Take a fresh look at your lifestyle.

వలస కార్మికుల బాధలు తీరని యతలు

చెప్పుల్లేక పసిపిల్లల పాదాలు రక్తాలను చిందిస్తున్నాయి,సంకలో పిల్లలు కడుపులో ఆకలితో వందల కిలోమీటర్ల దూరం రాత్రనక పగలనక నడకతో నరకయాతనతో బాధపడుతున్న వైనం మన కండ్లకు కనిపిస్తుంది.
నిండు గర్భిణీ లు కూడా వందల కిలోమీటర్లు కాలినడకను ప్రారంభించారు, నెత్తిన మూటలు,కడుపులో ఆకలిమంటలు,పాదాలు బొబ్బలెక్కి కండ్లనిండా కనిపించని దుఃఖంతో కన్నమ్మ కష్టాలు పడుతూ సొంత ఊర్లకు పయనమయ్యారు.

స్వాతంత్య్రం సిద్దించి డెబ్బై ఐదు వసంతాల అనంతరం కూడా దేశం గురించి ఇలా రాసుకోవడం ప్రతీ భారతీయుడు చింతించాల్సిన దుర్గతే.స్వాతంత్య్ర అనంతరం కాందిశీకులు భారతదేశం వైపు నడకలు కొనసాగించినప్పుడు ఎందరో అభాగ్యులు ఆకలితో ఇంకా అనేక అవస్థలతో నేలరాలిపోయిన స్వాతంత్య్రం వచ్చిందనే సంతోషంలో ఏ పాలకుడు ఏ పౌరుడు పట్టించుకోలేదనడం ఒక వాస్తవిక అంతర్గత రహస్యం.
స్వరాజ్యం సిద్దించిన ఇన్ని యాడాదులకు కూడా కరోనా నేపథ్యంలో మరొక్కసారి అంతకుమించిన వలసకార్మికుల పాదయాత్రలు చూడటం పాలకులు నోరు మెదపకపోవడం పాలకుల దమననీతికి నిలువుటద్దం పడుతుంది.

కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసలు రావడానికి అనేక కారణాలు ముడిపడివుంటాయి. నిరుద్యోగం,పాలకుల అవగాహన లోపం,ఉపాధి కొరత, నిరక్షరాస్యత, సహజ వనరుల కొరత, నిస్సారమైన నేలలు, అనుకూలించని వాతావరణం, మూలధన కొరత ఇలా ఎన్నో కారణాలు వలసలను ప్రేరేపిస్తాయి.
వలస కార్మికులు బత్కినన్ని దినాలు కడుపు నిండగా తిని కనుమూయాలనే తపన ఒకటే వారిని వేల కిలోమీటర్ల వలసలకు కారణ భూతమైంది.ఒకప్పుడు వలసలు అంటే పాలమూరు మాత్రమే దేశపటంలో తొంగిచూశారు కానీ నేడు అలాలేదు నలుమూలల నుండి వలసల వరదలు అన్నీచోట్లకు విస్తరించాయనే దృశ్యం మనకండ్లకు కనిపిస్తున్న చిత్రం.
కార్మికులు ఉన్న ఊర్లను కన్నవారిని చుట్టూ పెనవేసుకున్న బంధుత్వాలను ఓ గాటనకట్టేసి వలవలమంటూ దుఃఖపు నదిలామారి వలసబాట పడ్తారు.కలో గంజోతాగి గుడిసెనో గూడో కట్టుకొని మంచమున్నకాడిని కాళ్ళుసాపి బత్కి ఉన్నకాడికి మర్యాదగా జీవించాలనే ఆశనే వారిని వేలకిలోమీటర్ల దూరం పయనింపచేస్తుంది.

కరోనాకు ముందు పాలక ప్రభుత్వాలు కనీస అవగాహన కరువై ఆకస్మికంగా లాక్డౌన్‌ ‌ప్రకటించడం ఒక ముర్ఖత్వపు ఆలోచనే.ఒక వారం రోజులు సమయం కేటాయించి ఫలానా రోజులు లాక్డౌన్‌ ఉం‌టుందనీ ఎవరి సొంత ఊర్లకు వారిని పంపించి ఆ తర్వాత కటిన నిర్ణయాలు తీసుకునే బాధ్యత మూమ్మాటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే.
కొన్నిరోజులపాటు నిర్మానుష్యంగా మారిన రహదారులు నేడు జాతరను తలపిస్తున్నాయి.
చెప్పుల్లేక పసిపిల్లల పాదాలు రక్తాలను చిందిస్తున్నాయి,సంకలో పిల్లలు కడుపులో ఆకలితో వందల కిలోమీటర్ల దూరం రాత్రనక పగలనక నడకతో నరకయాతనతో బాధపడుతున్న వైనం మన కండ్లకు కనిపిస్తుంది.

