Take a fresh look at your lifestyle.

వరవరరావు ఆరోగ్యం గురించి .. పారదర్శక, అధికారిక సమాచారం ఇవ్వండి..! కుటుంబ సభ్యుల డిమాండ్‌

‌వరవరరావు ఆందోళనాకరమైన ఆరోగ్య స్థితి గురించి, ప్రత్యేకంగా నిన్న నానావతి ఆస్పత్రిలో చేర్చే సమయానికి ఆయన తలపై ఉన్న గాయం గురించి ప్రచార మాధ్యమాల్లో హోరెత్తుతుండగా అధికారికంగా కుటుంబానికి ఎటువంటి సమాచారం లేదఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయవిచారణ క్రమంలో నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఆరోగ్యస్థితి గురించి కుటుంబానికి తెలియజేయకపోవడం చట్టవ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, అమానుషం అని ప్రకటనలో పేర్కొన్నారు . వరవర రావు భార్య పి . హేమలత , కూతుళ్లు పి సహజ, పి అనల, పి పవన ల పేరున వెలువడిన ప్రకటనలో ..‘గత వారం రోజులలో ఆయనను తలోజా జైలు నుంచి జెజె ఆస్పత్రికి, సేంట్‌ ‌జార్జి ఆస్పత్రికి, నానావతి ఆస్పత్రికి తరలించగా, కుటుంబానికి అందిన అధికారిక సమాచారం ఆయనకు కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌ఫలితం వచ్చిందని మాత్రమే. మిగిలిన సమాచారమంతా ఇతర మార్గాల ద్వారా తెలిసిందే. కోవిడ్‌ ‌విషయం కూడ ఆయనను జెజె ఆస్పత్రి నుంచి సేంట్‌ ‌జార్జి ఆస్పత్రికి తరలించారని తెలిసి, నిర్ధారణ కోసం ఫోన్‌ ‌చేయగా జైలు అధికారులు నిర్ధారించారు. ఇక గత రెండు రోజులుగా నానావతి ఆస్పత్రికి తరలించడం, ఆయన ఆరోగ్య స్థితి మరింత క్షీణించడం, నానావతి ఆస్పత్రిలో వైద్యులు ఆయన తలకు గాయమైందని, కుట్లు పడ్డాయని గుర్తించడం వంటి వార్తలన్నీ కూడ కుటుంబానికి పత్రికా మిత్రుల ద్వారా, పౌర సమాజ కార్యకర్తల ద్వారా తెలిసినవే. అధికారికమైన, పారదర్శకమైన సమాచారం లేని సమయంలో ఊహాగానాలు, వదంతులు, అర్ధసత్యాలు వ్యాపిస్తూ కుటుంబానికి, మిత్రులకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

జెజె ఆస్పత్రిలోనో, సేంట్‌ ‌జార్జి ఆస్పత్రిలోనో ఆయన తలకు గాయమై, కుట్లుపడ్డాయని నానావతికి తీసుకువచ్చినప్పుడు గుర్తించారని ఇవాళ వచ్చిన వార్త మమ్మల్ని తీవ్రంగా దిగ్భ్రాంతి పరుస్తున్నది. ఆయన క్షేమం గురించీ, ఆరోగ్యం గురించీ మా ఆందోళనను పెంచుతున్నది. ఆయన ఆరోగ్య స్థితి గురించి, చేస్తున్న చికిత్సాసరళి గురించి, రానున్న ప్రమాదాల గురించి అధికారిక పారదర్శక సమాచారం అందుకోవడం కుటుంబానికి ఉన్న హక్కు. కాని సంబంధిత పోలీసు, జైలు, ఆస్పత్రి అధికారులు తమ బాధ్యతా నిర్వహణను ఘోరంగా ఉల్లంఘిస్తూ, కుటుంబానికి అత్యవసరంగా తెలియజేయవలసిన సమాచారాన్ని తెలియజేయడం లేదు. ఇది కుటుంబానికి ఉన్న సమాచార హక్కుకు తీవ్రమైన విఘాతం మాత్రమే కాదు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల, సంస్థల దారుణమైన బాధ్యతారహిత ప్రవర్తన కూడ. ఈ పరిస్థితిలో మేము మహారాష్ట్ర ప్రభుత్వంపై ఈ కింది డిమాండ్లు పెడుతున్నాము.

1. వరవరరావు తనంతట తాను ఏ పనీ చేసుకోలేని స్థితిలో ఉన్నారు గనుక ఆయనకు సహకరించడానికి, తోడు ఉండడానికి కుటుంబ సభ్యులను ఒకరిని అనుమతించాలి.
2. వరవరరావు ఆరోగ్య స్థితి గురించి, చికిత్సా సరళి గురించి రోజుకు ఒకసారో, రెండు సార్లో తాజా సమాచారాన్ని పారదర్శకంగా అధికారికంగా అందజేయమని జైలు అధికారులను, ఆస్పత్రి అధికారులను తక్షణమే ఆదేశించాలి.
3. కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకోవడానికి వీలుగా ఆస్పత్రిలో ఎవరిని సంప్రదించాలో స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.
4. ఆయనకు జరుగుతున్న చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికలన్నీ కుటుంబానికి అందుబాటులో ఉంచాలి.
5. ఆయనకు సాధారణ బెయిల్‌ ‌గాని, వయసు, ఆరోగ్యం, కొవిడ్‌ ‌కారణాల మీద మధ్యంతర బెయిల్‌ ‌గాని ఇవ్వడానికి వీలుగా న్యాయప్రక్రియలో అడ్డంకులన్నీ తొలగించాలి…అని పేర్కొన్నారు.

Leave a Reply