Take a fresh look at your lifestyle.

ముందస్తుగా హెచ్చరించినా పట్టించుకోలేదు

నవీ ముంబాయిలోని తలోజా జైలులో కొరోనా ప్రబలుతుండడంతో అదే జైల్‌లో ఉన్న విప్లవ రచయితల సంఘం(విరసం) నేత పెండ్యాల వరవరరావు ఆరోగ్యం విషయమై ఆయన కుటుంబ సభ్యులు ముందస్తుగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడాయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎనభై ఏళ్ళ వయస్సులో ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్న వరవరరావు(వివి) పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడడానికి జైల్‌ అధికారులు ఇచ్చే కొద్ది నిమిషాల సమయంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న విషయం అర్థమై కనీసం మంచి హాస్పిటల్‌లోనైనా చేర్చండని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని అధికారులిప్పుడు ఆయనకు కొరోనా సోకిన తర్వాతగాని చికిత్సకోసం హాస్పిటల్‌కి తరలించలేదు. ఇరవై మూడు నెలలుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వివి చాలాకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు చెబుతూనే ఉన్నారు. మే నెలలో ఒకసారి జెజే హాస్పిటల్‌లో చేర్చినప్పటికీ చికిత్స పూర్తికాకుండానే ఆయన్ను తిరిగి జైలుకు తరలించినప్పటి నుండి ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. తమతో మాట్లాడిన ప్రతీసారి ఆయన మాటల్లో చాలా తేడా కనిపిస్తున్నదని, ఎప్పుడో చిన్ననాటి విషయాలను కలవరిస్తున్నట్లుగా ఆయన మాటలధోరణి ఉండడాన్ని గమనించిన కుటుంబసభ్యులు మహారాష్ట్ర అధికారులు, నాయకులతోపాటు తెలంగాణలో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి తెలంగాణ నాయకులకు, మహారాష్ట్ర నాయకులకు విజ్ఞప్తులుచేసినా పట్టించుకోలేదు సరికదా, కనీసం చికిత్సకోసం ఓ మంచి హాస్పిటల్‌లోనైనా చేర్పించడంలేదని మీడియా ముఖంగా వారు తమ బాధను వ్యక్తం చేశారు కూడా. నాటి నుండి బెయిల్‌కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయని, పైకోర్టుల్లో బెయిల్‌కోసం వేళితే కింది కోర్టు నుంచి రావాలంటారు.

కిందికోర్టు రిజక్టుచేస్తే కదా పైకోర్టుకు వెళ్ళేది. ఇలా నెలల తరబడి సాగతీత కొనసాగుతూ, విచారణ ముందుకు సాగకుండా పోతోందని ఆయన భార్య హేమలతతో పాటుగా ఆయన ముగ్గురు కూతుళ్ళు వేడుకున్నా లాభం లేకుండా పోయింది. వివి ప్రాణాలను కాపాడాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్‌ ‌ప్రోఫెసర్‌ ‌హరగోపాల్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతలు పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్కలు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆలాగే ఆయన విడుదల కోరుతూ మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూ వామపక్ష పార్టీలు లేఖలు కూడా రాశాయి. కనీసం ఆయన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించాలని ప్రజాసంఘాల నేతలు పలువురు తమ లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆయన్ను జైల్‌లోనే చంపే ప్రయత్నం చేయవద్దని పలువురు కవులు, రచయితలు, మేథావులు, మానవ హక్కుల కార్యకర్తలు కూడా కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినా చివరకు ఆయనకు కొరోనా సోకేవరకు ప్రభుత్వంగాని, జైల్‌ అధికారులుగాని ఈ విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంపట్ల ఆయన సన్నిహితులు, బంధువర్గం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైన వివిని జైల్‌ ‌సిబ్బంది జేజే హాస్పిటల్‌కి తరలించింది. ఆయనకు చేసిన పరీక్షల్లో కొరోనా పాజిటివ్‌ ‌రావడంతో గురువారం ముంబాయిలోని సెయింట్‌ ‌జార్జి హాస్పటల్‌కు మార్చి, ఆయన కుటుంబసభ్యులకు సమాచారాన్ని అందించారు జైల్‌ అధికారులు. హుటాహుటిన ముంబై చేరుకున్న కుటుంబసభ్యులకు ఆయనున్న పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా కనిపిస్తున్నట్లు సమాచారం. భీమా కోరేగామ్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వివితో పాటుగా మరో నలుగురిని 2018 ఆగస్టు 28న అరెస్టు చేశారు. సుప్రీమ్‌కోర్టు ఆదేశాలతో వీరిని కొంతకాలం గృహనిర్బంధంలో ఉంచి, తర్వాత జైలుకు తరలించారు. వివిని ముందుగా పూణెలోని ఎరవాడ జైలులో ఆ తర్వాత ముంబాయిలోని తలోజా జైలులో నిర్బంధించారు. 1973లో మొదటిసారిగా నిర్బంధించబడిన వివి ఆతర్వాత అనేక కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పలుసార్లు జైలు జీవితాన్ని చవిచూడాల్సి వచ్చింది. కాగా ప్రస్తుతం ఇరవై మూడు నెలలుగా జైల్‌ ‌జీవితాన్ని అనుభవిస్తున్న వివి తన ఆరోగ్య సమస్యలపై బెయిల్‌కోసం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.

Leave a Reply