- అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ల సరఫరా
- 18 ఏళ్లు నిండిన వారందరికీ 21 నుంచి వ్యాక్సిన్
- ప్రైవేట్ హాస్పిటల్స్ సర్వీస్ ఛార్జి కేవలం రు.150 మాత్రమే
- జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ
రాష్ట్రాలు వ్యాక్సిన్‌పై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనీ … వ్యాక్సినేషన్ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. వ్యాక్సిన్లు ఇచ్చే విషయంపై కేంద్రం, రాష్ట్రాలు కలసి రూట్‌మ్యాప్ రూపొందిస్తాయని కూడా అన్నారు. సోమవారం సాయంత్రం జాతిని ఉద్దేశించిన మాట్లాడిన ప్రధాని మోడీ పలు నిర్ణయాలు ప్రకటించారు. కోవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ లభ్యత, స్వదేశీ వ్యాక్సిన్ల అభివృద్ధి తదితర కీలక విషయాలపై జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
ప్రస్తుతం 25 శాతం వ్యాక్సినేషన్ వర్క్ రాష్ట్రాలు చేస్తున్నప్పటికీ, ఇప్పుడు కేంద్రం ఆ బాధ్యత కూడా తీసుకుంటుందని, రాబోయే రెండు వారాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. ఈనెల 21 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్నట్టు కూడా ప్రధాని ప్రకటించారు. ప్రైవేటు హాస్పిటల్స్ వ్యాక్సిన్లపై సర్వీస్ చార్జి కింద కేవలం రూ.150 మాత్రమే వసూలు చేయాల్సి ఉటుందని కూడా ఆయన స్పష్టం చేశారు.