శ్రీస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భక్తులతో శుక్రవారం నిండిపోయింది.లక్షలాది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వేములవాడకు విచ్చేయడంతో అన్ని రోడ్లు,ఖాళీస్దలాలు,వీధులు నిండిపోయాయి.వేలాది భక్తులు గురువారం అర్ధరాత్రి నుండి ధర్మగుండంలో స్నానాలాచరించి,శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి,కోడె మొక్కులు చెల్లించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు.ఈ భక్తులంతా శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి కనీసం 4గంటల పాటు క్యూలైన్లలో వేచిఉండాల్సి వచ్చింది.
ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీస్వామివారికి పట్టువస్త్రాలను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సోమవారం ఉదయం సమర్పించారు.ఈ పట్టువస్త్రాలను సమర్పించే క్రమంలో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోగా పోలీసులు గట్టి బందోబస్తును బందోబస్తును నిర్వహించారు..అంతకు ముందు టిటిడి తరపును వేములవాడకు విచ్చేసిన అధికారులు,అర్చకుల బృందం రాజన్న గుడికి చేరుకుని పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ పర్వదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీస్వామివారిని దర్శించుకున్నారు.వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్,మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాల్కిషన్,ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు,ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి,రాష్ట్ర ఆర్ధిక సంస్ధ చైర్మన్ గొడిసెల శాజేశం గౌడ్,రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్,రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తదితరులు శ్రీస్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్న సమయంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు వేములవాడకు చేరుకుని శ్రీస్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వారందరిని ఇఓ కృష్ణవేణి సత్కరించి,శ్రీస్వామివారి ప్రసాదాలను అందజేశారు. సాయంత్రం ఆరుగంటలకు శ్రీస్వామివారి కళ్యాణమండపంలో స్ధానాచార్య అప్పాల భీమాశంకర్ శర్మ,ప్రధానార్చకులు సురేశ్,ఉమేశ్,శరత్,నమిలికొండ రాజేశ్వరశర్మ తదితర వేదపండిల అధ్వర్యంలో మహాలింగార్చనను,అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శ్రీస్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.ఇదే సమయంలో వేలాది భక్తులు ఆలయ ఆవరణలో,తాము బస చేసిన స్థలాల్లో జాగరణలు చేయగా,భాసా సాంస్క్కతిక శాఖ అధ్వర్యంలో సోమవారం రాత్రి నుండి మంళవారం వేకువ జాము వరకు శివార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.