ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆయా ఆలయాల్లో క్యూ కట్టారు. నగర శివార్లలో ఉన్న జిల్లెలగూడలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సీఎం కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. వేకువజామున మత్స్య వేంకటేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 4 గంటలకు ఆలయానికి చేరుకున్న శ్రీమతి శోభ, కవితకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజానంతరం ఆలయ అర్చకులు వారికి ప్రసాదాలు అందజేశారు.
స్వామివారిని దర్శించుకున్న కవిత.. రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానని చెప్పారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎర్రగడ్డలోని విజయలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న స్పీకర్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన ముక్కోటి ఏకాదశి వేడుకల్లో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. ఉదయం ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవాతి రాథోడ్.. ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, బంధుమిత్రులతో కలిసి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆ స్వామిని దర్శించుకోవడం మహద్భాగ్యమని, భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి చల్లని చూపులు ఈ రాష్ట్రం ద ఎప్పటికీ ఉండాలని, అందరూ సుఖ, సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని కోరుకున్నట్లు తెలిపారు.