- ఏర్పాట్లు సొంతంగా చేసుకోవాలి
- అన్ని రాష్ట్రాల సిఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతున్న నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి నిల్వలు, పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌తో కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రత్యేకించి కంటైన్మెంట్ జోన్లలో పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 4.5 లక్షలు వరకు ఉన్నాయని, రికవరీశాతం కూడా పెరుగుతోందన్నారు. కంటైన్మెంట్ల నిర్వహణ, టెస్టుల సంఖ్యను పెంచాలన్నారు. వీటి వల్ల కోవిడ్ కేసులను ముందే గుర్తిస్తే సమాజంలో వ్యాప్తిని నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు.