Take a fresh look at your lifestyle.

‌వైస్‌చాన్సిలర్లు లేక విశ్వవిద్యాలయాల విలవిలలు

కుటుంబ పెద్ద లేని సందర్భంలో గృహంలో క్రమశిక్షణ లోపుస్తుంది. నాయకుడు స్థానం ఖాళీ అయితే ప్రజల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అత్యున్నత అధికారి నియమించబడని సందర్భంలో ఇంచార్జ్ అధికారి చేతిలో అధికారం పడితే కార్యదక్షత, వినూత్న క్రియాశీలత, చోరవ తీసుకోవడం, వ్యవస్థలో సమయానుకూల సవరణలు, అభివృద్ధి దిశగా పయనాలు మరియు ఉత్తమ ఫలితాల సాధనలు అందని ద్రాక్షలే అవుతున్నాయని మన అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు రెగులర్‌ ఉపకులపతులు లేదా వైస్‌చాన్సిలర్స్ (‌విసి) కొన్ని ఏండ్లుగా నియమించని కారణంగా అనాథ ఉన్నత విద్యా కేంద్రాలుగా మారిపోయాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చోరవ తీసుకొని అన్ని విశ్వవిద్యాలయాలకు రెగులర్‌ ‌విసిలను నియమించాలని, లేనియెడల ఉన్నత విద్య కుంటుబడి భవిష్యత్‌ ‌తరాలను నిర్మించడంలో విఫలం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘విశ్వ స్థాయి’ లేదా ‘అంతర్జాతీయ స్థాయి’ ఉన్నత విద్యను అందించాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్ర స్థాయి విద్యను కూడా అందించలేక పోతున్నాయి. నేటి డిజిటల్‌ ‌యుగంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడవలసిన విద్యార్థులను నిర్మించవలసిన ప్రస్తుత తెలంగాణ యూనివర్సిటీలు అనేక సమస్యలతో సతమతమవుతూ పతనదిశలో పయనిస్తున్నాయి. బోధన, శోధన మరియు శిక్షణలు అందించాల్సిన ఉన్నత విద్యా క్షేత్రాలు ఆదరణ లేక బిక్కుబిక్కుమంటున్నాయి.

నేటి విశ్వవిద్యాలయాలు అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది కొరత మాత్రమే కాకుండా ప్రయోగశాల వసతుల లేమి మరియు నిధుల కొరతతో విలవిలలాడుతున్నాయి. నేటి విశ్వవిద్యాలయ విద్యార్థులే భవిష్యత్‌ ‌రాజకీయ నాయకులు, అధ్యాపకులు/ఉపాధ్యాయులు, అధికారులు, ఉద్యోగులు, సమాజపు నిర్ధేశకులు, బాధ్యతగల పౌరులు మరియు వృత్తి విద్య నిపుణులు అవుతారని నమ్మాలి.

భారతదేశంలో ఉన్న దాదాపు 1000 యునివర్సిటీల్లో 54 కేంద్ర విశ్వవిద్యాలయాలు,  416 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 125 డీమ్డ్ ‌యూనివర్సిటీలు మరియు 361 ప్రైవేట్‌ ‌విశ్వవిద్యాలయాలు, 159 జాతీయ విద్యా సంస్థలు, 07 రాష్ట్ర విద్యాసంస్థలు నేడు తమ సేవలను 37.4 మిలియన్ల విద్యార్థులకు విస్తరించాయి. మన దేశంలో ఉన్నత విద్య గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ‌రేషియో (జిఆర్‌ఈ) 26.3 ‌శాతంగా నమోదవుతున్నది. తెలంగాణలో 24 కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో పాటు పలు డీమ్డ్ ‌మరియు ప్రైవేట్‌ ‌విశ్వవిద్యాలయాల నియంత్రణలో దాదాపు 1500 కళాశాలలు విద్యార్థులకు ఉన్నత విద్య అందుతున్నది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉస్మానియా, కాకతీయ, జెయన్‌టియూ-హెచ్‌, ‌తెలంగాణ, పారమూరు, మహాత్మాగాంధీ, పియస్‌ ‌తెలుగు, డా:బిఆర్‌ అం‌బేడ్కర్‌ ఓపెన్‌, ‌బాస్ర రాజీవ్‌గాంధీ నాలెడ్జ్ ‌మరియు శాతవాహన యూనివర్సిటీల్లో గత కొన్ని సంవత్సరాలుగా రెగులర్‌ ‌విసిలు నియమించని కారణంగా ఇంచార్జి ఐఏఒయస్‌ అధికారుల పాలనలో నిస్సహాయ విద్యాలయాలుగా సమస్యల విషవలయాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కరీంనగర్‌ ‌శాతవాహన (ఏప్రిల్‌-2015 ‌నుంచి) మరియు బాసర ఆర్‌జియుకెటి (జనవరి-2015 నుంచి) విశ్వవిద్యాలయాలకు గత 6 సంవత్సరాలుగా రెగులర్‌ ఉపకులపతులు లేకుండా ఇంచార్జిల పాలనలో నత్త నడక నడుస్తున్నాయి. ఒక విసి పదవి కాలం 3 సంవత్సరాలు ఉంటుందని మనకు తెలుసు. ఈ విశ్వవిద్యాలయాలు ఇద్దరు రెగులర్‌ ‌విసిల పదవీ కాలాన్ని ఇంచార్జీలతో సరిపెట్టుకోవలసి వస్తున్నది. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, డా:బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు జూలై-2019 నుంచి మరియు మహాత్మాగాంధీ యూనివర్సిటీకి జూన్‌-2019 ‌నుంచి రెగులర్‌ ‌విసిలు నియమించబడలేదు.

