- ముందు ఫ్రంట్ వారియర్స్‌కు వ్యాక్సిన్
- లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
- ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు
- ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించనున్న అధికారులు
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ శనివారం అంటే నేటి నుంచి ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాక్సినేషన్ పక్రియను ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. ఒకేసారి 3,006 ప్రదేశాల్లో వ్యాక్సిన్ కార్యక్రమం మొదలవుతుంది. మొదటిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇస్తారు. కాగా, తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తారు. కొవిన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పక్రియను అధికారులు పరిశీలించనున్నారు. ఈ వ్యాక్సినేషన్ పక్రియ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు గాను ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్ – 1075కు ఫోన్ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో సిబ్బంది సందేహాలను అధికారులు నివృత్తి చేస్తారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కొవిన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పక్రియను అధికారులు పరిశీలించనున్నారు.
ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ ఇమ్యునైజేషన్ పోగ్రాం మన దేశంలో జరగనుంది. రెండు డోసుల వ్యాక్సిన్ ఒకే కంపెనీకి చెందినదై ఉంటుంది. రెండు కంపెనీల వ్యాక్సిన్ ఒక వ్యక్తికి ఉపయోగించరు. కాగా గర్భవతులకు, బాలింతలకు ప్రస్తుతానికి వ్యాక్సిన్ వేయరు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన విధివిధాలను పంపింది. దీనితో పాటు కోవిషీల్డ్‌కు సంబంధించిన ఫ్యాక్ట్‌షీట్ కూడా జతచేసింది. ఈ ఫ్యాక్ట్‌షీట్‌లో వ్యాక్సినేషన్ డోసు, కోల్డ్ స్టోరేజ్ మొదలైన వివరాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేయాల్సినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానిలో తెలియజేశారు. ఇదిలావుంటే దేశరాజధాని ఢిల్లీలో ముందుగా 81 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ తెలిపారు.
వ్యాక్సినేషన్ వివరాలు వెల్లడించేందుకు కేజీవ్రాల్ ప్రత్యేక మిడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ఎంపికచేసిన కొన్ని ప్రాంతాల్లో రోజుకు వందమందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ విధంగా రోజుకు 8,100 మందికి టీకాలు వేయనున్నారు. వారంలో నాలుగు రోజులు అంటే సోమ, మంగళ, గురు, శనివారాలలో టీకాలు వేయనున్నారు. తరువాతి కాలంలో ఈ టీకా కేంద్రాలను 1000 వరకూ పెంచనున్నా మని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ప్రస్తుతానికి 2,74,000 టీకాలు అందాయన్నారు. టీకాలు వేసేందుకు ఢిల్లీలో పూర్తిస్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఒక్కోవ్యక్తికి రెండు డోసుల వ్యాక్సిన్ వేయనున్నారని తెలిపారు. ప్రస్తుతానికి ఢిల్లీకి అందిన వ్యాక్సిన్‌ను తొలుత ఆరోగ్య కార్యకర్తలకు వేయనున్నారన్నారు.