కేంద్రప్రభుత్వాన్ని కోరిన టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్.
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ: వేక్సిన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ లాబొరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ప్రపంచ వేక్సిన్ రాజధానిగా ఉందని, ఆరు బిలియన్ డోసులు ప్రతీ ఏడాది హైదరాబాద్ లో తయారవుతున్నాయన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చారు. అయితే వేక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం హైదరబాద్‌లోని వేక్సిన్ తయారీదారులు తప్పనిసరి పరిస్థితుల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని కసోలిలో ఉన్న సెంట్రల్ డ్రగ్ లేబరేటరీకి పంపించాల్సి వస్తోందని, ఈ కారణంగా వేక్సిన్ మార్కెట్లోకి విడుదల అయ్యేందుకు ఆలస్యం అవుతున్నది అని కేంద్రం దృష్టికి తెచ్చారు.
బుధవారం లోక్‌సభలో జరిగిన అనుబంధ మరియు ఆరోగ్య సంరక్షణ వృత్తుల జాతీయ కమిషన్ బిల్లు–2021పై బీబీ పాటిల్ మాట్లాడారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని కోరారు. ఇటీవల కేంద్రం మంజూరు చేసిన 157 మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు కనీసం ఒక్కటి కూడా కేటాయించలేదని అన్నారు. అంతేగాక దేశ హెల్త్ కేర్ రంగంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. రాబోయే రోజుల్లో వచ్చే ఆరోగ్య కర అత్యవసర పరిస్థితులకు తగ్గట్లుగా మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. హెల్త్ కేర్ రంగాన్ని మరింత పటిష్టపరించేందుకు ఏర్పాటు చేసిన ఈ బిల్లు ద్వారా ప్రొఫెషనల్స్ నైపుణ్యత కారణంగా ట్రీట్మెంట్ ఖర్చు చాలా తగ్గుతుందని అన్నారు.