- ఫ్రంట్ వారియర్స్ కు ప్రాధాన్యత
- రెండవ విడతలో 50 సం .పైబడిన వారు .
- కోవిన్ యాప్ ద్వారా నమోదు ప్రక్రియ
- ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత అధికారుల సమావేశం
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ : కొరోనా వైరస్ వాక్సిన్ పంపిణి జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుందని శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఉన్నత అధికారుల సమావేశంలో నిర్ణయించారు. దేశంలోని కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించి వ్యాక్సిన్ రోల్-అవుట్ వివరాలను ఖరారు చేశారు. మహమ్మారిపై పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న వైద్యులకు, సమాజ ఆరోగ్య కార్యకర్తలకు, పోలీసులకు ముందుగా వాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. సుమారు కోటి మంది ఆరోగ్య కార్యకర్తలు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వాక్సిన్ అందించటానికి తోలి ప్రాధాన్యత ప్రభుత్వం ఇవ్వనున్నది. వీరందరికి కొరోనా వైరస్ నివారించే వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ గత వారం చెప్పిన విషయం తెలిసిందే.
మొదటి విడత తరవాత రెండవ విడత పంపిణీలో 50 ఏళ్లు పైబడిన వ్యక్తులకు వాక్సిన్ అందించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. మొదటి దశలో కొరోనా నివారించే వాక్సిన్ ను సుమారు 30 కోట్ల ప్రజలకి చేరవేయాలి అని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని కేంద్ర ఆరోగ్య శాఖా వర్గాలు తెలిపాయి. కోవిన్ యాప్ (CoWIN App కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్) వ్యవస్థను వుపయోగించి భారీగా వాక్సిన్ పంపిణి నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ద పడనున్నది. అయితే గమనించాల్సింది ఏమనగా ఇంకా యాప్ లాంఛ్ కాలేదు.
అయినా ఇబ్బంది లేదు వాక్సిన్ ను లబ్ధిదారులకు చేర్చేందుకు ఆధార్ నంబర్లను ప్రభుత్వం ఉపయోగిస్తుంది అని చెబుతున్నారు. వాక్సిన్ వేసే తేదీ..సమయం వంటి వివరాలు 12 భాషలలో తయారు చేసి సెల్ ఫోన్ సందేశాలను ప్రభుత్వం..ప్రజలకి పంపనుంది. తోలి దశలో వోటరు జాబితా నుండి డేటాను ప్రభుత్వం వాడుకోనుంది. డేటాలో సమస్య వచ్చినట్లయితే సదరు పౌరుడు తనను తాను నమోదు చేసుకోవడానికి జిల్లా లేదా బ్లాక్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చు.
కోవిద్-19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ సునీలా గార్గ్ మాట్లాడుతూ, 50 ఏళ్లలోపు వారు వైద్య ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేసి తమను తాము నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు. యాప్ ప్రారంభించిన తర్వాత సాధారణ ప్రజలు యాప్ ను ఉపయోగించినప్పుడు మూడు రిజిస్ట్రేషన్ ఎంపికలు కనిపించనున్నాయి . వాక్సిన్ పంపిణీకి సంబంధించి ఖచ్చితమైన లాజిస్టిక్స్ ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రజలకు యాప్ గురించి తెలిపి తమను తాము నమోదు చేసుకోవడానికి శిక్షణ ఇచ్చేందుకు కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలు వేయించుకోటానికి ప్రభుత్వం శిబిరాలను నిర్వహించవచ్చు.
వ్యాక్సిన్ డెలివరీ వ్యవస్థను పరీక్షించటానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా రెండు టెస్ట్ పంపిణి డ్రైవ్ లను నిర్వహించింది. ఇవి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 737 జిల్లాలలో శుక్రవారం నిర్వహించబడినాయి. దేశంలో అత్యవసర ఉపయోగం కోసం రెండు వాక్సిన్ లను గత ఆదివారం ప్రభుత్వం ఆమోదించింది. భారత్ బయోటెక్ కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్. దీనిని ఆస్ట్రాజెనెకా మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేశాయి.వాక్సిన్ తయారీ పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. వాక్సిన్ రెండు-మోతాదుల్లో ఉంటుంది. కొరోనా వైరస్ నుండి రక్షణ కోసం సగటు వ్యక్తికీ రెండు వాక్సిన్ మోతాదుల అవసరం ఉంటుంది. వాక్సిన్ ను సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రతలలో (రెండు నుండి ఎనిమిది డిగ్రీల సెల్సియస్) నిల్వ చేయవచ్చు. అంచేత ఈ వాక్సిన్ దేశంలోని జనాభాకు అందించటం, రవాణా చేయడం మరియు నిల్వ చేయడం సులభం అవుతుంది.