Take a fresh look at your lifestyle.

టీకా ధరలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారు

  • ఆక్కిజన్‌ ‌తదితర సమస్యలపై నివేదిక ఇవ్వండి
  • అన్ని రాష్ట్రాలకు సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలు
  • హైకోర్టులు స్థానిక అంశాల ఆధారంగా ఆదేశాలు ఇవ్వాలి
  • కొరోనా విజృంభణతో సుప్రీమ్‌ ‌కోర్టు సుమోటో కేసు
  • కీలక వ్యాఖ్యలతో శుక్రవారానికి వాయిదా

కొరోనా వైరస్‌ ‌టీకాలు, ఇతర అత్యవసర మందుల ధరలను నిర్ణయించేం దుకు అన్వయించిన సూత్రం, హేతుబద్ధతను వివరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దేని ఆధారంగా టీకాల ధరలను నిర్ణయించారో కూడా అఫిడవిట్లో వెల్లడించాలని జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ ‌పేర్కొన్నారు. దేశం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు సుప్రీమ్‌ ‌కోర్టు మౌన ప్రేక్షకుడిలాగా ఉండకూడదు. సుప్రీమ్‌ ‌కోర్టు పాత్ర అభినందనీయంగా ఉండాలని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.  ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య మౌలిక సదుపాయాలైన ఆక్సిజన్‌ ‌కొరత, ఇతర సమస్యలకు సంబంధించి గురువారం సాయంత్రం 6 గంటల కల్లా రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా అఫిడవిట్‌ ‌దాఖలు చేయాలని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంపై శుక్రవారం మధ్యాహ్నం విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. హైకోర్టులు కూడా మార్గదర్శకాలు జారీ చేసేందుకు వెనుకాడవద్దని సుప్రీమ్‌ ‌పేర్కొంది.

తమ పరిథిలోని రాష్ట్రాల్లో కేసులను విచారించడంతో పాటు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తమ కంటే హైకోర్టులకే ఎక్కువ అవగాహన ఉంటుందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగా భారత్‌ ‌బయోటెక్‌ ‌తాము తయారు చేసిన కొవిడ్‌-19 ‌కొవాగ్జిన్‌ ‌ధరను రాష్ట్రాలకు రూ.600గానూ, ప్రయివేట్‌ ‌హాస్పిటళ్లకు రూ. 1200 గానూ నిర్ణయించిన విషయం తెలిసిందే. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా తమ ’కొవిషీల్డ్’ ‌టీకా ధరను రాష్ట్రాలకు రూ.400గా నిర్ణయించగా… ప్రయివేట్‌ ‌హాస్పిటళ్లకు రూ.600గా నిర్ణయించింది. మరోవైపు ఈ రెండు టీకాలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రం రూ.150కే  లభిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. యావత్‌ ‌భారత్‌ ‌కొరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరుణంలో తాము పేక్రక్షపాత్ర పోషించలేమని సుప్రీమ్‌ ‌కోర్టు ఈ సందర్భంగా  పేర్కొంది. కొరోనా మహమ్మారి కారణంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యను సుమోటోగా స్వీకరించిన అత్యున్నత దర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పలు రాష్ట్రాల్లో పరిస్థితులను పర్యవేక్షించడానికి హైకోర్టులు మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ… ఇటువంటి సంక్షోభ సమయంలో తాము నిశ్శబ్దంగా ఉండలేమని జస్టిస్‌ ‌డివై. చంద్రచూడ్‌, ఎల్‌ .‌నాగేశ్వరరావు, రవీంద్రనాథ్‌ ‌భట్‌ ‌ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రాల మధ్య జరుగుతున్న సహాయ సహాకారాలను ప్రోత్సహించడమే తమ విధి అని తెలిపింది. జాతి ప్రయత్నాలను సమన్వయ పరచడం కోసం అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడం ఎంతో అవసరం.

ఈ సమయంలో స్పందించ కుండా..మౌనంగా ఉండటం సరైనది కాదు’ అని అభిప్రాయపడింది. ఆర్టికల్‌ 222 ‌ప్రకారం హైకోర్టులకున్న అధికారాలను వినియోగించుకోకుండా అడ్డుపడలేమని స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము పరిపూర్ణమైన పాత్ర పోషించాలని అనుకుంటున్నామని, హైకోర్టులు పరిష్కరించలేని సమస్యలను తాము మార్గం చూపడతామని తెలిపింది. దేశంలో కరోనా నియంత్రణ చర్యలపై సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గతవారమే విచారణ చేపట్టింది. తొలుత అప్పటి చీఫ్‌ ‌జస్టిస్‌ ఎస్‌.ఎ.‌బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. పెరుగుతున్న కోవిడ్‌ ‌కేసుల దృష్ట్యా తీసుకుంటున్న కార్యాచరణపై వివరాలు అందించాలని సుప్రీమ్‌ ‌కోర్టు కేంద్రాన్ని కోరిన సంగతి విదితమే. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ ప్రణాళికను తాజాగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఆక్సిజన్‌ ‌లభ్యత, రాష్ట్రాల ఆక్సిజన్‌ అవసరాలు, కొరోనా తీవ్రత ప్రాంతాల్లో చర్యలు, టీకా లభ్యత వంటి వివరాలను అందించాలని సుప్రీమ్‌ ‌కోర్టు కేంద్రాన్ని కోరింది. గురువారం సాయంత్రం నాటికి నివేదిక అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Leave a Reply