Take a fresh look at your lifestyle.

వాక్సిన్‌ ‌వివాదం

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కొరోనా వైరస్‌ను నిరోధించేందుకు  దేశ ప్రజలందరికీ సత్వర వ్యాక్సిన్‌ ‌వేయటం ఒక్కటే సరైందిగా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు దేశంలో వ్యాక్సిన్‌ ‌కొరత మరింత ఆందోళనను కలిగిస్తున్నది. దేశ ప్రజలందరికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్‌ ‌వేయాలని రాష్ట్రాలు, రాజకీయ పక్షాలు డిమాండ్‌ ‌చేస్తుండగా, రాష్ట్రాలే తమకు కావాల్సిన వాక్సిన్‌లను కొనుగోలు చేయాలని కేంద్రం చెబుతుండడం వివాదస్పదంగా మారింది. అంతేగాక వ్యాక్సిన్‌ ఉత్పత్తి దారులు కేంద్రానికి ఇస్తున్న ధర వేరు, రాష్ట్రాలకు ఇస్తున్న ధర వేరు కావడం కూడా విమర్శలకు దారితీస్తున్నది. ఈ విషయాన్ని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రశ్నించింది.

కేంద్ర, రాష్ట్రాలకు అందించే వ్యాక్సిన్‌లో తేడాలేమిటంటూ, దానిపై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది కూడా. ఇదిలా ఉంటే మహమ్మారిలా రోజురోజుకు విస్తరిస్తున్న ఈ వైరస్‌ ‌నుండి ప్రజలను కాపాడే వ్యాక్సిన్‌పై కేంద్రం జిఎస్టీ విధించడం  పట్ల దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి.  కేంద్రం వ్యాక్సిన్‌పై 5శాతం పన్ను విధిస్తున్న విషయం తెలిసిందే. ఒక్క వ్యాక్సిన్‌ ‌మీదే కాకుండా కోవిద్‌ ‌సోకిన వారికి వా  ఔషధాలపైనకూడా 12శాతం జీఎస్టీని విధించడంపై ప్రతిపక్ష పార్టీలు, మేధావి వర్గం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.  అయినా కేంద్రం ససేమిరా అంటోంది. వ్యాక్సిన్‌పైన జీఎస్టీని ఎత్తివేస్తే మార్కెట్‌లో దాని ధర విపరీతంగా పెరిగే అవకాశాలుంటాయని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌పేర్కొనడంతో రాజస్థాన్‌ ‌రాష్ట్ర మంత్రి ప్రతాప్‌ ‌ఖచరియవస్‌ ‌తీవ్రంగా ఆక్షేపించారు. ఒక పక్కన దేశంలో లక్షల సంఖ్యలో ప్రజలు మరణిస్తుంటే  వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వాల్సిందిపోయి, దానికి ధర నిర్ణయించడమే కాకుండా, జీఎస్టీ అమలుచేయడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో కాంగ్రెస్‌ ‌కేంద్రాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. మోదీ సర్కార్‌ ఇలాంటి అనుచిత, ఆనాలోచిత విధానాలవల్లే దేశం ఇప్పుడు ప్రమాద పరిస్థితిని ఎదుర్కుంటున్నదంటోంది కాంగ్రెస్‌. ‌తాజాగా సమావేశమైన సిడబ్లుసి సమావేశం వ్యాక్సిన్‌ ‌విషయంలో కేంద్రం శాస్త్రీయంగా వ్యవహరించడం లేదని, ఇప్పటికైనా నిపుణుల సలహాలు తీసుకోవాలని, దీనిపై అఖిలపక్ష భేటీని నిర్వహించాలని డిమాండ్‌ ‌చేస్తూ తీర్మానించింది. అంతకు ముందు కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు రాహుల్‌గాంధీ దీనిపై తీవ్రంగా స్పందించారు. భారతదేశాన్ని బిజెపి విధానాల బాధిత  దేశంగా మార్చవద్దని కేంద్రానికి తన ట్విట్టర్‌ద్వారా విజ్ఞప్తి చేశారు. సామాన్య ప్రజలు తమ డబ్బును, ఆరోగ్యాన్ని చివరకు జీవితాన్ని కోల్పోతున్నారన్నారు. తన మిత్రులకు మేలు చేసే దిశగా మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆయన అందులో విమర్శించగా, బిజెపి రాష్ట్రాలు ఇప్పటికే  పేదలకు, అణగారిన ప్రజలకు టీకాలను ఉచితంగా వేస్తున్నట్లు ప్రకటించాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కాంగ్రెస్‌కు రాత  పూర్వకంగా నాలుగు పేజీల ఘాటైన సమాధానమిచ్చాడు. బిజెపి రాష్ట్రాలు ప్రకటించినట్లు కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలు ప్రకటించగలవా అంటూ ఆయన సవాల్‌కూడా చేశారు.

ఇదిలాఉంటే రాష్ట్రాలకు కావాల్సిన వ్యాక్సిన్‌ ‌డోసుల్లో కోతపెట్టి కేంద్రం వ్యాక్సిన్‌ అమ్ముకుంటున్నదని ఢిల్లీ డిప్యూటీ సి.ఎం మనీష్‌ ‌సిసోడియా కేంద్రంపై విరుచుకు పడుతున్నారు. దేశంలో మరణ మృదంగం మోగుతుంటే తమకేమీ పట్టనట్లు మోదీ ప్రభుత్వం 6.5 కోట్ల వ్యాక్సిన్‌ను విదేశాలకు సరఫరాచేసిందని ఆయన ఆరోపిస్తున్నారు.  వాస్తవంగా ఢిల్లీకి 1.34 కోట్ల వ్యాక్సిన్‌ అవసరమని కేంద్రాన్ని కోరితే కేవలం 5.5 లక్షల వ్యాక్సిన్‌ను మాత్రమే కేంద్రం అందించిందంటూ ఆయన తాజాగా ఆరోపించడం గమనార్హం.
కాగా కేంద్రం అందిస్తున్న వ్యాక్సిన్‌ల సరఫరా ఏమాత్రం సరిపోవడంలేదని తెలంగాణ సిఎస్‌ ‌సోమేష్‌కుమార్‌ అం‌టున్నారు. తాము లక్షల్లో వ్యాక్సిన్‌ ‌కోరితే కేంద్ర ప్రభుత్వం కేవలం 3.90 లక్షల వ్యాక్సిన్‌ ‌మాత్రమే ఇచ్చిందంటున్నారు. తెలంగాణలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలున్నప్పటికీ  రాష్ట్రాలకు సరఫరాచేసే నిర్ణయం మాత్రం కేంద్రానికే ఉందంటున్నారు. రాష్ట్రంలో 18 నుండి 44 ఏళ్ళ వయస్సున్న వారి సంఖ్య 1.70 కోట్లుండగా, వారికోసం 3.40 కోట్ల వ్యాక్సిన్‌ అవసరముందని, ఇందుకోసం  ఇతర దేశాల టీకా తయారి దారులతో సంప్రదించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సోమేష్‌కుమార్‌ అం‌టున్నారు. ఏపితోపాటు ఇతర రాష్ట్రాలుకూడా ఇప్పుడు వ్యాక్సిన్‌కోసం గ్లోబల్‌ ‌టెండర్లను ఆహ్వానించే కార్యక్రమంలో తలమునలకలవుతున్నాయి.

Leave a Reply