కొరోనా నిరోధానికి దేశీయ టీకాలను వేసే కార్యక్రమం మూడో రోజున కూడా ఎటువంటి ఫిర్యాదులు లేకుండా సజావుగా కోలాహలంగా సాగుతోంది. ఈ టీకాలను దేశీయంగా ఉత్పత్తి చేయడం వల్ల అనుమానాలు వ్యక్తం చేసిన వారు సైతం ఇప్పుడు ఇవి బాగానే ఉన్నాయనీ,సైడ్ ఎఫెక్టులు లేవని చెబుతున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా అభివర్ణితమైన డాక్టర్లు, నర్సులు, పోలీసు సిబ్బంది,అధికారులకు ఈ టీకాలు వేయడంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. తాను ఈ టీకా తీసుకున్న తర్వాత ఎటువంటి తేడా తనకు కనిపించలేదని దిల్లీ లోని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. అలాగే, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ తదితర నగరాల్లో కూడా వైద్యులు ముందు వరసలో ఉండి టీకాలు తీసుకున్నారు. కొరోనా సృష్టించిన భయం కారణంగా ఈ టీకాలు తీసుకునేందుకు జనం వెనకడుగు వేయడం సర్వసాధారణమే, కానీ, ఒకరిద్దరు మినహా అందరూ ఈ టీకాల వల్ల సైడ్ ఎఫెక్టులు లేవని చెబుతుండటంతో జనానికి ధైర్యం వస్తోంది.
ఇంతకుముందు విముఖంగా ఉన్నవారు సైతం టీకాలు వేయించుకునేందుకు ముందుకు రావడం శుభ పరిణామం. భారత్ వంటి అతి పెద్ద దేశంలో ఈ టీకాల కార్యక్రమం ఎటువంటి హడావిడి లేకుండా సాగడం చెప్పుకోదగిన విషయం. ప్రభుత్వం ముఖ్యంగా , వైద్య ఆరోగ్య శాఖ మరికొన్ని రోజులు ముందే ఈ టీకాల పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేయడానికి వైద్యులు,ఈ రంగానికి చెందిన ప్రముఖులు తమ అనుభవాలను ఒక్కొక్కరూ తెలియజేస్తున్నారు. ఈ టీకా వేయించుకున్న తర్వాత తాను మామూలుగానే విధులకు హాజరవుతున్నాననీ, తనలో ఎటువంటి మార్పు రాలేదని ఎయిమ్స్ డైరక్టర్ గులేరియా చెప్పారు. టీకాలు వేయించుకోవడానికి ప్రజల్లో కొందరు మొదటి రోజున సందేహాలను వ్యక్తం చేసినా రెండో రోజు నుంచి స్వచ్ఛందంగా ముందుకు రావడంతో పండుగ వాతావరణం కనిపించిందని బెంగళూరుకు చెందిన ప్రముఖ వైద్యుడొకరు చెప్పారు.అలాగే,ఇతర నగరాల్లో కూడా పలువురు వైద్య ప్రముఖులు తమ అనుభవాలను తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ టీకాల కార్యక్రమం జోరుగానే సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీకాలు వేసే ప్రదేశానికి వెళ్ళి టీకాలు వేయించుకున్న వారికి వెన్నుతట్టి ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వాధినేత తమకు ధైర్యం చెప్పడంతో వారిలో కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేం. అంతేకాకుండా ఎక్కడా లోపాలు లేకుండా ఒక సమాహారంగా టీకాలు వేసే కార్యక్రమం సాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించవచ్చన్న నమ్మకం ఇంతవరకూ అనుమానాలు వ్యక్తం చేసినవారికి సైతం కలుగుతోంది.ఇది మంచి పరిణామం. టీకాలు వేయించుకున్న ప్రముఖ వైద్యులు వెల్లడిస్తున్న స్వీయ అనుభవాలు ఈ కార్యక్రమానికి ఊపిరి కానున్నాయి. బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ ప్రధాన వైద్యాధికారి తనకు టీకా వేయించుకున్న తర్వాత ఎటువంటి ఎఫెక్ట్సు కలగలేదనీ, చాలా సాధారణంగానే ఉన్నానని చెప్పారు.అలాగే , కోల్ కతా, ముంబాయి. తదితర నగరాల్లో వైద్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా వేలాది కేంద్రాల్లో ఒకే సారి టీకాలు వేసే కార్యక్రమం అమలు జరగడం అపూర్వమైన విషయం. ఎక్కడా కమ్యూనికేషన్ లోపం లేకుండా అంతా సజావుగా సాగడం సంతోషించాల్సిన విషయం. కొన్ని చోట్ల టీకాలు వేయించుకున్నవారు కళ్ళు తిరిగినట్టు ఫిర్యాదు చేశారనీ, కొందరికి వళ్ళు పలవరింతగా అనిపించినట్టు కనిపించినట్టు చెప్పారని వైద్యాధికారులు తెలిపారు.ఇవన్నీ, ప్రాథమికమైన ఫిర్యాదులేననీ, కొద్ది గంటల సేపు ఇలాంటివి సహజమని వైద్యరంగం నిపుణులు చెబుతున్నారు.
