప్రకటన ఇస్తాడు. రాష్ట్రానికి చెందిన మరో కేంద్ర మంత్రి మేము కొనమని ఎక్కడా చెప్పలేదంటాడు. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేపట్టడం లేదని బంతిని ఒకరి కోర్టు నుండి మరొకరి కోర్టులోకి విసురుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. తనపై పడిన నిందను తొలగించుకోవడానికి చివరికి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, కేంద్రాన్ని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించింది. అయినా కేంద్రం స్పందించిందిలేదు. దీంతో ఈ నెల 29న దిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తమ పార్టీ పరంగా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి తమ నిరసన తెలియజేయడానికి అధికార టిఆర్‌ఎస్‌ ‌సన్నద్ధం అవుతున్నది. ఆ విధంగానైనా కేంద్రంపై వత్తిడి తీసుకురావచ్చన్నది ఆ పార్టీ అభిప్రాయంగా తెలుస్తున్నది. ఇదిలా ఉంటే కేంద్రంతో అమీ తుమీ తేల్చుకునే వొస్తా అని దిల్లీ బయలుదేరి వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎలాంటి వార్తతో తిరిగి వొస్తారో తెలియదు. ప్రస్తుత వర్షాకాలపు పంటతోపాటు వొచ్చే వేసవి కాలపు పంట కొనుగోలు విషయాన్ని తేల్చుకునే వొస్తానని శపథం చేసి మరీ వెళ్ళిన మనిషి మూడు రోజుల పాటు అక్కడే మకాం వేస్తున్నాడు.

అయితే ఆయన ఇందుకోసమే వెళ్ళలేదని, సొంత పనులు చక్కబెట్టుకోవడానికే వెళ్ళాడన్న ప్రతిపక్షాల విమర్శ ఎలా ఉన్నా, మరి కొంతమంది మంత్రులు, ప్రతినిధి బృందంతో వెళ్ళడం ద్వారా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, కేంద్రం నుండి రావాల్సిన నిధులు, తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, విద్యుత్‌ ‌సవరణ బిల్లు, కాళేశ్వరానికి జాతీయ హోదా, తెగని కృష్ణా, గోదావరి జలాల వివాదం, తెలంగాణకు నష్టం కలిగించే రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి పలుఅంశాలను చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే గడచిన రెండు రోజుల్లో అందుకు సంబంధించిన మంత్రులు, అధికారులతో చర్చించినట్లు కూడా వార్తలు వొస్తున్నాయి. ఏది ఏమైనా అల్లుడు వొచ్చేవరకు అమావాస్య అగదన్నట్లు ఆయన దిల్లీ టూరు పూర్తి అయి వొచ్చేవరకు ఇక్కడ వరుణుడు రాకుండా ఉంటానని చెప్పడు కదా! ఇప్పటికే యాదాద్రి, మెదక్‌, ‌ములుగు, వరంగల్‌, ‌హనుమకొండ ప్రాంతాలకు చెందిన రైతాంగం తడిసిన ధాన్యాన్ని చూసి గోడున ఏడుస్తున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరులో ఒక మహిళ తాను కౌలుకు తీసుకుని పండించిన అయిదు ట్రాక్టర్ల ధాన్యమంతా మొలకలు వొచ్చాయని బోరు మంటున్నది. అలాంటి సంఘటనలు అనేకం అనేక ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. రోజూ ఆకాశం వైపు చూడడం, ఆర బోయటం, తిరిగి కుప్పచేసి పరదాలు కప్పడం. గత నెల రోజులుగా రైతుకు ఇదేపని సరిపోతున్నది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలకు పోకుండా, రైతుల పంటలను సత్వరమే కొనుగోలు చేసి, వారు మరింత నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply