- జూన్ రెండో వారంలో ఫలితాలు వెల్లడిస్తాం
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను జూన్ రెండో వారంలో వెల్లడించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇందుకు సబంధించి ప్రశ్నాపత్రాల మూల్యాంకనను ఈనెల 12 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈమేరకు పదో తరగతి పరీక్షలు, ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనంపై ఆమె గురువారం ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారనీ, దాదాపు 53 లక్షల 991 జవాబు పత్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మొదట్లో ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనకు 12 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించామనీ, మే నెల చివరి వారం వరకూ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తవుతుందని చెప్పారు. అయితే కొరోనా వైరస్ కారణంగా వాటిని ప్రస్తుతం 33కు పెంచినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల మూల్యాంకనానికి సంబంధించి కోడింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైందనీ, అలాగే, వాయిదాపడిన ఇంటర్ మోడ్రన్ లాంగ్వేజెస్, జాగ్రఫీ పరీక్షలను ఈనెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొరోనా వైరస్ కారణంగా నిలిపివేసిన పదో తరగతి పరీక్షలను హైకోర్టు అనుమతిస్తే అన్ని జాగ్రత్తలతో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పరీక్షల సమయంలో విద్యార్థులందరికీ మాస్కులు, శానిటైజర్లు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. కొరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేశామన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయంపై కసరత్తు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను సైతం పరిగణనలోనికి తీసుకుంటామని చెప్పారు. లాక్‌డౌన్ అనంతరం మొత్తం పరిస్థితిపై సమీక్షించి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే, 1 నుంచి 9 వ తరగతి వరకు విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేశామనీ, అలాగే, వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి సబిత వెల్లడించారు.