కొరోనాని అరికట్టడంలో ఈ రెండు స్వదేశీ వ్యాక్సిన్లు బాగా ఉపయోగ పడితే భారత దేశం ఘనవిజయం సాధించినట్టే. తొలి డోస్ తీసుకున్న తర్వాత పన్నెండు రోజులకు 30 నుంచి 40 శాతం యాంటీ బాడీలు వృద్ధి అవుతాయనీ, నాలుగు వారాలకు 60-70 శాతం యాంటీ బాడీలు వృద్ధి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. టీకా తీసేసుకున్నాం కనుక ఇంకేం ఫర్వాలేదనే ధైర్యం పనికి రాదనీ, ఇంతకుముందు ఏ జాగ్రత్తలు పాటించారో వాటిని కొనసాగించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.అలసటగా ఉంటే విశ్రాంతి తీసుకోవచ్చు. తమ అనుభవాలను పంచుకోవడానికి జనంలోకి వెళ్ళకూడదు. ధూమపానం, మద్యపానం వంటివాటిని దూరంగా పెట్టడం మనమంచికేనని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. కొరోనా నియంత్రణకు చాలా మంది ఇప్పటికే జాగ్రత్తలు పాటిస్తున్నారు. వాటిని కొనసాగించడంలో పెద్ద ఇబ్బందులేమీ ఉండవు. అంతేకాకుండా ఇంటిపట్టున ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. టీకా వేయించుకుంటే బయట స్వేచ్ఛగా తిరగొచ్చన్న అభిప్రాయం తప్పు.
ఏ వైద్యానికైనా ముందు జాగ్రత్తలతో పాటు తర్వాత జాగ్రత్తలు కూడా అవసరమే. వంద శాతం యాంటీ బాడీలు వృద్ధి చెందకపోతే పూర్తి రక్షణ లభించదని చెబుతున్నారు. అంతేకాకుండా, 28 రోజుల్లో రెండో డోస్ టీకా తీసుకోవాలనీ, అశ్రద్ధ చేస్తే ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు. కొరోనా నుంచి బయటపడేందుకు ఎన్నో కష్టాలు పడ్డాం.ఇప్పటికీ పడుతున్నాం,ఈ తరుణంలో జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారి నుంచి పూర్తి విజయం సాధించనట్టే. మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సాగడాన్ని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభినందించారు. ప్రభుత్వం స్వయంగా పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు అభినందించారు. ఇతర దేశాల్లో ఈ రకమైన రీతిలో సంఘటితంగా కార్యక్రమం జరగడం లేదు. అందుకు తగ్గట్టు ఫైజర్ టీకా తీసుకున్న వారు నార్వేలో 19 మంది మరణించినట్టు వార్తలు వొచ్చాయి. మన దేశంలో అటువంటి విపరిణామాలు సంభవించకపోవడం అదృష్టమే.