నిండు గర్భిణీ లు కూడా వందల కిలోమీటర్లు కాలినడకను ప్రారంభించారు, నెత్తిన మూటలు,కడుపులో ఆకలిమంటలు,పాదాలు బొబ్బలెక్కి కండ్లనిండా కనిపించని దుఃఖంతో కన్నమ్మ కష్టాలు పడుతూ సొంత ఊర్లకు పయనమయ్యారు.
ఇలాంటి విపత్కర సమయంలో పాలకులు విదేశాలలో సంపన్నులను
వందే భారత్‌ ‌మిషన్‌ ‌పేరిట విమానాలు కేటాయించి ఇతర దేశాల నుండి రప్పించి రాచమర్యాదలు చేస్తుంటే పేద కార్మికులకు కనీసం లారీలో బస్సులనో కేటాయించకుండా అత్యంత దయనీయంగా వదిలేసిన పాలకుల దాష్ఠీకాలు కనిపిస్తున్నాయి.
వలస కార్మికులకు కేవలం స్థానికంగా ఓట్లు ఉండవనే నెపంతోనే వారిని ఏ పాలకుడు పట్టించుకోవడం లేదు అదే ఎన్నికల సమయంలో ఓటర్‌ ఎక్కడున్న వాహనాల కేటాయించి చేతిలో డబ్బుపెట్టి కంటికి రెప్పలా కాపాడే నాయకులు ఇప్పుడు కనీసం ఆకలిచావులు చస్తున్న పట్టించుకునే విజ్ఞత కరువైంది.

సుదూర దూరాలకు పయనమైన కార్మికులు ప్రమాదాలకు గురై చనిపోతున్నారు.రైలు పట్టాలపై సేదతీరుతున్న కార్మికుల గుండెలు ఛిద్రమయ్యాయి.కాలినడకన అర్ధరాత్రిపూట నడుస్తున్న పాదాచారులపై బస్సుల ప్రమాదానికి గురై చనిపోతున్న కనీసం కనికరించే ఆలోచన చేసే సమయం కూడా ప్రమాదాలకు పట్టింపులు లేనట్లు ఉంది.

వలస కార్మికులు ఇప్పుడు దేశం వెలివేసిన అనాధలయ్యారు,ప్రభుత్వాలు పట్టించుకోని నిరాశ్రయులయ్యారు.నగరాలు అత్యధికంగా అభివృద్ధి చెందినయనే సోయితో వలసబాట పడ్తారు ఏ కార్మికులై కానీ కనిపించే అద్దాలమాటున ఏ మానవత్వమున్న మనుషుల జాడ కరువైందనీ ఇప్పటికే ప్రతీ కార్మికుడికి అర్థమైన తాత్వికత.శ్రామికుల ద్వారా రక్తంపిండుకొని చాలీచాలనీ వేతనం ఇచ్చి చేతులు దూలుపుకునే తత్వం పెరిగిపోయింది ఇప్పుడు సరిగ్గా ప్రభుత్వాలు కూడా ఇదే ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయి.
దేశం నలుదిశల అభివృద్ధి చెందాలంటే కార్మికుడు చెమట చిందించాల్సిందే
ఇలా మూర్ఖత్వపు విధానాలతో కార్మికులపైన సంకుచితంగా ఆలోచిస్తే రేపటి నిర్మాణరంగం ఊహకే అందకుండా ఉంటుంది.
ఆర్థిక మూలాలతోనే దేశపు స్థూల దేశీయోత్పితోనే దేశపు అభివృద్ధి ని గణిస్తారు ఒకవేళ ఏ కార్మికుడు కూడా వలసలకు దూరమై ఉన్న ప్రదేశంలోనే ఉపాధి కోరుకుంటే రేపటి దేశ ఆర్థిక చిత్రపటం మరొల మారిపోవడం ఖాయం.

అవని శ్రీ, సామాజిక విశ్లేషకులు
9985419424

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!