రాష్ట్ర ప్రభుత్వం ఇంచార్జీ విసిలుగా ఐఏయస్‌ అధికారులను నియమించి చేతులు దులుపుకుంది. ఐఏయస్‌ అధికారులకు మాతృశాఖలోనే అపార పని ఒత్తిడి ఉంటుంది. వీరు పక్షం, నెల రోజులకు ఒకసారి కూడా యూనివర్సిటీని దర్శించే సమయం కూడా దొరకడం లేదు. విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను లోతుగా విశ్లేషించి, సంచలన వాంఛనీయ నిర్ణయాలు తీసుకునే తీరిక మరియు చొరవ ఉండదు. సాధారణ ‘బెల్‌ అం‌డ్‌ ‌బిల్‌’ ‌సూత్రానికి కట్టుబడి, సమస్యల పరిష్కారాలను మరియు నవ్య ఆలోచనలను వాయిదా వేసేందుకే ఇష్ట పడతారు. ‘విశ్వస్థాయి’ విద్యాలయాలుగా రాణించాల్సిన మన యునివర్సిటీలు స్థానిక సమస్యలను కూడా అధిగమించే కృషి చేయకపోవడం విచారకరం. బోధన కుంటుబడటమే కాకుండా పరిశోధనలకు మంగళం పాడడం విశ్వవిద్యాలయాల నాణ్యతకు మరకలుగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు, వైజ్ఞానిక సదస్సులు, ఆధునికతను జోడించి రూపొందించాల్సిన సిలబస్‌ ‌రూపకల్పనలు, పరీక్షల నిర్వహణ, అనుబంధ కళాశాలల పర్యవేక్షణలు, అధ్యాపకులు పరిశోధనల నిమిత్తం గైడ్‌లుగా వ్యవహరించడం లాంటి ప్రత్యేకతలు ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో అనేక లోటుపాట్లు మరియు వనరుల కొరతలు రాజ్యమేలుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు విసిల నియామకాలు చేపట్టామని, త్వరలో నియమిస్తామని ప్రకటించిన ప్రతిసారి అవాంతరాలు వస్తున్నాయి.

రేపటి సమాజపు పలురంగాల్లో నాయకత్వం వహించాల్సిన నేటి విశ్వవిద్యాలయ విద్యార్థులకు సరైనా బోధన మరియు మార్గదర్శనం లభించని యేడల సామాజిక క్రమశిక్షణ లోపించి, రేపటి అశాంతికి కారణం అవుతాయి. నేడు విద్యపై పెట్టే పెట్టుబడి, రేపటి శాంతియుత సహజీవనానికి మరియు సమగ్రాభివృద్ధికి ఊతం ఇస్తుంది. విద్య ఎప్పుడూ ప్రభుత్వానికి భారం కాదని, రేపటి తరం వ్యక్తిత్వవికాసమని నమ్మాలి. తల్లితండ్రులుగా పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం. ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర యువతను తమ కుటుంబ సభ్యులుగా భావించి, వారికి ఉచిత ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను అందించే కనీస బాధ్యత తీసుకోవాలి. నేటి అశ్రద్ధ రేపటి యువత అశాంతికి కారణం కారాదు. యువతకు అవసరమైన విద్య, వ్యక్తిత్వం, నైపుణ్యాలు అందించే విశ్వవిద్యాలయ ప్రాంగణాలు సరస్వతి క్షేత్రాలే కాదు, మేధో సంపత్తి కేంద్రాలు కావాలని కోరుకుందాం. త్వరలో అన్ని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకాలు చేపట్టి, రాజకీయాలకు దూరంగా ప్రతిభకు దగ్గరగా అత్యున్నత అర్హతగల వారి సేవలను తీసుకోవాలని ఆశిద్దాం.

 

Leave a Reply