Take a fresh look at your lifestyle.

టిటిడిలో ప్రత్యేక ఆహ్వానితులకు చెల్లుచీటి

  • జీవో చెల్లదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • ఆహ్వానితుల జివోపై తాత్కాలిక స్టే విధిస్తూ ఆదేశాలు

అమరావతి,సెప్టెంబర్‌ 22 : ‌తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి బ్రేక పడింది. ప్రత్యేక  సభ్యులను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల  ప్రభుత్వం టిటిడి బోర్డు సభ్యులతో పాటు భారీగా ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జీవో జారీ చేసింది. పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్‌ ‌చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.

నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సభ్యులను నియమించారని.. దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్లు అందులో పేర్కొన్నారు. టిటిడి స్వతంత్రతను దెబ్బతీసేలా జీవోలు ఉన్నాయని పిటిషనర్‌ ‌తరఫున న్యాయవాదులు వాదించారు. నిబంధనలనకు అనుగుణంగానే నియమకాలను చేపట్టినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ బోర్డులో సభ్యుల నియామకాన్ని సవాల్‌ ‌చేస్తూ బీజేపీ నేత భానూప్రకాశ్‌ ‌రెడ్డి, జనశక్తి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ‌వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్‌ ‌కుమార్‌, ‌టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు సహా పలువురు పిటిషన్లను దాఖలు చేశారు.

నిబంధనలను తోసిరాజని సభ్యులను నియమించారని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. దాని వల్ల సామాన్య భక్తులపై పెనుభారం పడుతుందని వాదించారు. పిటిషనర్ల వాదనలను విన్న కోర్టు.. ప్రభుత్వ ఉత్తర్వులపై సీరియస్‌ అయింది.

నాలుగు వారాల్లో కౌంటర్‌ ‌దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. కాగా, ఇటీవల ఏపీ ప్రభుత్వం టీటీడీ బోర్డులో 25 మంది సభ్యులను నియమించింది. వారితో పాటు మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. అందులో కొందరు ప్రమాణం కూడా చేశారు. అయితే, వివిధ కేసుల్లో ఉన్న వారినీ పవిత్రమైన బోర్డులో నియమించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ నియామకాలను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి సిఫార్సు చేశారంటూ ఒక సభ్యుడి నియామకంపై ఓ లేఖ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాను ఎవరినీ సిఫార్సు చేయలేదని తర్వాత కిషన్‌ ‌రెడ్డి వివరణ ఇచ్చారు.

Leave a Reply